భూ సమస్యలను పరిష్కరించాలి కలెక్టర్

May 2, 2025 - 19:39
 0  17
భూ సమస్యలను పరిష్కరించాలి కలెక్టర్

జోగులాంబ గద్వాల 2 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఇటిక్యాల. భూ భారతి చట్టం అమలుకు ఈ నెల 5 నుంచి 16 వరకు ఇటిక్యాల మండలాన్ని పైలట్‌గా ఎంపిక చేసినందున,తహసీల్దార్లు పూర్తిగా సిద్ధంగా ఉండి ప్రజల భూ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్  అధికారులను ఆదేశించారు శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు భూభారతి చట్టం,రెవెన్యూ సదస్సు పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 


   ఈ సందర్భంగా జిల్లా కలెక్టట్ మాట్లాడుతూ భూ భారతి చట్టం అమలులో భాగంగా,జిల్లాలోని ఇటిక్యాల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ మండలంలోని తేది:-05.05.2025 న గోపాల్ దిన్నె, 06న వావిలాల, 07న పెద్ద దిన్నె, 08న సత్తర్ల, 09న ఎం.ఆర్. చెరువు, 12న షాదాబ్, 13న ఇటిక్యాల, 14న చాగాపురం, 15న మునగాల, 16న ఉదండాపురం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుండి భూ సంబంధిత దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇటిక్యాల మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేసిన నేపథ్యంలో అక్కడ అవసరమైన సిబ్బంది,టీమ్స్,అవసరమైన పత్రాలు,రిజిస్టర్లు మొదలైనవి ముందుగానే సిద్ధం చేయాలని తహసీల్దార్లకు సూచించారు. ప్రతి గ్రామం వారీగా మొత్తం సర్వే వివరాల జాబితాను తయారుచేసి అందుబాటులో ఉంచాలని సూచించారు సమస్యల కేటగిరీల ఆధారంగా పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజల భూ సమస్యలపై స్వయంగా దరఖాస్తులు తీసుకోవాలని,ప్రతి దరఖాస్తు సమగ్రంగా పరిశీలించబడేలా తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ చూపి పరిష్కరించాలని  ఆదేశించారు.రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ప్రతి రోజు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, రోజువారీగా వాటిని  నవీకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.గ్రామ పంచాయతీ కార్యదర్శుల సహకారంతో కార్యక్రమంపై ప్రచారం నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ఈ కార్యక్రమపు ప్రధాన లక్ష్యమని, అందుకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేసి  విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో  అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, తహసీల్దార్లు వీర భద్రప్ప,నరేష్,డిప్యూటీ తహసీల్దార్ నందిని,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333