ప్రజలకు ద్రోహం చేసే మద్యం ఉత్పత్తి, విక్రయాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిషేధం విధించాలి
ప్రజలకు ద్రోహం చేసే మద్యం ఉత్పత్తి, విక్రయాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిషేధం విధించాలి. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి, సోయి, బాధ్యత ఉంటే మద్యం దుకాణాల స్థానంలో వివాదాలు, సామాజిక సమస్యలు, ఆరోగ్యము, పోషకాహారం పై కౌన్సిలింగ్ కేంద్రాలేర్పాటు చేసి ప్రజాపాలనని రుజువుచేసుకోవాలి.
వడ్డేపల్లి మల్లేశం
26...10...2024
తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సమాజ నిర్మాణం తో పాటు ప్రజల అభివృద్ధి సంక్షేమానికి బాటలు పరిచి రాజ్యాంగ పలాలను ప్రజలకు చేరవేసే క్రమములో ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రతి వ్యక్తిలో నింపాల్సినటువంటి గురుతర బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు, విద్యా వైద్యం సామాజిక న్యాయాన్ని ఉచితంగా అందించడం ద్వారా ప్రజా చైతన్యాన్ని పెంపొందించవలసిన పాలకులు దానికి భిన్నంగా నడుచుకుంటూ ప్రజా కంఠకులుగా మిగిలిపోవడం విచారకరం. మద్యపానం ధూమపానం క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు మత్తు పదార్థాలను ప్రభుత్వమే పెంచి పోషించి అనుమతించి సరఫరా చేయడం సిగ్గుచేటు మాత్రమే కాదు అది ప్రజలకు జరుగుతున్న పెద్ద ద్రోహం, దేశానికి తీరని నష్టం,. అనారోగ్యం భారతానికి మూలం కూడా. రాజ్యాంగంలో రాసుకున్న ఆదేశిక సూత్రాలలో ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేయాలో నిర్దేశించినా, ప్రజలు ఎన్నికల సమయంలోనూ ఇతరత్రా డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచుతున్నా, ఉద్యమకారులు విప్లవ సంస్థలు ప్రజా సంఘాలు మేధావులు మానవ పౌర హక్కుల సంఘాలు కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజలకు ఏం కావాలో ఏ స్థాయిలో కావాలో ప్రజల హక్కులు ఏమిటో తెలియజేస్తూ ఆ వైపుగా కృషి చేయాలని పోరాటం చేస్తున్న కూడా వాటిని మరిచి పాలకుల ఉనికి కోసం స్వార్థం కోసం పెట్టుబడిదారులకు అండగా మాత్రమే కొనసాగుతున్నారు కానీ ప్రజల పక్షాన నిలబడడం లేదు. ఆ కుట్రలో భాగమే ప్రజలను నిర్వీర్యం చేసి నిస్సహాయులను చేసి బానిసలుగా చూడాలని ఆలోచించడమే. అందుకే కాబోలు ప్రజలను తాగుబోతులుగా చేయడంలో ప్రభుత్వాలు చూపుతున్న శ్రద్ధ అంతా కాదు.విద్యా వైద్యం ప్రజలకు ఉచితంగా నాణ్యమైన స్థాయిలో ప్రభుత్వాలే అందించాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనేక సందర్భాల్లో నొక్కి చెప్పడం జరిగింది అదే సందర్భంలో మాట్లాడుతూ ఉచిత నాణ్యమైన విద్య ద్వారా చైతన్యవంతులై వైద్యము ద్వారా ఆరోగ్యవంతులై ప్రభుత్వాలనే శాసించే స్థాయికి ప్రజలు ఎదిగితే ప్రభుత్వాలకు ఉనికి ఉండదు కనుక ప్రభుత్వాలు ఆ పని చేయకపోవచ్చు అన్న మాట నిజమైనది. ఇప్పటికీ స్వతంత్ర భారతదేశంలో 77 ఏళ్ల తర్వాత కూడా కేంద్రముతో సహా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచిత విద్య వైద్యం ప్రభుత్వం యొక్క బాధ్యత అని రెండు రంగాలు కూడా ప్రభుత్వ ఆద్వర్యంలోనే కొనసాగుతాయని ప్రైవేట్ రంగానికి ఆస్కారం లేదని చెప్పగలిగినాయా? ఇక కొద్ది మందికి మాత్రమే ఉద్యోగాలు లభించడంతో కోట్లాదిమంది ప్రైవేటు చిన్నాచితక ఉద్యోగాలతో కాలం వెళ్ళబుచ్చు కుంటూ ఉంటే మిగతా వాళ్ళు స్వయం ఉపాధిని కల్పించుకొని తన రెక్కలను నమ్మి పెట్టుబడి సాయం లేకపోయినా కష్టపడి బతుకుతూ ఉత్పత్తిలో భాగస్వాములవుతూ ప్రభుత్వానికి దోహదం చేస్తున్న మాట కూడా పాలకులు అంగీకరించడం లేదు అంటే పాలకుల యొక్క విద్రోహం అంతా అంతా కాదు.సామాజిక ఆర్థిక ఆరోగ్యపరంగా నిలువునా ముంచేది శ్రేయో రాజ్యం ఎలా అవుతుంది ? ఉపాధి కల్పించినది లేదు, విద్య వైద్యం గురించి పట్టించుకున్నది లేదు, మద్యం మత్తు పదార్థాలతో కాలేయము ఊపిరితిత్తులు క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు బారిన పడుతూ ఉంటే చూస్తూ మద్యపానాన్ని ప్రోత్సహిస్తూ అనుమతిస్తూ విక్రయదారులకు అండగా ఉంటున్న ప్రభుత్వం శ్రేయో రాజ్యం ఎలా అవుతుంది? సంక్షేమ అభివృద్ధి దిశగా దేశాన్ని తీసుకు వెళ్ళడానికి ప్రభుత్వాలు తోడ్ప డాలని రాజ్యాంగంలో రాసుకుంటే బూటకపు నినాదాలుగా మారిపోతే ఎలా? పేదలు కార్మికులు అనే వర్గాల ప్రజలు విద్యార్థులతో సహా మద్యపానానికి అలవాటు పడి తమ కర్తవ్యాన్ని విస్మరించి రోజురోజుకు అనారోగ్యం బారిన పడుతూ కుటుంబానికి దూరమవుతూ ఉంటే అనేక కుటుంబాలు వీధిపాలు కావడమేనా శ్రేయోరాజ్యం ?1960 ప్రాంతంలో ముందుగా గుజరాత్ లో మద్యపానం నిషేధించినప్పటికీ రెండు మూడు రాష్ట్రాలు మినహా భారత్ దేశం యావత్తు మద్యపానం ఏరులై ప్రవహిస్తూ ఉంటే అనేక చోట్ల కల్తీ మద్యంతో మృత్యువాత పడుతూ ఉంటే చూస్తూ ఉండడమేనా పాలకుల వంతు? "ప్రజలు కోరుతున్నారు కనుక అనుమతిస్తూ ఉన్నామని చెప్పే వాళ్ళు కొందరైతే, ప్రభుత్వాలు నడవడానికి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడానికి ఆదాయం కావాలి కదా ఇంతకుమించిన ఆదాయం మరొకటి లేదు అని సమర్థించే వాళ్ళు మరి కొందరు. ప్రజలను రోగాల బారిన పడేసే మద్యంతో వచ్చే డబ్బుతోనే పాలన కొనసాగించే ప్రభుత్వాలు తమ నేరాన్ని అంగీకరించాలి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మూకుమ్మడిగా దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మధ్యాన్ని నిషేధించి తమ ఉమ్మడి బాధ్యతను చిత్తశుద్ధిని చాటుకోవాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు."
ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే :- ప్రజలు అనేక సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలతో చితికి పోతున్న విషయం మనందరికీ తెలుసు. ఆదరించేవాళ్లు భరోసా ఇచ్చేవాళ్ళు దారి చూపే వాళ్ళు లేక అనేక కుటుంబాలు అనాధలుగా మిగిలిపోతున్నాయి. అనారోగ్యం బారిన పడి కొందరు, కుటుంబ కలహాలు మద్యం మత్తులో మరికొన్ని కుటుంబాల్లో చావులు ఆత్మహత్యలు, ఇదే మత్తులో అత్యాచారాలు నిరంతరం కొనసాగుతూ ఉంటే ఇదంతా అభివృద్ధి అని పాలకులు చెప్పగలరా? ప్రభుత్వాలకు గనుక చిత్తశుద్ధి, ప్రజల మీద బాధ్యత ఉంటే స్పృహ సోయి తెచ్చుకొని మద్యం దుకాణాల రద్దు చేసి వాటి స్థానంలో కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా తమ నిజాయితీని విప్లవాత్మక ఆలోచనను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉన్నది. ఈ కేంద్రాల ద్వారా కుటుంబ కలహాలు, మానవ సంబంధాల విచ్చిన్నాన్ని సవరించడానికి, తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే మానవ మానవీయ కోణాన్ని ప్రతిపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అనారోగ్యం బారిన పడకుండా వాతావరణ పరిరక్షణ కాలుష్యం నుండి కాపాడుకోవడం అనారోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలను మాన్పించడం పోషకాహారము దొరికే ఆహార పదార్థాలను అలవాటు చేయించడం వంటి అంశాల పైన శిక్షణ అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉన్నది. తద్వారా అనేక రోగాల బారిన పడకుండా మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే నినాదాన్ని నిజం చేయడానికి అవకాశం ఉంటుంది .ఎ రువులు పురుగుమందుల వాడకం వలన ఉత్పత్తి అయ్యే ధాన్యాలలో పోషక విలువలు లేకపోగా భూమి ధాన్యము కలుషితం కావడం వలన లేని రోగాల బారిన పడడానికి అవకాశం ఎక్కువగా ఉన్న విషయం జనానికి తెలియ చెప్పాల్సిన అవసరం ఉంది.అంతేకాదు ప్రభుత్వాలు కూడా వాటి వాడకాన్ని నిరోధించి వాటి స్థానంలో సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించడానికి ప్రోత్సహించడం చాలా అవసరం. పౌర ధర్మాన్ని కూడా మరింత బాధ్యతాయుతంగా నిర్వహించడానికి ప్రజలు తప్పుదారిలో నడవకుండా ఉండడానికి జరుగుతున్న పొరపాట్లను దృష్టికి తీసుకు పోవడంలో కూడా ఈ కౌన్సిలింగ్ కేంద్రాలు తోడ్పడాలి. విద్య, సామాజిక న్యాయం, ఆరోగ్యం, స్నేహం, సాహిత్యం, సామాజిక మార్పు వంటి అంశాల పైన యువత, ఆసక్తి ఉన్నవాళ్లకు ప్రోత్సాహ కార్యక్రమాల ద్వారా కర్తవ్యం వైపు మళ్ళించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. మద్యాన్ని ప్రభుత్వం దుకాణాల ద్వారా అనుమతించడం, ఎన్నికల సమయంలో ఉచితంగా పంపిణీ చేయడం వంటి అవ లక్షణాలను పెంచి పోషించడం తన బాధ్యత రాహిత్యంగా గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వాలు మానుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. సంపదని సృష్టించే పనులను ప్రోత్సహించడం, ప్రజలందరికీ ఉపాధి అవకాశాలను కల్పించడం, ఉత్పత్తిలో ప్రజలందరినీ భాగస్వాములను చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత కాపాడడానికి ప్రజలందరి తోడ్పాటును పొందడం ద్వారా మాత్రమే ప్రభుత్వాలు శ్రేయో రాజ్యంగా అభివృద్ధి పథంలో నిలపగలవు కానీ మత్తులో ముంచితే ప్రజలు ప్రశ్నించకుండా ఉంటే ఇదే అభివృద్ధి అనుకుంటే మాత్రం ప్రజలు ప్రతిఘటించే రోజు ఎంతో దూరంలో లేదని గుర్తిస్తే మంచిది. ప్రధాని సొంత రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభమైన మద్యపాననిషేదాన్ని దేశం మొత్తంలో అమలు చేయడానికి ఎందుకు సాహసించడం లేదు అని కూడా ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు సమాధానం చెప్పాల్సిన అవసరం చాలా ఉన్నది ఆదాయానికి మధ్యనికి లంకె వేసుకుంటే అంతకంటే హీనమైన ప్రభుత్వం మరొకటి ఉండదు సుమా!
( వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)