ప్రతిభావంతుల ప్రోత్సాహమే సమాజాభివృద్ధికి పునాది: కూరపాటి వెంకటనారాయణ
సూర్యాపేట టౌన్, ఆగస్టు 23,: ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా సమాజాభివృద్ధికి బాటలు వేయవచ్చని తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఆదివారం పట్టణంలోని పద్మశాలి భవన్ లో పద్మశాలి సేవా సమాజ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు, నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... విద్య మాత్రమే సమాజాన్ని మార్చగల శక్తి అని పేర్కొన్న ఆయన, సంక్షేమ పథకాల కంటే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 12 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రజలు కష్టపడి, స్వశక్తితో అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వ విధానాలు ఉండాలని సూచించారు. పద్మశాలిలు రాజకీయాల్లోకి మరింతగా రావాలని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. తాను పద్మశాలి కావడం వల్లే తెలుగు అకాడమీ చైర్మన్‌గా అవకాశం లభించిందని పేర్కొంటూ, తెలుగు అకాడమీ తరఫున ఇంటర్మీడియట్ తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.10 వేల నగదు పురస్కారం అందజేస్తున్నట్లు వెల్లడించారు. తమ అకాడమీ ప్రతి సంవత్సరం దాదాపు రూ.10 కోట్ల విలువైన పుస్తకాలను ముద్రిస్తోందని తెలిపారు. సూర్యాపేటతో తనకు ఎంతో అనుబంధం ఉందని, మారోజు వీరన్న వంటి ప్రముఖులను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. సూర్యాపేట కొంతకాలంగా అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురైందని వ్యాఖ్యానించారు. తాను జీవించే కాలంలో తెలంగాణలోని 33 జిల్లాలను సందర్శించి అక్కడి పద్మశాలి సోదరులను కలుసుకోవాలన్న సంకల్పం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. తాను తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్‌కు అనుచరుడినని తెలిపారు. చారిత్రక నిర్మాణాలను కూల్చివేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జనాభా పరంగా ఐదవ స్థానంలో ఉన్న పద్మశాలిలు ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంఘాలను ఏర్పాటు చేయకుండా, సమాజ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పద్మశాలి సమాజ అభ్యున్నతికి, తెలుగు అకాడమీ అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు. బీసీ అజెండా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు పెండం చంద్రశేఖర్, విశిష్ట అతిథి ప్రొఫెసర్ రుద్ర సాయి బాబా, అధ్యక్షులు పెండం చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు యలగందుల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి పెండం వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి చల్లమల్ల వెంకటరమణ, కోశాధికారి పెండెం కృష్ణ కుమార్, కార్యవర్గం సభ్యులు వైద్యులు పెండం వెంకటరమణ, మానుపూరి రాములు, ముషం రవి, రావిరాల మల్లయ్య, యలగందుల రామలింగయ్య, మానుపూరి ప్రసాద్, సన్మాన గ్రహీతలు కందలగడ్డ మల్లికార్జునరావు, కొంపల్లి అజయ్ కుమార్, గాజుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.