విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వసతులు
జోగులాంబ గద్వాల 22 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నర్సింగరావు తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో బుధవారం ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో మైనర్ రిపైర్స్ గురించి అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. వసతి గృహంలో డ్రైనేజీ నీటిని బయటకు పంపించే మురుగు కాలువ దెబ్బతినడంతో ఇంకుడు గుంత నిర్మించేందుకు ప్రతిపాదనలు చేయాలన్నారు. సెప్టిక్ ట్యాంక్ కుంగి పోవడంతో, ప్రహరీ గోడ పాక్షికంగా కూలిపోవడంతో మరమ్మత్తులు చేయిస్తామన్నారు. జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలతో పాటు గురుకుల, కస్తూర్బా విద్యాలయాల్లోనూ అవసరమైన మైనర్ రిపైర్స్ చేయించేందుకు సంబంధిత వార్డెన్స్, ఇంజనీరింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందన్నారు. సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ఈనెల 26 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని సౌకర్యాలపై అక్కడి విద్యార్థులతో అధికారులు మాట్లాడారు. అనంతరం అదనపు కలెక్టర్, ఇతర అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ పర్యటనలో గ్రామ సర్పంచ్ రవి ప్రకాష్. ఉప సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ పాషా, ఎంపీడీవో అజహార్ మొహిద్దిన్, పంచాయతీరాజ్ ఏఈ భరత్ కుమార్ రెడ్డి, వార్డెన్ నరేష్, తదితరులున్నారు.