బాలికల భద్రతకు ప్రత్యేక రక్షణ సీఐ నాగేశ్వరరావు
తిరుమలగిరి కస్తూర్బా గాంధీ పాఠశాలలో 'పోలీస్ అక్క' అవగాహన
- మహిళలు, బాలికల భద్రతకు ప్రత్యేక రక్షణ.
- ప్రతి పోలీస్ స్టేషన్‌లో 'పోలీస్ అక్క' నియామకం.
- మీ సొంత అక్క లాగా మీ సమస్యలు విని మీ రక్షణ కోసం పని చేస్తారు.
నాగారం సర్కిల్ సీఐ డి.నాగేశ్వరరావు.
తిరుమలగిరి 16 జులై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
ప్రతి బుధవారం నిర్వహించే పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా మహిళలు, విద్యార్థినుల భద్రతే ధ్యేయంగా తిరుమలగిరి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 'పోలీస్ అక్క' అవగాహన సదస్సు నిర్వహించారు. నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళలు, బాలికల భద్రత కోసం జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు 'పోలీస్ అక్క' అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా పోలీస్ అధికారిని 'పోలీస్ అక్క'గా నియమించడం జరిగిందని వివరించారు. ఈ 'పోలీస్ అక్క' తన పరిధిలోని ప్రతి పాఠశాల, కళాశాలను సందర్శించి విద్యార్థినులతో సమయాన్ని కేటాయిస్తారని చెప్పారు. మీ సొంత అక్క లాగా మీతో కలిసిపోయి, మీ సమస్యలను ఓపిగ్గా విని, మీ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తారని భరోసా ఇచ్చారు. "పోలీస్ అక్క ఎల్లప్పుడూ మీకోసం ఉంటుంది" అని స్పష్టం చేశారు. ఏదైనా ఆపద లేదా అత్యవసర సమయాల్లో బాలికలు భయపడకుండా తక్షణ సహాయం కోసం 112 మరియు 100 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. అలాగే మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న మొబైల్ యాప్‌లను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని అవగాహన కల్పించారు. విద్యాలయంలో పోలీస్ అక్క కమిటీలు ఏర్పాటు చేస్తాం అని అన్నారు. మహిళలను ఎవరైనా వేదిస్తే కఠిన చర్యలు తప్పవు అని సిఐ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్ రెడ్డి, పోలీస్ అక్క కానిస్టేబుల్ మౌనిక, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.