భూ భారతి చట్టం అమలులో ఇటిక్యాల మండలాన్ని జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక

రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో ఉచితంగా దరఖాస్తులు సమర్పించవచ్చు.. జిల్లా కలెక్టర్ సంతోష్.
జోగులాంబ గద్వాల 5 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు. సోమవారం ఇటిక్యాల మండలం గోపాల్ దిన్నె గ్రామంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం అమలులో భాగంగా 28 జిల్లాల్లో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన జిల్లా నుండి ఇటిక్యాల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో, భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు సమర్పించాలన్నారు. గతంలో ప్రజలు తహసీల్దార్,ఆర్డీఓ లేదా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు అధికారులు స్వయంగా గ్రామాలకే వచ్చి ప్రజల సమస్యలను స్వీకరిస్తున్నారని తెలిపారు. అధికారులు దరఖాస్తులను పరిశీలించి, వేరిఫికేషన్ ద్వారా అర్హతను నిర్ధారించిన తర్వాత వారికి సంబంధిత ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిపారు.మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు ఫీజు ఉంటుందని,ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు పూర్తిగా ఉచితంగా స్వీకరించబడతాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఉదయం 9 :00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు అధికారులు గ్రామంలోనే అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అందరూ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలన్నారు. ఫారమ్ నింపడంలో ఎలాంటి సందేహాలు ఉంటే,సహాయం కోసం ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాట్లు చేయబడినట్లు తెలిపారు. రైతుల నుండి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నెల రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, ఇటిక్యాల తహసీల్దార్ వీర భద్రప్ప, ఎర్రవల్లి తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ అజార్ మొహినుద్దీన్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.