ప్రజాస్వామ్య పరిరక్షణ హామీ ఏమైంది . సి ఐ టి యు

Mar 30, 2026 - 17:18
Mar 30, 2026 - 17:33
 0  3

జోగులాంబ గద్వాల 30 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లతోపాటు,7 వ హామీగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని హామీ ఇచ్చిందని, కానీ ప్రజాస్వామ్య పరిరక్షణలో దారుణంగా విఫలమైందని  CITU జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ అన్నారు. చలో హైదరాబాద్ సందర్భంగా హైదరాబాద్ కు వెళ్లిన ఆశా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆశా కార్యకర్తలకు 18 వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే ఆశా కార్యకర్తలపై అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు .తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన ఆశాలపై,సిఐటీయూ రాష్ట్ర నాయకులపై నియంత్రత్వంగా వ్యవహరించి లాఠీచార్జ్ చేయడమే కాకుండా రాత్రి వరకు ఆడపడుచులను పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని ఏడవ హామీగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. కార్మిక వర్గ పోరాటాల పట్ల బాధ్యతరాహితంగా వ్యవహరించిన ఏ ప్రభుత్వము మనుగడ సాధించిన దాఖలాలు లేవన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సిఐటీయూ అనుబంధం) జిల్లా కార్యదర్శి కే.సునీత మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే ఆశా కార్యకర్తల ఇళ్ల దగ్గరికి వచ్చి అక్రమంగా అరెస్టులు చేయడమే కాకుండా మంచినీళ్లు కూడా ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లను నిర్బంధించారని విమర్శించారు. తమను విస్మరించి తమ పోరాటాలను అణచివేసిన గత ప్రభుత్వానికి  ఏ గతి పట్టిందో గుర్తుతెరగాలని హెచ్చరించారు. తమకు ఫిక్స్డ్ వేతనం 18000 ఇచ్చేంతవరకు, అదనపు పని భారాలు తగ్గించాలని, మట్టి ఖర్చులకు 50,000, ఇన్సూరెన్స్  50 లక్షల చెల్లించేంతవరకు తమ పోరాటం ఆగబోదని తక్షణమే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో ఆశాలకు ప్రత్యేక నిధుల కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు నర్సింగమ్మ, నాగ ప్రమీల,శ్వేత,జయలక్ష్మి,కేబీ సునీత, కాంతమ్మ, కవితా, పద్మ, శ్రీదేవి,తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State