ప్రజావాణి ద్వారా తక్షణమే పరిష్కారం
తిరుమలగిరి 18 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- ప్రజా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తిరుమలగిరి మండల ప్రజావాణి నోడల్ అధికారి, ఎంపీడీవో లాజర్ అన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజేసి పరిష్కారం పొందాలని, సమస్యల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి లాజర్ మాట్లాడుతూ ప్రజలకు చేరువగా ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతిపత్రాలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు కృషి చేస్తారని తెలిపారు. ఫిర్యాదుదారులు తాము అందజేసిన వినతిపత్రం ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖలకు సంబంధించిన నాలుగు ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్ కుమార్, డీటీ జాన్ మహ్మద్, ఎంపీఓ భీమ్ సింగ్. ఇతర శాఖ అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.