సంక్షోభంలో ప్రభుత్వ విద్యారంగం.

Apr 21, 2025 - 01:08
Jun 4, 2025 - 19:20
 0  7
సంక్షోభంలో ప్రభుత్వ విద్యారంగం.

సమానత్వాన్ని సాధించే కామన్ స్కూల్  విధానానికి భారీ భంగం.

కార్పొరేట్ శక్తులకే పాలకులు  మద్దతిచ్చినప్పుడు  ప్రభుత్వాలను కూడా ప్రైవేటుపరం చేస్తే సరిపోదా?

నెరవేరని రాజ్యాంగ లక్ష్యాల మధ్య  ప్రజాస్వామిక విలువల కోసం పోరాటం తప్పనిసరి.

---  వడ్డేపల్లి మల్లేశం


  రాజ్యాంగంలో ప్రకటించిన లక్ష్యాలు ఆదర్షాలు  విశ్వాసాలను సాధించడానికి అనుకూలమైన విద్యా వ్యవస్థను  కొనసాగించడంలో నాటి నుండి నేటి వరకు ప్రభుత్వాలు  తమ బాధ్యత రాహిత్యాన్ని కనపరుస్తూనే ఉన్నవి.  1964లో ఏర్పాటు చేసిన కొఠారి కమిషన్ తన నివేదిక 66లో కేంద్ర బడ్జెట్లో 10% రాష్ట్ర బడ్జెట్లో 30% విద్యకు నిధులు కేటాయించాలని, కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని,ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని చేసిన సిఫారసులు ఏటిలో పిసికిన చింతపండుగా తయారైనది.  కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 2 శాతం కూడా కేటాయించని స్థితిలో   కేరళ ఢిల్లీ మినహాయిస్తే మిగతా రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఆరు ఏడు శాతం దాటడం లేదంటే  ఇది సంపన్న వర్గాలను కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించే మొక్కుబడి బడ్జెట్ కాక మరేమిటి.? సామాజిక ఆర్థిక పారిశ్రామిక వ్యవసాయక విధానాల  లో రావలసిన మౌలిక మార్పులకు విద్యా విధానం  ప్రాతిపదికగా మారవలసిన తరుణంలో గత ఏడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన ఆర్థిక విధానాల కారణంగా ఆర్థిక అసమానతలు, అంతరాలు భారీగా పెరిగిపోయినాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాత్రుత్వం, న్యాయము,  సమన్యాయ పాలన  కేవలం నినాదాలు  గానే  మిగిలిపోయినాయి కానీ ఆచరణకు నోచుకోలేదు.  పెట్టుబడి దారి భూస్వామ్య సామ్రాజ్యవాద అనుకూల  పరిపాలన కారణంగా ప్రజాస్వామిక  యొక్క శక్తులు ఓడిపోక తప్పలేదు. దాని కారణంగా  ఉద్యమ శక్తులు అణచివేతకు  నిర్బంధానికి గురికావడాన్ని  మనం గ్రహించవలసిన అవసరం ఉంది.  1986లో ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ కాలంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రైవేటీకరణకు నాంది కాగా అవకాశవాద ప్రభుత్వాలు నాటి నుండి నేటి వరకు విద్యను ప్రైవేటుపరం చేయడంలో పోటీపడుతున్న కారణంగా పాఠశాల విద్య నుండి జూనియర్  డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ వైద్య విద్య కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ రంగంలోకి వెళ్లి పోయినవి.  నామ  మాత్రం గా ప్రభుత్వ కళాశాలలుంటే దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అమల్లోకి రావడం వల్ల పేద విద్యార్థులకు చదువు అందకుండా పోయింది.ఇటీవల కాలంలో విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా పోటీ పడడాన్ని  గమనిస్తే మన పాలకుల యొక్క అశ్వతంత్ర విధానాలు సామ్రాజ్యవాద శక్తులకు ఊడిగం చేసే  వైఖరిని మనం అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో శిక్షణను పొంది   మన దేశంలో మన విద్యా విధానాన్ని కొనసాగించాలనే  లక్ష్యాన్ని గతంలో ఢిల్లీ ప్రభుత్వం కొంతవరకు అమలు చేసింది కానీ దానికి భిన్నంగా విదేశీ విశ్వవిద్యాలయాలు రావడం  మనదేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ధారా దత్తం చేసి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఖూనీ చేయడం అంటే  మన పాలకులు సామాన్య  ప్రజలను రెండవ శ్రేణి పౌరులుగా చూడడమేఅవుతుంది. అందులో పేద వర్గాలకు తీరని ద్రోహం తలపెట్టడమే.  మరొకవైపు సామ్రాజ్యవాద విష సంస్కృతి తో పాటు  సామాజిక శాస్త్రాల ప్రాధాన్యత తగ్గిపోవడం మానవీయ కోణంలో ఆలోచించకుండా కేవలం మార్కెటు శక్తులకు మాత్రమే అవకాశం కల్పించడం ద్వారా ప్రసార మాధ్యమాలు టీవీ ప్రసారాలు సినిమాలు ఇతర మీడియా కూడా మొత్తం ప్రైవేటు రంగంలోకి  వెళ్లిపోవడంతో ప్రభుత్వ రంగం దిక్కులేనిది అయిపోయింది. అందులో విద్యారంగం ముందు వరుసలో ఉన్నది అనటంలో అతిశయోక్తి లేదు.
        ప్రభుత్వం ముందుకు విద్యాపరమైన ప్రజల డిమాండ్లు 
***********
--కేంద్ర బడ్జెట్లో 10 శాతం రాష్ట్రాల బడ్జెట్లో విద్యకు 30 శాతం కేటాయించాలి.

---  కోటారి  సూచన ప్రకారం గా ఇప్పటికైనా సోయి తెచ్చుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలి.
-- ప్రయివేటు  విద్యారంగాన్ని  నిర్మూలించడంతోపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉచిత నాణ్యమైన విద్యను అందించాలి.
--  ప్రాథమిక తరగతుల నుండి విశ్వవిద్యాలయ స్థాయి విద్య వరకు ఎలాంటి ఫీజు వసూలు  చేయరాదు.
--  ప్రజాస్వామ్యక విలువలు బలపడే విధంగా స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వము రాజ్యాంగ లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడే నూతన విలువలతో కూడిన శాస్త్రీయ విద్యా విధానాన్ని చర్చించి ఆమోదించి అమలు చేయాలి.
---  ఇటీవల రద్దు చేసిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి.
-- విదేశీ విశ్వవిద్యాలయాలతో సహా ప్రైవేటు రంగంలో ప్రారంభించిన విశ్వవిద్యాలయాలకు  వెంటనే అనుమతి రద్దు చేయాలి.
--  ముఖ్యంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలలో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలను  రూపొందించని కారణంగా భర్తీ కానీ ఎంఈఓ డిఈఓ పిఇ ఓ వంటి పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
-- ప్రాథమిక పాఠశాలల నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఖాళీగా ఉన్న   వేలాది అధ్యాపక అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేయాలి  అంతేకాదు విద్యారంగంలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను నియమించాలి.
   ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైతే 317 జీవో బాధితులకు న్యాయం చేయడంతో పాటు పాఠశాలల మౌలిక సౌకర్యాల ను కల్పించడం, పెండింగ్ లో  ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగుల యొక్క డిమాండ్ల  ను పరిష్కరించడం, మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్ధతి కింద వేతనాలు చెల్లించడం కోసం చర్యలు తీసుకోవడం, కేజీబీవీ, ఇతర  టీచర్లకు  రెగ్యులరైజేషన్  అమలు చేయడం,స్పెషల్ టీచర్లకు నోషనల్  ఇంక్రిమెంట్ల ను మంజూరు చేయడంతో పాటు  పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను  డి ఏ లను విడుదల చేయడం ద్వారా ప్రభుత్వాలు తమ నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఉద్యోగులు జమ చేసుకున్న తమ డబ్బును కూడా చెల్లించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వాలు ఉండడం దయనీయం కనుక ఆ వైపుగా వెంటనే దృష్టి సారించాలి." ఈ సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వాలకు ఒకవేళ సాధ్యం కాకపోతే ప్రైవేట్ రంగానికి వత్తాసు పలకడానికి సిద్ధపడితే ప్రభుత్వాలను కూడా ప్రైవేటుపరం  చేసుకుంటే 
 మంచిదేమో ఆలోచించుకోండి.అప్పుడు ప్రజలు తమ నిర్ణయం తాము  తీసుకుంటారు.  ఇదే సందర్భంలో ప్రజాస్వాంక విలువలను పరిరక్షించడం కోసం, మానవీయ సంస్కృతిని పెంపొందించడం కోసం ఉపయోగపడే ప్రజాస్వామిక శాస్త్రీయ విద్యకై పోరాటానికి  కూడా ప్రజలు సమాయత్తం కావలసినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది. "కూటిలో రాయి తీయని వాడు ఏటిలో రాయి తీయగలడా" అలాగే విద్య కోసం బడ్జెట్ కేటాయించడానికి  సిద్ధపడని ప్రభుత్వాలు  ప్రైవేట్ రంగానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోగలవా?  అందుకే రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం పోరాటమే ప్రజలకు శరణ్యం.సామాజిక సంస్కరణకు సమ సమాజ స్థాపనకు ప్రాతిపదిక అయినా విద్యా వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ద్వారా మన కర్తవ్యాలను నిర్వహించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333