మిల్లర్లు సిఎంఆర్ వడ్ల బకాయిలు చెల్లించాలి
అదనపు కలెక్టర్ మధుమోహన్.
జోగులాంబ గద్వాల 22 జూలై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లాలోని రైస్ మిల్లర్లు 2022-23 రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన వడ్లకు సంబంధించిన బకాయిలను చెల్లించాల్సి ఉందని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు.
బుధవారం ఐడిఓసిలోని తన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ రైస్ మిల్లర్లతో సమావేశమై మాట్లాడారు. మూడేళ్ల కిందట 36,814.800 మెట్రిక్ టన్నుల వడ్లను రైతుల నుంచి సేకరించి జిల్లాకు చెందిన 33 మంది మిల్లర్లకు అప్పగించడం జరిగిందన్నారు. ఇందులో ఒక మిల్లర్ మాత్రమే పూర్తిగా ధాన్యానికి సంబంధించిన పూర్తి డబ్బులు చెల్లించారని, మిగతావారు పూర్తిస్థాయిలో ఇవ్వలేదన్నారు. ఆ సీజన్ లో రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యం చాలా వరకు నాణ్యత బాగోలేదనే విమర్శలు రావడంతో ప్రభుత్వం కొంతకాలానికి వేలంపాట ద్వారా అమ్మేందుకు నిర్ణయించిందన్నారు. వేలంపాటలో హక్కులు దక్కించుకున్న వ్యక్తి కొంత ధాన్యం మాత్రమే తీసుకోవడంతో మిగిలిన ధాన్యముకు సంబంధించిన బకాయిలను మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశాలు ఇవ్వగా చాలామంది మిల్లర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. ప్రభుత్వం క్వింటాల్ కు రూ.2236 చొప్పున వడ్ల డబ్బులు చెల్లించాలని ఆదేశించగా, మిల్లర్లు రూ.1830 మాత్రమే చెల్లిస్తామనడం సరికాదన్నారు. మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యానికి సంబంధించిన బకాయిలను చెల్లించాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి స్వామి కుమార్, మేనేజర్ విమల, ఎన్ ఫోర్స్ మెంట్ డిటి ప్రశాంత్, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రామలింగేశ్వర కామ్లే, తదితరులు పాల్గొన్నారు.