ప్రజా పాలనలో తీరని రైతుల కష్టాలు

Mar 7, 2025 - 20:47
 0  3
ప్రజా పాలనలో తీరని రైతుల కష్టాలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ప్రజా పాలనలో తీరని రైతుల కష్టాలు... ఎండుతున్న పంట పొలాలను కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్న రైతులు.... ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి విడుదలకై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల మహా రాస్తారోకో... తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి.... ప్రజా పాలనలో ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని గొప్పలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలు తీర్చడంలో విఫలమైందని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి విమర్శించారు.ఈరోజు సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై ఆత్మకూరు(ఎస్) మండలంలోని నంద్యాల గూడెం స్టేజి ఎస్సారెస్పీ కాలువ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో వరిగంటలు చేత పట్టుకొని గంటన్నర పాటు భారీ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంట పొలాలు కాపాడటానికి పూర్తిస్థాయిలో ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటి విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. చివరి భూములకు నీళ్లు అందకపోవడంతో రైతులు వేసిన పంట పొలాలు పూర్తిస్థాయిలో ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న పంట పొలాలను రక్షించుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారని అన్నారు. ప్రతి మండలం నుండి సుమారు 700 నుండి వేయి ఎకరాల వరకు పంట పొలాలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. వరి పొలాలు పొట్ట దశలో ఉండి పంట చేతికొచ్చే సందర్భంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే రైతుల గుండెలు తరుక్కుపోతున్నాయని తెలిపారు. ఒకపక్క భూగర్భ జలాలు అడుగంటిపోయి బావులు,బోర్లలో నీళ్లు సక్రమంగా రాక మరోపక్క ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటి విడుదల లేక రైతాంగం తీవ్ర ఆందోళనలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇటీవల కాలంలో రైతాంగం రోడ్ల మీదికి వచ్చి ఎస్సారెస్పీ కాలువ ద్వారా పూర్తిస్థాయి నీళ్లు విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని ధర్నాలు రాసారోకోలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులుగాని పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి నీటి విడుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గంలోని మండలాలకు నీటి విడుదల లేక రైతాంగం సతమతం అవుతున్నారని వెంటనే అధికార పార్టీ శాసనసభ్యులు చొరవ తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖ అధికారులు నీటి విడుదల కోసం ప్రణాళిక రూపొందించి రైతుల పంట పొలాలు కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంట పొలాలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో సర్వే నిర్వహించి ప్రతి ఎకరానికి 30 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి రైతు సంఘం జిల్లా నాయకులు అవిరే అప్పయ్య, నాయకులు గుండు చిన్న లింగయ్య ,రాచకొండ సైదులు, మూల విజయ రెడ్డి ,రైతులు గుండు వెంకన్న గుండు రమేష్ కేశబోయిన మళ్లయ్య , రామయ్య, ముదిరెడ్డి జానకి రెడ్డి ,కంచర్ల ఉపేందర్ రెడ్డి, గుగులోతు నాగు, బానోతు లింగయ్య, ఆవుల గురవయ్య నంద్యాల నరేష్ రెడ్డి, నంద్యాల వెంకటరెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.