మరో ప్రపంచం పిలుస్తుంది  బావి భారత పౌరులారా! కదలిరండి

Dec 29, 2024 - 21:46
Feb 13, 2025 - 18:59
 0  7
మరో ప్రపంచం పిలుస్తుంది  బావి భారత పౌరులారా! కదలిరండి

మరో ప్రపంచం పిలుస్తుంది  బావి భారత పౌరులారా! కదలిరండి. 

కుట్రలు, కుతంత్రాలు, ద్వేషం, పగ....

అసమానతలు, అంతరాలు లేని  సమ  సమాజ నిర్మాత లారా!  

మంచిని పెంచగా మమతలు పంచగా లెండి!!!  రారండి!!!

వడ్డేపల్లి మల్లేశం 
24..10...2024

సామాజిక రుగ్మతలు,  అసమానతలు అంతరాలు, దోపిడీ పీడన వంచన,  కుల వివక్షత,  ఆధిపత్య ధోరణి, నిర్బంధాలు అణచివేత, ఆకలితో కడుపుమంట  ధన ధాన్యరాశులు మరొకచోట,  పేదరికం నిరుద్యోగం, ఆకలి చావులు ఆత్మహత్యలు  హత్యలు అత్యాచారాలు  నిరంతరం భారతదేశంలో  ఏదో ఒక మూలన  కొనసాగుతూ ఉంటే  అదుపు చేయాల్సిన పాలకులు  అందుకు అనువైన  రాజ్యాంగాన్ని  సద్వినియోగం చేయకుండా  ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్న కారణంగా  ఆశించిన సమ సమాజానికి బదులు అసమ సమాజం  సామాజిక రుగ్మతలతో కూడుకున్న  ఆకృత్య అవినీతి  భారతం  చూస్తే చిన్న పిల్లలకైనా  మనసు చలి స్తుంది. మార్పు కోసం పరితపించాలని ఆరాటం పెరుగుతుంది  అవసరమైతే  పోరాటానికైనా సిద్ధమని.

నినదించే రోజుల్లో  ప్రత్యామ్నాయం కోసం  పరుగు దీయక  తప్పడం లేదు. ప్రస్తుత వ్యవస్థలో  అన్ని వర్గాల వారు ఏదో ఒక  సామాజిక రుగ్మతకు  అవినీతి బంధుప్రీతి  ఆకృత్యాలకు  బలవుతున్న  సందర్భంలో  బావి భారత పౌరులలోనైనా  సామాజిక చింతన బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.  తల్లిదండ్రులు ఉద్యోగులు అయితే అవినీతిని  పిల్లలు చూస్తున్నారు, భూస్వాములైతే  పేదవర్గాల పీడించేది   కల్లారా  కనిపెడుతున్నారు,  పెట్టుబడిదారులైతే దేశ సంపదను  కొందరి చేతుల్లో కేంద్రీకృతం కావడాన్ని పరిశీలి స్తున్నారు.  కష్టం చేయకుండా  శ్రమను గుర్తించకుండా  నీతి మార్గంలో పయనించకుండానే  బ్రతకాలని ఆశపడుతూ  వక్రమార్గంలో పయనిస్తున్నారు.

అడుగడుగునా బాధ్యతారాహిత్యం తో  సామాజిక చింతన కరువై   వ్యక్తి ప్రయోజనానికి పాల్పడుతున్న కారణంగా  సమాజము చితికి పోతు రాబోయే కాలంలో  కనుచూపుమేరలో కూడా  మంచికి చోటు  కనబడడం లేదు .ప్రశ్నించి, ప్రతిఘటించి,  విమర్శించి, అవగాహన కల్పించి,  బాధ్యతలను గుర్తింపచేసి, పరివర్తన దిశగా సమాజాన్ని  నడిపించాల్సిన  స్థితిలో  కారు చీకటిలో కాంతిరేఖ లాగా మన ముందు కనిపిస్తున్న తరం  నేటి బాలలు  రేపటి పౌరులు.  వ్యక్తులు అశాశ్వతం కానీ వ్యవస్థ శాశ్వతం.... మానవీయ కోణంలో వ్యవస్థను రక్షించుకోవడానికి  ఏదో ఒక సందర్భంలో ఎవరో ముందుకు రావాల్సిందే  అదే నేడు మన చిన్న పిల్లలు ఎందుకు ఆ బాధ్యత తీసుకోకూడదు?.  వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి వాళ్లు అర్హులు కాదా?  ఏ విలువలతో వారిని పెంచి పోషిస్తే  బాధ్యతలను గుర్తింపచేస్తే భవిష్యత్తు  ప్రయోజనకరంగా ఉంటుంది.?

సామాజిక చింతన గల వాళ్లే సారథ్యం వహించాలి :-

శరీరంలోని పిత్తాశయంలో  రాయి ఏర్పడి భరించరాని స్థితిలోకి చేరుకున్నప్పుడు   ఆ భాగాన్ని మొత్తం తీయకుంటే  శరీరమే కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది  అలాంటప్పుడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి  గుడ్డిలో మెల్లగా లాగా  ఉన్నంతలో  మనిషి ప్రాణం  కీలకము కనుక వైద్య చికిత్సలో  ఆ పిత్తాశయాన్ని తీసివేయడం ద్వారా  కొనఊపిరికి చేరుకున్న  ప్రాణికి జీవం పోయవచ్చు. అలాగే నేడు వ్యవస్థ కూడా కుళ్ళి కంప కొడుతున్న తరుణంలో  బుద్ధి జీవులు మేధావులు మానవ హక్కుల కార్యకర్తలు సామాజిక చింతనాపరులు విద్యావంతులు  వ్యవహార దక్షత కలిగినటువంటి నిరుద్యోగులు నిరక్షరాస్యులు కూడా  తమ బాధ్యతగా పిల్లలను ముందు ఉంచుకొని  వారిలో  మంచి అలవాట్లను పెంపొందించడం ద్వారా  రాబోయే తరమైన  పది కాలాలపాటు  పచ్చగా మన గలగడానికి ప్రయత్నించవచ్చు.  సమాజము,  విద్యాసంస్థలు,  మంచిని ఆలోచించే కుటుంబాలు ఇక్కడ క్రియాశీలక పాత్ర పోషించడం చాలా అవసరo.   బాలల దినోత్సవాలు,  పాఠశాలలు కళాశాలలో విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా  నిరంతరం భావి భారత పౌరులకు జరిగే వివిధ పోటీ కార్యక్రమాలు,చర్చాగోష్టులలో  విమర్శనాత్మక చర్చ జరగాలి.  పిల్లల హక్కులను గుర్తించడం,  పిల్లలను గౌరవించడం,  బాల్యం నిర్లక్ష్యానికి గురైతే  రాబోయే ప్రమాదాన్ని  గుర్తింప చేయడం ద్వారా  భవిష్యత్తు పైన  పిల్లల్లో  ఆశలు రేకెత్తించాలి,ఆశయాలను నూరిపోయాయి, లక్ష్యం వైపు మళ్ళించాలి.  రూసో అన్నట్లు  "మనుషులు పుట్టుకతో మంచివాళ్లే  వ్యవస్థ లేదా చుట్టూ ఉన్న సమాజమే  వాళ్లను  కలుషితం  చేస్తుంది" అనే మాటలోని అంతరార్తాన్ని  గుర్తించడం ద్వారా  మౌలిక అంశాలు,  కార్యకారణ సంబంధాలు,  మానవ విలువలు  గుర్తించడం జరగాలి. "పిల్లలు కళ్ళకపటం తెలియని  కరుణామయులు"  అని  సినిమా రచయిత అన్నట్లు  ప్రపంచాన్ని  అందంగా  నిష్కల్మషంగా  పరిచయం చేయాల్సిన బాధ్యత మనదే. "పిల్లలు   స్వచ్ఛంగా స్వేచ్ఛగా  సామాజిక చింతనతో పెరుగుతే  రేపటి నవ సమాజం  సమ సమాజంగా మారుతుంది.  వారి మనసులను గాయపరచి  కలుషితం చేస్తే   రేపటి భవిష్యత్తు కూడా అంధకారమే అవుతుంది." ఏది కోరుకుందామో  మనమే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పిల్లలు కల్లాకపటం తెలియని చిన్నారులే కదా !

కుటుంబంతో ప్రారంభమై  పాఠశాల ద్వారా  విస్తృత సమాజంలోకి  పిల్లలు అడుగు పెడతారు.  ఆ వ్యవస్థలు బలహీనంగా ఉంటే  వాళ్ల మనసు చిన్ననాడే గాయపడుతుంది  ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ కూడా పిల్లల నడవడిని  ప్రభావితం చేస్తాయి.  సరి చేయవలసిన సమయంలో  సవరించకుంటే    ఫలితాలు తారుమారవుతాయి."  ఈ విషయంలో విద్య  దానికి వేదికైన పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు,  చో ధకులుగా పనిచేసే ఉపాధ్యాయులు ఆచార్యులు క్రియాశీల భూమిక పోషించవలసి ఉంటుంది.  పిల్లల అస్తిత్వాన్ని  సామర్థ్యాన్ని  పరిశీలన శక్తిని  గుర్తించడం, పెంచి పోషించడం,  వారిలోని అంతర్గత శక్తులను బయటకు తీయడం  నిజమైన విద్యావ్యవస్థతోపాటు  సమర్ధులైన బోధన సిబ్బంది ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.  అంతర్గత శక్తులను బయటకు తీసేదే విద్య అని,  సర్వతోముఖ వికాసాన్ని సాధించేకేంద్రమే పాఠశాల అని,  తెలియని విషయాన్ని తెలుసుకోవడమే  విద్య అంతరార్థమని  ఉపాధ్యాయులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండి సామాజిక చింతనతో  పనిచేసినప్పుడు మాత్రమే పిల్లల్లో  ఆ రకమైనటువంటి లక్షణాలను పెంపొందించి  సామర్థ్యము ప్రతిభ  కలబోసి తీ  ర్చిదిద్ద గలరు.  ప్రశ్నించి   ప్రతిఘటించగలిగిన  అధ్యయనశీలి,  పరిశీలించగల  అన్వేషి  ఉపాధ్యాయుడు అయినప్పుడు మాత్రమే  రేపటి తరాన్ని తీర్చిదిద్దడానికి, నేటి పిల్లల్లో  జ్ఞానతృష్ణ నింపడానికి, అన్వేషణ దృక్పథాన్ని  పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ప్రశ్నించలేనివాడు పిల్లలను  అమాయకులుగా  ప్రతిఘటించని వాడు  అచేతనులుగా  తయారుచేస్తాడని తెలియదా?  "మరో ప్రపంచం పిలుస్తుంది  పదండి పోదాం పదండి  తోసుకు పోదాం పోదాం  పైపైకి "అని  ప్రముఖ విప్లవ రచయిత శ్రీ శ్రీ  సమాజాన్ని,  కవులను,  సాహిత్య రంగాన్ని,  తద్వారా విద్యా వ్యవస్థను, పిల్లల లోకాన్ని  ప్రభావితం చేసిన విషయం మనందరికీ తెలుసు. వ్యతిరేక ఆలోచనలు కలిగిన ఉపాధ్యాయులు,  అమానవీయ అంధవిశ్వాసాలను పెంపొందించే విద్యావ్యవస్థ అమలు లో ఉంటే   మరో ప్రపంచాన్ని దర్శించడం  అసాధ్యమే  అబూతకల్పనే.

నేటి పిల్లలను ఎలా చూడాలి?  ఎలాంటి వాతావరణం కల్పించాలి? :-

పిల్లలలో మంచిని పెంచాలన్నా, మమతను పంచాలన్నా,  మానవత్వాన్ని నింపాలన్నా  చుట్టూ ఉన్న సమాజంలోని  వ్యతిరేక  లక్షణాలు వారిపైన ప్రభావం చూపకుండా చూడాలి.  హాయిగా ప్రశాంతంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచించే విధంగా  నూతన పరికల్పనలు కల్పించాలి. మానసిక ప్రశాంతత తో పాటు శారీరక పటిష్టత దారుఢ్యం  ఏకాగ్రత కూడా ప్రధానమైనప్పుడు  ఆటలు వ్యాయామము  వినోదము  పరిశీలనా పరిశోధన  అభ్యాసము  వారికి అందుబాటులో ఉంచడమే కాదు  నిత్యం ఆ వాతావరణం కల్పించాలి.  కుటుంబంలోనూ సమాజంలోనూ పాఠశాలలోనూ  ఇవన్నీ సాధ్యమే కానీ,  ఆచరించే వాళ్లకు, నాయకత్వం వహించే వాళ్లకు,  బాధ్యతగా  వ్యవహరించే వాళ్లకు ఆ మనసు చింతన  స్వాభిమానం ఉండాలి కదా!  "చరిత్రలను అధ్యయనం చేయడంతో పాటు  ప్రతి వ్యక్తి తనకంటూ ఓ చరిత్రను నిర్మాణం చేసుకోవాలి" అని భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సూచించినట్లుగా  పుట్టుక నుండి చావు మధ్యగల జీవితాన్ని  సార్థకం చేసుకునే విధంగా ఆది నుండి  పిల్లల్లో అలవాటును ముమ్మరం చేయాలి. వినోదము విషాదము,  ఆనందము దుఃఖము  జీవితంలో తప్పవని  వాటిని అధిగమించడం ద్వారా  జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి  నమ్మిన సిద్ధాంతంతో  ముందుకు వెళ్లడమే  పరిష్కారమని ఆలోచన  పిల్లలలో కల్పించాలి." ఆరోగ్యం, ఆనందం, ఆలోచన,  ఆత్మీయత, ఆప్యాయత  అడుగడుగునా దర్శనమిచ్చేలాగా చూసినప్పుడు  వ్యక్తి వికాసం  సమ సమాజం ద్వారా  మరో ప్రపంచాన్ని  నిజం చేసుకోవచ్చు ఇది  అసాధ్యం ఏమీ కాదు. విద్యా వైద్యం సామాజిక న్యాయం వంటి అంశాలలో  ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి.  అడుగడుగునా ప్రకృతి కలుషితమై  పోషక విలువలు లేని  విషపూరిత ఆహారం మాత్రమే  నేటి పిల్లలకు మనం అందించినప్పుడు  అధిక దిగుబడి పేరు చెప్పుకొని అభివృద్ధి అని  గొప్పలు చెప్పుకోవడం  ప్రకృతి వినాశనానికే అని చెప్పక తప్పదు. సగటు కుటుంబాలు  ప్రభుత్వాల అలసత్వం బాధ్యతారాహిత్యం కారణంగా విద్యా వైద్యానికి  తమ ఆదాయంలో 70 శాతానికి పైగా ఖర్చు చేయవలసి రావడంతో  ప్రభుత్వాలు నామమాత్రంకాగా  ప్రజలు కొనుగోలు శక్తి తగ్గి   ఆర్థికంగా బలోపేతం కాక,  ఆరోగ్యంగా వెనుకబడిపోవడం వలన  పెద్దలతో పాటు పిన్నలు కూడా అనారోగ్యం బారిన పడి  తమ కర్తవ్యాన్ని ఆలోచించలేని దుస్థితిలోకి నెట్టి  వేయబడుతున్నారు. నిరంతరం సంఘర్షణలు యుద్ధాలు ప్రపంచ మానవాళిని  విచ్ఛిన్నం చేస్తుంటే,  అభివృద్ధి పేరుతో  కొనసాగుతున్న పర్యావరణ విధ్వంసం  అనేక రకాల సామాజిక సంక్షోభాలకు కారణం అవుతుంటే  ముఖ్యంగా వీటికి బలవుతున్నది పిల్లలే అనే విషయాన్ని మర్చిపోకూడదు ".ప్రస్తుతం దున్నాల్సింది భూమిని మాత్రమే కాదు మనుషుల మెదళ్లను కూడా'" అని ప్రముఖ అంబేద్కరిస్ట్ కత్తి పద్మారావు  గారన్నట్లు   ప్రస్తుతం మనం సమైక్యంగా  యుద్ధం చేయాల్సింది  సామాజిక సంక్షోభాలు,  ప్రకృతి పర్యావరణ  విధ్వంసా లు,  మానవ వినాశనానికి కారణమవుతున్న  యుద్ధకాంక్ష  పైన మాత్రమే అని తెలుసుకోవడం చాలా అవసరం.  అప్పుడు మాత్రమే  మన లక్ష్యమైనటువంటి పిల్లల శ్రేయస్సు,  ఆరోగ్యం,  అభివృద్ధి, భవితవ్యం  శ్రీ శ్రీ  పిలుపు అందించినట్లుగా  మరో ప్రపంచం వైపు దారితీస్తుంది అనడంలో  ఏ మాత్రం సందేహం లేదు.  నేటి పిల్లలే  కొత్త ప్రపంచానికి  నిర్మాతలు సారథులు  అని మనం గట్టిగా విశ్వసించడo,   అందుకు అనుగుణంగా పనిచేయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333