ప్రభుత్వ రంగంలోనే  కొనసాగించడంతోపాటు వైద్య రంగాన్ని పూర్తిగా సంస్కరించాలి

Dec 30, 2024 - 17:27
 0  3

ప్రభుత్వ రంగంలోనే  కొనసాగించడంతోపాటు వైద్య రంగాన్ని పూర్తిగా సంస్కరించాలి.ప్రజల కొనుగొలుశ క్తి పెంచి  పేదరికాన్ని నిర్మూలించడానికి ఇది తప్పనిసరి. సౌకర్యాలు, మందులు, పరికరాలు, నిపుణుల   కొరత సృష్టించి  వైద్య రంగాన్ని  నిర్వీర్యం చేయడం తగదు. *

వడ్డేపల్లి మల్లేశం  
08...10...2024
అర కొరపోషక విలువలు , అన్ని రకాల కాలుష్యాలు,  ఆహార పదార్థాలు విషపూరితం కావడం,  వ్యాపార వర్గాలు కల్తీకి పాల్పడడంతో పాటు  ఉప్పు చక్కర నూనెతో కూడిన నిల్వ ఆహార పదార్థాలను  లాభార్జనకు అమ్మడం  తో పిల్లలతో సహా పెద్దలు వృద్ధుల వరకు సహజంగా,  కృత్రిమంగా అనారోగ్యం బారిన పడక తప్పడం లేదు.  ఉమ్మడి జాబితాలో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నప్పటికీ  ఆరోగ్య పరిరక్షణలోనూ వైద్య సౌకర్యాల కల్పన లోను  ప్రభుత్వ రంగం కు నారిల్లిపోవడాన్ని మనం గమనించవచ్చు.  బడ్జెట్లో వైద్య రంగానికి నిధులను  నామమాత్రంగా కేటాయించడంతోపాటు  ఆహార పదార్థాలకు సంబంధించిన తనిఖీ అధికారులను  సరిపోయిన స్థాయిలో నియమించకపోవడం  నిఘా లేకపోవడం  ఇటీవల కాలంలో పాఠశాలలు వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలోనూ  పిల్లలకు వడ్డించే ఆహారం విషపూరితం కావడం  వంటి అనేక రకాల  వైఫల్యాలను మనం నిరంతరం వైద్య ఆరోగ్య రంగంలో  గమనించవచ్చు. 
    .  అనారోగ్యం బారిన పడడానికి ప్రకృతి  వాతావరణ లోపాలు  వివిధ రకాల కాలుష్యాలతో పాటు రోగనిరోధక శక్తి సన్నగిల్లి పోవడం కూడా  ప్రధాన కారణాలుగా కనపడుతున్న నేపథ్యంలో  ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం,  పేదరికం నిర్మూలించడం,  ముఖ్యంగా పేద మధ్యతరగతి అట్టడుగు ఆదివాసి వర్గాల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి  వైద్య రంగాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించడంతో పాటు  అదే స్థాయిలో ప్రస్తుతం కేవలం ఒకటి రెండు శాతానికి మించని బడ్జెట్ను  ఐదు శాతం కనీసం గా పెంచినట్లయితే  ప్రభుత్వ రంగంలో అన్ని సౌకర్యాలు ఉచితంగా నాణ్యమైన స్థాయిలో లభించే అవకాశం ఉంటుంది .
    
   తీసుకు రావలసిన కొన్ని సంస్కరణలు :-
***********
పాలకవర్గాల  కను సన్నుల్లో ఉండే పెట్టుబడిదారీ వర్గం  ప్రైవేట్ రంగంలో వైద్య రంగాన్ని  తమ ఆధిపత్యంలో ఉంచుకుంటూ ఆసుపత్రులు ఇతర సౌకర్యాలను కల్పించడం కారణంగా  ప్రభుత్వ రంగం మొక్కుబడిగానే మిగిలిపోతున్నది  .పాలకులు కూడా ప్రభుత్వ రంగాన్ని  విస్మరించడం,  నామ మాత్రంగానే నిర్వహించడం వలన  పేద వర్గాలు తమ అవసరాల కోసం అనారోగ్యం బారిన పడ్డప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం విధిగా  ప్రైవేటు వైద్య సంస్థలకు వెళ్లక తప్పడం లేదు. తద్వారా  లక్షలాది రూపాలను ఖర్చు చేయవలసి రావడంతో పేదలు మరీ పేదలవుతున్నారు  సంక్షేమ రాజ్యమని చెప్పుకున్నప్పటికీ
ప్రభుత్వ రంగంలో ప్రయోజనం లభించకపోవడంతో  ఆందోళన చెందుతున్నారు, అదే సందర్భంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కూడా.  ఈ సందర్భంగా కొన్ని రకాల సంస్కరణలు జరగాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది .
ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా మొత్తం వైద్య ఆరోగ్య రంగాన్ని  ప్రభుత్వమే నిర్వహించాలి.
ప్రజల అవసరాల కనుగుణమైన స్థాయిలో అన్ని హంగులతో వైద్యశాలలను నిర్మించడంతోపాటు  వసతులు యంత్ర పరికరాలు వైద్య నిపుణులు  ప్రాథమిక అవసరాలను ఉన్నత స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి .
కింది స్థాయిలో వైద్యులు ఉన్నత స్థాయి పరీక్షలు అవసరమని సిఫారసు చేసినప్పటికీ  పై స్థాయి వైద్యశాలలో ఆ పరీక్షలు ఉన్నప్పటికీ  నిర్వహించకపోవడం దాటవేత ధోరణి  నిర్వహిస్తున్న వైద్యులపై  తగు చర్యలు తీసుకోవాలి.
అదే సందర్భంలో  సమర్థత కలిగి అరకొర సౌకర్యాలు ఉన్నప్పటికీ తమ నైపుణ్యముతో  శక్తికి మించినటువంటి శస్త్ర చికిత్సలు,  చికిత్సలు అందిస్తున్నటువంటి వైద్య సిబ్బందిని కూడా మనం అక్కడక్కడ గమనించవచ్చు.  అలాంటి చోట తగిన సౌకర్యాలు నిపుణులు, వైద్య సిబ్బంది మందులు లేకపోవడంతో  ఇతరత్రా ఆధారపడడం మందుల కోసం బయటికి రాయడంతో  అక్కడి వైద్య సిబ్బంది అభాసుపాలవుతున్న విషయాన్ని పాలకులు,సమాజం గమనించాలి.
నియోజకవర్గస్థాయిలో అన్ని రకాల వైద్య పరీక్షలు అన్ని రకాల   నిపుణులు యంత్ర పరికరాలు ఉండాలి  మండల స్థాయిలో  కూడా  ప్రత్యేక విభాగాలు అక్కడి ప్రజల అవసరాలను బట్టి సిబ్బంది నియామకం చేయడం అవసరం .
ప్రస్తుతము ఉద్యోగులు పెన్షనర్లు పోలీసు జర్నలిస్టుల సంక్షేమం కోసం  జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్న వెల్నెస్ సెంటర్లలో  జూనియర్ వైద్యులను కాకుండా సీనియర్ వైద్యులను ఏర్పాటు చేయడంతో పాటు  అన్ని రకాల నిపుణులు అన్ని రకాల చికిత్సలు అందుబాటులోకి తీసుకురావాలి.  ప్రతి పరీక్ష ప్రతి చికిత్స అక్కడ  తప్పనిసరిగా  అందుబాటులో ఉండేలా చూడాలి  అన్ని రకాల మందులను  నాణ్యమైన కంపెనీలకు చెందినవి  లభించేలాగా చూడాలి.
 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ప్రస్తుతం అరకొర వైద్య సౌకర్యాలు మందులు సిబ్బంది ఉంటున్నారు భవనాలు మాత్రం ఉన్నత స్థాయిలో కనపడుతున్నవి దానివల్ల ప్రయోజనం లేదు.   ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులకు  ముఖ్యంగా పేదలు గ్రామీణ ప్రాంత ప్రజలు వస్తుంటారు కనుక  వెల్నెస్ సెంటర్లలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు అన్ని కూడా వీళ్లకు ఈ కేంద్రాలలో లభించాలి . ఇప్పటికీ ఉద్యోగ పెన్షనర్లకు  లభిస్తున్న సౌకర్యం గ్రామీణ  మండల ప్రాంతాలలో లభించకపోవడం వివక్షత గానే చూడాల్సి ఉంటుంది.
ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి  భవనాలు సిబ్బంది యంత్ర పరికరాలు అంతకుమించి సీనియర్ వైద్యులను
ప్రభుత్వం  తన ఆధీనంలోకి తీసుకొని నాణ్యమైన సేవలను ప్రజలకు ఉచితంగా అందించేలా చూడాలి.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉప కేంద్రాలు ప్రాథమిక కేంద్రాలలో జూనియర్ వైద్యులను  నియామకం చేయడం ద్వారా  వీలున్న మేరకు ప్రతి గ్రామాలకు సౌకర్యాన్ని కల్పించడానికి అవకాశం ఉంటుంది .
వైద్య ఆరోగ్యశాఖ  అత్యవసరమైనటువంటి శాఖ కనుక ఇందులో పనిచేసే సిబ్బందికి ప్రైవేట్ లోనూ లేక  ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేయడాన్ని విరమించుకోవాలి.  నిద్రాహారాలు మాని రాత్రి పగలు తేడా లేకుండా అత్యవసరంగా పనిచేయవలసి ఉంటుంది కనుక వీరి వేతనాలను భారీగా  పెంచాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో కాంట్రాక్టు పద్ధతిలో  అల్ప వేతనాలకు వారిని నియమిస్తే  నిరాశానిస్పృహాలకు  గురయ్యే అవకాశం ఉంటుంది తద్వారా వైద్య సేవలు నాణ్యమైన స్థాయిలో అందకపోవచ్చు.
ప్రతి ఆసుపత్రిలోనూ రాత్రి పగలు అనే తేడా లేకుండా సిబ్బందిని అలాట్ చేయడంతో పాటు వైద్య పరీక్షలు చికిత్స  డాక్టర్ల అందుబాటు నిరంతరం కొనసాగాలి.  క్రింది స్థాయి వైద్యులు చేసిన సిఫారసులను పై స్థాయి వైద్యశాలల  ఎలాంటి ఫైరవులకు ఆస్కారం లేకుండా ఆమోదించి సేవలు అందించాలి. 
రకరకాల కాలుష్యాల మయమైన ఈ వాతావరణ పరిస్థితులలో  ఎవరికైనా ఎంత పెద్ద రోగమైనా వచ్చే ఆస్కారం ఉంటుంది . అప్పుడప్పుడు పత్రికల్లో ఈ రోగం నయం కావాలంటే లక్షలు లేదా కోటి రూపాయలు కావాలి అనే  ప్రకటనలు వస్తూ ఉంటాయి  అది ఎంత పెద్ద రోగమైనా ప్రభుత్వమే ఉచితంగా  నయం చేయాలి కానీ ఇలాంటి ప్రకటనలకు ఆస్కారం ఇవ్వకుండా చూడాలి.
ముఖ్యంగా పాఠశాలలు రెసిడెన్షియల్  విద్యాలయాలలో  ఇటీవలి కాలంలో ఫుడ్ పాయిజన్ సమస్య అధికంగా  జరుగుతున్న వేళ  ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా  కనీసం రెండు మూడు పాఠశాలల కైనా  వైద్యులు సిబ్బంది మందులు  అందుబాటులో ఉండే విధంగా క్లినిక్లను ఏర్పాటు చేయాలి .
చిన్న పట్టణాలు  మేజర్ గ్రామాలలో  అనివార్యమైన చోటా ప్రాంతీయంగా  వైద్యశాలలు ఏర్పాటు చేసిన అభ్యంతరం లేదు. అంతిమంగా ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడమే ప్రభుత్వం యొక్క  రాజ్యాంగ బాధ్యత కనుక  ఎన్ని కోట్ల నిధులైన వెచ్చించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ ప్రణాళికను ఆమోదించడం ద్వారా ప్రజల దైనందిన ఆరోగ్య పరిస్థితులను కాపాడడంలో క్రియాశీలక భూమిక పోషించాలి .
నిపుణులు,  మందులు,  సౌకర్యాలు, యంత్ర పరికరాలు,  అనుకూలమైన భవనాలు లేకుండా అరకొర సౌకర్యాలతో ఈ వ్యవస్థను నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వాలు వెంటనే  ఆ విధానానికి స్వస్తి పలకాలి  .ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యపరిచే ప్రభుత్వ చేష్టలను  ప్రజలు తమ ఒత్తిడి ద్వారా  నిరసించి డిమాండ్ చేయడం ద్వారా సౌకర్యాలను పెంపొందించుకోవడం కూడా అవసరం .
      ఏ స్థాయిలోని వైద్యమైనా  ప్రజలకు ఉచిత,నాణ్యమైన స్థాయిలో అందుబాటులో ఉన్నప్పుడు ఇక  ఆయా కుటుంబాలకు అనవసర ఖర్చులు కూడా తగ్గడం వలన కొనుగోలు శక్తి భారీగా పెరుగుతుంది. అంతేకాదు  అనారోగ్య బారిన పడకుండా లేదా తగు జాగ్రత్తలను తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.  ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలు సరిగా ఉంటాయి, శారీరక మానసిక వికాసం సరిగా ఉన్నప్పుడు  అందరు కూడా తమ తమ వృత్తిలో నైపుణ్యాన్ని కనబరిచి, ఉత్పత్తిలో భాగస్వాములై, ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడుతారనడంలో సందేహం లేదు.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333