ఫ్రీ లెఫ్ట్ సర్వీస్ రోడ్డు లేక ట్రాఫిక్ కష్టాలు
ఖమ్మం ఎక్స్ రోడ్ జంక్షన్‌లో నిత్యం వాహనదారుల అవస్థలు
వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజల డిమాండ్
సూర్యాపేట పట్టణంలోని అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఖమ్మం ఎక్స్ రోడ్ వద్ద ఫ్రీ లెఫ్ట్ సర్వీస్ రోడ్డు లేకపోవడంతో ప్రతిరోజూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అన్ని దిశల నుంచి వచ్చే వాహనాలు ఒకేచోట నిలిచిపోవడంతో ఉదయం,సాయంత్రం వేళల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.ఖమ్మం వైపు నుంచి వచ్చే వాహనాలు ఎడమవైపు తిరగాలన్నా సిగ్నల్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ఫ్రీ లెఫ్ట్ సౌకర్యం లేకపోవడంతో ఆటోలు,ద్విచక్ర వాహనాలు,కార్లు,ట్రాక్టర్లు ఒకే వరుసలో నిలిచిపోతున్నాయి. ఫలితంగా ప్రయాణికులు విలువైన సమయాన్ని కోల్పోవడంతో పాటు అత్యవసర సేవల వాహనాలు కూడా ఆలస్యంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.స్థానికుల అభిప్రాయం ప్రకారం,ఈ కూడలిలో ఫ్రీ లెఫ్ట్ సర్వీస్ రోడ్డు నిర్మిస్తే ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.ముఖ్యంగా విద్యార్థులు,ఉద్యోగులు,వ్యాపారులు ప్రతిరోజూ ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఖమ్మం ఎక్స్ రోడ్ జంక్షన్‌ను పరిశీలించి,ఫ్రీ లెఫ్ట్ సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.