సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నకేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు

Mar 2, 2024 - 18:15
 0  0

 సమన్యాయ పాలన  నేతి బీర లోని   నెయ్యి వంటిదే.

 సర్వోన్నత న్యాయస్థానం చురకలు అంటించినా  మారని ప్రభుత్వ తీరు .

సంస్కరణ, ప్రక్షాళన జరిగి  ప్రజలకు పార్లమెంటుకు జవాబుదారీ అయినప్పుడే  ఈ సంస్థల స్వతంత్రత సాధ్యం.

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాములో  సిబిఐ, ఇడి  ప్రతిపక్షాలకు సంబంధించిన  నాయకులపై  దాడులకు పాల్పడినట్లుగా అనేక ఆరోపణలు ఉన్నాయి.  ఈ విషయాన్ని రుజువు చేస్తూ  14 రాజకీయ పార్టీలు 2023 సంవత్సరంలో  కేంద్రం దర్యాప్తు సంస్థల్ని  తమ పైకి ఉసుగో ల్పుతున్నాయని సర్వోన్నత న్యాయస్థానానికి  మొరపెట్టుకొనీ  తమ కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని కోరినప్పటికీ  చట్టం ముందు ప్రజలు రాజకీయ నాయకులు సమానమేనని  ప్రత్యేక ఆదేశాలు సాధ్యం కాదని  కొట్టివేసిన  తీరు  న్యాయస్థానం చొరవను  ఈ సందర్భంగా స్వాగతించవలసి ఉన్నది.  చట్టం ముందు అందరూ సమానులేననీ "సమ న్యాయ పాలన* సిద్ధాంతం  హెచ్చరిస్తుంటే  అధికారంలో ఉన్న వారి అణుంగు సహ చర్లకు  అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు  చట్టం తన పని తాను చేసుకుపో తుందని దర్యాప్తు సంస్థల గురించి  కేంద్రం  చిలుక పలుకులు పలికినా  పక్షపాత ధోరణికి మాత్రం  కొదవలేదు.  ఇందులో భాగమే అనేక సార్లు కేసుల వాయిదా తో పాటు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంటి అవినీతిపరులు  ముఖ్యమంత్రిగా కొనసాగుతూ దోపిడిని  చట్టబద్ధం చేసిన తీరు  చూస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలు   చోద్యం చూస్తున్నాయా! అని అనిపించక మానదు.  ముఖ్యంగా తమిళనాడు పశ్చిమబెంగాల్  వంటి చోట్ల ఇ డి దాడుల్ని అడ్డుకోవడంతో పాటు  ఆ సంస్థ సిబ్బంది పైననే  రాష్ట్ర ప్రభుత్వ పక్షాన  ఎదురు కేసులు పెట్టే స్థాయికి పరిస్థితి విషమించినదంటే  సమాఖ్య స్ఫూర్తి కి  విఘాతం కలిగినట్లే కదా !

సమాఖ్య స్ఫూర్తికి  విఘాతం కలిగిస్తున్న దర్యాప్తు సంస్థలపై   సుప్రీం చురకలు:-

    అవినీతి కేసుల్లో అత్యున్నత దర్యాప్తును నిలువరించడానికి తమ అధికారిపై లంచం కేసు పెట్టారని, దాన్ని సిబిఐ కి బదిలీ చేయాలని,    దోషులను శిక్షించాలని  ఇ డి  సుప్రీం ను కోరగా  "ప్రతీకార చర్యలకు పాల్పడుతూ  కేంద్ర దర్యాప్తు సంస్థలు చేసే అరెస్టుల్ని  అడ్డుకోవడానికి పారదర్శక  యంత్రాంగం  తో కూడిన వ్యవస్థ  తప్పనిసరి" అని సుప్రీంకోర్టు  స్పందించిన తీరు  దర్యాప్తు సంస్థలఅస్వ తంత్రతను   తెలియజేస్తున్నది . ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పరస్పరం  అరెస్టులకు పాల్పడితే  దేశం పరిస్థితి ఏమిటని  ప్రశ్నించిన సుప్రీంకోర్టు  అదే సందర్భంలో  రాజకీయ కక్ష సాధింపు అన్న ముసుగులో  బడా నేరగాళ్లు తప్పించుకుపోతే తీరని ద్రోహం  జరుగుతుందని చేసిన హెచ్చరికను  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. " నిర్దోషికి  శిక్ష పడితే ఎంత అనాగరిక చర్యనో  కరుడుగట్టిన నేరగాళ్లు కూడా ఈ ముసుగులో తప్పించుకుంటే  అంతే ద్రోహం జరుగుతుందని  ముఖ్యంగా ప్రభుత్వాలు గుర్తించడం  చాలా అవసరం.  అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ అనుయాయులను  నేర జాబితాల నుండి తప్పించే ప్రయత్నం చేయడం అంటే  అధికార దుర్వినియోగానికి పాల్పడడమే.  ఈ విషయం పైన సీరియస్ గా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం  దర్యాప్తు సంస్థల  ఏర్పాటు  పని విధానం పైన సంస్కరణ ప్రక్షాళన జరగాల్సి ఉన్నదని సూచన చేసింది.  దేశ ప్రజలకు  పార్లమెంట్ కు బాధ్యత వహించే విధంగా వీటిని తీర్చిదిద్దాలని  వస్తున్న విశ్లేషకుల సూచనలను  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తే మరింత సమయోచితంగా ఉంటుంది.

. సిబిఐ ,ఈడి వంటి కేంద్ర సంస్థలకు  స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు  తప్పనిసరి అంటూ  1997లో సుప్రీంకోర్టు  ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో  "ఈ సంస్థలు దర్యాప్తులో ఎవరి ఒత్తిల్లకు లొంగరాదు,  ఏ రకమైన కారణాలకు ప్రభావితం కాకుండా  వ్యవహరించాలి"  అని సూచించినప్పటికీ  ఆ సంస్థలను కేంద్ర ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించేలా ప్రోత్సహించకపోవడం, సందర్భాలను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకునే క్రమంలో  తప్పుడు విధానాలకు,  ప్రతీకారచర్యలకు పాల్పడుతున్నట్లు మనం గ్రహించవచ్చు.  ఇది రాజ్యాంగ రీత్యా నేరం అని కేంద్రం ఇప్పటికీ గుర్తించకపోతే ఎలా ? ప్రస్తుతం భారతదేశంలో  సిబిఐ ఈడి వంటి సంస్థలు  కేంద్ర ప్రభుత్వ  పర్యవేక్షణలో  విచారణ జరుపుతున్న కారణంగా  అనేక ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ పార్టీల నాయకులు పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న  విషయం తెలిసిందే.  అయితే అవినీతిపరులు ఎవరైనా  విచారణ జరగాలి కానీ  కేంద్రం డైరెక్షన్,  అవకాశవాదం వైపు  కొనసాగే ప్రమాదం ఉన్నదని  జగన్  కేసు ద్వారా మనకు అర్థమవుతున్నది. బ్రిటన్ లోనీ" డైరెక్టర్ ఆఫ్   ప్రాసిక్యూషన్స్"  అనే సంస్థ  స్వతంత్రంగా వ్యవహరిస్తూ  తన ఆధ్వర్యంలో దర్యాప్తు సంస్థలను  స్వేచ్ఛగా నడిపిస్తున్న  అంశం పైన స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం  అలాంటి నిష్పాక్షికమైన  సంస్థను భారతదేశంలో నియమించి దాని ఆధ్వర్యంలో సిబిఐ, ఇ డి వంటి సంస్థలు పనిచేసే విధంగా  రూపకల్పన జరగాలని  నిర్దేశించినప్పటికీ ఆ వైపుగా ఎలాంటి చర్యలు కేంద్రం  తీసుకోలేదని పలువురు విమర్శిస్తున్న నేపథ్యంలో  ఆ నిర్లక్ష్యం ఫలితమే  కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు,  రాజకీయ పార్టీలు  కోర్టును ఆశ్రయించడం,  దర్యాప్తు సంస్థలు పరస్పరం దాడులు చేసుకోవడం  వంటి  అపశ్రుతులు చోటుచేసుకోవడం. కొన్ని సంవత్సరాలు  గా  దేశంలో కొనసాగుతున్న  కేసులు, దాడుల తీరును పరిశీలిస్తే  95 శాతం విపక్ష  నేతలపైనే  అనే ఆరోపణల్లో  వాస్తవం ఉందని రాజకీయ పండితులు విశ్లేషకులు  అభిప్రాయపడుతున్న వేళ  దేశంలో సమాఖ్య స్ఫూర్తిని కాపాడవలసిన గురుతర బాధ్యతను  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు  సీరియస్ గా తీసుకోవడం లేదొ  పరిశీలించవలసి ఉన్నది.  దర్యాప్తు సంస్థల కూర్పు, వాటి  అధినాయకత్వం ఏర్పాటు  పూర్తి పారదర్శకంగా స్వతంత్రంగా  కొనసాగినప్పుడే ఈ   అపశృతులకు అడ్డుకట్ట వేయవచ్చు.

---వడ్డేపల్లి మల్లేశం 
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు  అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333