విద్యా రంగంలో నెలకొన్న దుస్థితికి కారకులెవరు ?
ఢిల్లీ తరహా నాణ్యమైన విద్య కావాలని ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదు?
విద్యా వ్యవస్థ పై ప్రభుత్వాల అలసత్వం ప్రధాన కారణం.
రాయితీల ముసుగులో విద్యా వైద్యం కనుమరుగైపోతుoది.
___ వడ్డేపల్లి మల్లేశం
విద్యారంగానికి బడ్జెట్లో కేంద్రం నుండి రాష్ట్రాల వరకు మొక్కుబడి నిధులను కేటాయిస్తూ విద్యావ్యవస్థపై అలసత్వం ప్రదర్శిస్తున్న పాలకుల ధోరణిని ప్రజలు ప్రశ్నించనంత కాలం ప్రైవేటు విద్యావ్యవస్థ రాజ్యమేలుతుంది. ప్రైవేటు ఫీజుల జులుం ప్రజల పైన స్వారీ చేస్తుంటే పేద వర్గాలు అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉంటారు ప్రభుత్వాలు ఆశించినది ఇదేనా? పెట్టుబడుదారి వర్గాన్ని పోషించడానికా? లేక పేద వర్గాలకు ప్రయోజనం కలిగించడానికా? .కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 2 శాతానికి దాటడం లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా 6 శాతం నిధులతో సరిపెట్టుకుంటే విద్యా వ్యవస్థ ఏ రకంగా ప్రక్షాళన జరుగుతుంది? ఇక ప్రైవేట్ రంగంలోని పాఠశాలల పట్ల ఎలాంటి అజమాయిషి లేకుండా ఫీజులను ఎందుకు పెంచుతున్నారో ప్రశ్నించని కారణంగా ప్రైవేటు యాజమాన్యాలు అక్రమాస్తులు కూడ పెట్టుకుంటుంటే పేద ప్రజలు ఫీజులు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. ఇంత జరిగినా చోద్యంగా చూస్తున్న ప్రభుత్వాల యొక్క దమననీతిని ప్రజలు ఎన్నికల సమయంలో కానీ ఇతరత్రా కానీ ప్రశ్నించిన దాఖలా లేదు ఉచిత విద్య వైద్యం కోసం ప్రజలు ఏనాడు డిమాండ్ చేయకపోవడమే ప్రధాన కారణం. "రాయితీలను ప్రలోభాలను బంగాళాఖాతంలో విసిరివేసి విద్యా వైద్యం సామాజిక న్యాయాన్ని మాత్రమే నిలదీసి, రాజ్యాంగబద్ధంగా మా వాటా మాకు దక్కాలని గనుక మెడలు వంచి ప్రశ్నించిన నాడు విద్య వైద్యం పూర్తిగా ప్రజల ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ప్రైవేటు వ్యవస్థ కనుమరుగవుతుంది, పాలకవర్గాలు అప్పుడు ప్రజల ముందు తలవంచక తప్పదు. ఎందుకంటే వాళ్లు కేవలం ప్రజా సంపదకు కాపలాదారులు మాత్రమే కనక.
కాపలాదారులుగా ఉన్నటువంటి పాలకుల అధికారాన్ని పెంచేది ప్రజలే వంచేది ప్రజలే. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలోని అంశాలను పరిశీలిస్తూనే నాణ్యమైన ఉచిత విద్య వైద్యం కావాలని డిమాండ్ చేయాలి. ఆ పరంగా హామీ ఇచ్చిన రాజకీయ పార్టీ నాయకులను గ్రామాలకు పట్టణాలకు రావాలని లేకుంటే తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధపడితే ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల ద్వారా ఉచితంగా ప్రజలందరికీ అందించవచ్చు కదా! ఢిల్లీలో కూడా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తన బాధ్యతలో భాగంగా ఉపాధ్యాయులందరికీ అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇప్పించి వాళ్ల ద్వారా ఉపాధ్యాయులందరికీ మెరుగైన సూచనలు అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి ఎనలేని కృషి చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి. అన్ని రాష్ట్రాల పాలకులు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ వైపుగా పరిశీలన చేయాలి. పాఠశాల భవనాలు, ప్రయోగశాలలు, టాయిలెట్స్, ఆట స్థలాలు, పిల్లల భోజనశాలలు, ఇతర మౌలిక సౌకర్యాలు అన్నీ కూడా ఊహించని స్థాయిలో పిల్లలకు అందుబాటులో ఉంటే ఇక తెలుగు రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాలలో కూడా కనీసం మరుగుదొడ్లు మూత్రశాలలు లేక చిన్న బోయిన పాఠశాలల్లోకి ఆడపిల్లలను పంపించడానికి సిద్ధపడని తల్లిదండ్రుల మధ్యన సుప్రీంకోర్టు చురకలతో ఇటీవల కాలంలో కొంత కదలిక వచ్చినప్పటికీ పాలకుల మొద్దు నిద్ర కారణంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య క్రమంగా తగ్గిన విషయాన్ని ప్రభుత్వాలు అంగీకరించి తీరాలి. ఆ వైపుగా చర్యలు తీసుకోవాలి.
ప్రజలు డిమాండ్ చేయనంతవరకు పాలకుల్లో కదలిక రాదు :-
ప్రాథమిక ఉన్నత ప్రాథమిక హై స్కూలు విద్యతోపాటు ఇంటర్మీడియట్ డిగ్రీ స్నాతకోత్తర స్థాయిలో కూడా ప్రైవేటు యాజమాన్యాలలో విద్యావ్యవస్థ ప్రభుత్వానికి సమాంతరంగా కొనసాగుతూ ఉంటే మౌనంగా చూస్తూ చేతులు ఎత్తేసి ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలకు ఫీజు చెల్లిస్తామని అది కూడా చెల్లించలేక వేల కోట్ల రూపాయలు బకాయి పడిన విషయాన్ని తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాలలో కూడా చూడవచ్చు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు 6000 కోట్లకు పైగా నిధులు ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాల పేరున చెల్లించవలసినటువంటి అవసరం ఉంది అంటే ప్రభుత్వం తన ఆదాయంలో పెద్ద మొత్తాన్ని సంక్షేమ ఇతర కార్యక్రమాలకు కాకుండా దుబారా చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. రక్షణ, అలంకరణ, సమావేశాలు, సభలు, ప్రయాణాలు, జీతభత్యాలు, ఇతర ఆడంబరాల పేరుతో చేస్తున్న ఖర్చు తగ్గించుకుంటే పెట్టుబడిదారీ వర్గాల నుండి రావలసిన పన్ను లను, ఐటీ ఇతర పన్నులు ఎగవేస్తున్న వారిని నిలదీసి ఆదాయాన్ని సమకూర్చుకుంటే ప్రభుత్వమే అన్ని పాఠశాలలను కళాశాలలను తన ఆధ్వర్యంలో నిర్వహించవచ్చు. ప్లీజ్ రియంబర్స్మెంట్ పేరుతో ప్రైవేటు సంస్థలకు చెల్లించవలసిన అవసరం లేదు పైగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అర్హులైన సిబ్బందిని కూడా తీసుకోవడం ద్వారా ముఖ్యంగా పేద వర్గాలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశం ఉన్నది. రైతుబంధు,రైతు భరోసా, రైతు బీమా, ఉచితాలు, రాయితీలు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనేక పథకాలను క్రమక్రమంగా తగ్గించడం ద్వారా ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వాళ్ళ ఆదాయాన్ని సంపదను సృష్టించే ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా సంపద సృష్టించడం ద్వారా ప్రజల ఆదాయాలను ఆస్తులను పెంచతామని నిరంతరం ప్రకటిస్తున్నారు అలాంటి కృషి తెలంగాణలోనూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ వైపుగా దృష్టి సారించినట్లయితే బడ్జెట్లో కొఠారి కమిషన్ ప్రకారంగా కేంద్రం 10 శాతం,రాష్ట్రాలు 30 శాతం నిధులను కేటాయించడానికి అవకాశం ఉంటుంది.అప్పుడు సమగ్రమైనటువంటి ప్రభుత్వ రంగంలోనే నాణ్యత గల ఉచిత విద్యను అందించవచ్చు. ఏ కుటుంబం పైన కూడా ఒక్క శాతం భారం పడకుండా సంతోషంగా పేద వర్గాలతో సహా అందరూ ఒకే పాఠశాలలో చదువుకునే కామన్ స్కూలు వ్యవస్థను సవాలుగా తీసుకొని నిర్వహించగలిగిన ప్రభుత్వానికే ఓటు వేస్తాం అని ఓటరు సగటు ప్రజలు నినదించాలి. ఢిల్లీ 25%, కేరళ 24%తో ముందు వరసలో వున్నాయి. మేధావులు బుద్ధి జీవులు ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలకు గుడ్డిగా మద్దతు పలకడాన్ని మానుకొని ఉచిత విద్య వైద్యం కోసం బస్సు యాత్రలు, కళాయాత్రలు, నిరసన ప్రదర్శనలు, పోరుబాట, ధర్నాలు, పి కెటింగ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఒక సంవత్సరం పాటు కచ్చితంగా కొనసాగిస్తే ఆ ఉప్పెన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ గుండా దేశమంతా విస్తరించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కదిలించిన నాడు కొఠారి కమిషన్ చేసిన సూచనలను కనీసం గానైనా ఆలోచించే అవకాశం ఉంటుందేమో! మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాలను కదిలించడానికి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విద్యావంతులు అన్ని వర్గాల ప్రజలు ఈ ఉచిత విద్య వైద్యం కోసం జరిగే పోరాటానికి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉంది. దీనికి మేధావులు సమర్థులు ముఖ్యంగా యువత విశ్వవిద్యాలయంలోని విద్యావంతులు నాయకత్వం వహించడం ద్వారా ప్రభుత్వ రంగంలో విద్యను సాధించుకునే అవకాశం ఉంటుంది.
విశ్వవిద్యాలయాలకు కులపతులు లేకుండా సంవత్సరాల తరబడి గత పరిపాలనలో కొనసాగిన విధానం హాస్యాస్పదం, అనేక పాఠశాలలు కళాశాలలు డిగ్రీ కాలేజీలలో లెక్చరర్స్ ఉపాధ్యాయులు లేకుండా కాలం గడిచిపోతున్నది. మౌలిక సౌకర్యాలు స్నానపు గదులు టాయిలెట్స్ మరుగుదొడ్లు లేకుండా పాఠశాలలు హాస్టల్లు రెసిడెన్షియల్ పాఠశాలలు విషపూరితంగా మారిపోతున్నాయి. ఇ న్ని రకాల వైఫల్యాలకు పాలకులు ఎప్పుడైనా చట్టసభల్లో సమాధానం చెప్పినారా?
-- రాయితీలను రద్దు చేయమని డిమాండ్ చేద్దాం
----ప్రలోభాలకు లొంగిపోమని ప్రతిజ్ఞ చేద్దాం.
--- విద్యా వైద్యం ఉచితంగా నాణ్యమైనది కావాలని డిమాండ్ చేద్దాం .
----అలాంటి రాజకీయ పార్టీకే మా మద్దతు అని హెచ్చరిక చేద్దాం.
సామాన్య మెజారిటీ ప్రజలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు పేద మధ్యతరగతి ఆదివాసీలు భిన్న వర్గాల ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టి పెట్టుబడిదారీ వర్గానికి కొమ్ముకాస్తూ ప్రైవేటు రంగంలో విద్యా వైద్యాన్ని బలోపేతం చేస్తుంటే చేతులు ముడుచుకొని చూడడానికి ప్రజలు సిద్ధం గా లేరని మన శక్తిని ఐక్యతను ప్రజా పోరాటాన్ని పాలకులకు రుచి చూపించవలసిన అవసరం కూడా ఉన్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాదు జిల్లా సిద్దిపేట తెలంగాణ )