భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి

Aug 29, 2026 - 21:46
Aug 29, 2026 - 21:50
 0  5
భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి

అవార్డు పూర్తయిన వెంటనే.రైతుల ఖాతాల్లో డబ్బులు జమ. 

సాగునీటి విడుదల విషయంలో స్పష్టతతో ముందుకెళ్లాలి. 

సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్, గద్వాల ఎమ్మెల్యే. 

జోగులాంబ గద్వాల 29 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లాలో పురోగతిలో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని. అవార్డు పూర్తయిన రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
జిల్లాలోని నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలతో పాటు మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి ఇంకా అవసరమైన భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆయా ప్రాజెక్టుల వారీగా వివిధ మండలాల పరిధిలో సేకరించాల్సిన భూములపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటి పారుదల, రెవిన్యూ, భూ సేకరణ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేందుకు సహకరించాలన్నారు. 
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించినప్పటికీ జిల్లాలో వివిధ రిజర్వాయర్ల పరిధిలో కొంతమంది రైతులు వరి సాగు చేయడం జరిగిందన్నారు. జూరాల కుడి కాలువ పరిధిలో ఉన్న చివరి డిస్ట్రిబ్యూటర్స్ వరకు నీటి సరఫరాపై సంబంధిత ఇరిగేషన్ అధికారులు స్పష్టతతో ఉండాలన్నారు. పంట చేతికి వచ్చేవరకు రైతులు నష్టపోకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని వారి కోరారు.
స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల భూసేకరణకు ఉన్న అన్ని అడ్డంకులను అధిగమించి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. సంబంధిత శాఖల అధికారులు నిబద్ధతతో పనిచేసి నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని వివిధ ప్యాకేజీల్లో ఇంకా చేయాల్సిన భూసేకరణను వేగవంతం చేయాల్సి ఉందన్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణ కూడా వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో జూరాల ప్రాజెక్టుకే కొద్ది రోజులుగా నిరంతరం ఇన్ఫ్లో ఉండడం వలన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా పలు రిజర్వాయర్లను నింపుకోవడం జరుగుతుందన్నారు. జూరాల కుడి కాలువతో పాటు వివిధ రిజర్వాయర్ల పరిధిలో కొందరు రైతులు తమ పొలాల్లో వరి సాగు చేసినప్పటికీ సరైన ప్రణాళికను అవలంబిస్తే పంటలు చేతికొచ్చే వరకు సాగునీరు అందించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కొన్నేళ్లుగా జిల్లాలోని రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా ఖరీఫ్, రబీ సీజన్లను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం పరిస్థితుల ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నప్పటికీ జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జలాశయాల నుంచి వరద రావడంతో జిల్లాకు మేలు జరుగుతోందన్నారు. రైతులు ఆరుతడి పంటలతోనూ ప్రయోజనం పొందేలా ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అవగాహన కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, ఇరిగేషన్ సిఈ రహీముద్దీన్, ఎస్ఈ కేశవరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, పలు మండలాల తహసిల్దార్లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333