పేద ప్రజలున్న సంపన్న దేశం వికసిత భారతమౌతుందా?
అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని గొప్పగా చెబితే ఆ స్థాయిలో ప్రజల ఆదాయ సంపదలు లేవెందుకు?
అంతరాలులేని ఆర్థిక వ్యవస్థను, మానవాభివృద్ధిని సాధించినప్పుడే సుపరిపాలనకు అర్థం ఉంటుంది.
--- వడ్డేపల్లి మల్లేశం
మెజారిటీ పేద ప్రజానీకం, కార్మికులు, కర్షకులు , చేతివృత్తుల వారు ఉత్పత్తి సేవా రంగంలో గురుతర బాధ్యత పోషిస్తున్న కారణంగా ఈ దేశంలో ఆర్థిక పెరుగుదల ఉత్కృష్ట స్థాయికి చేరుకోవడంలో సందేహం లేదు. కానీ ఆ సంపదలో వీరు నామమాత్రంగా నైనా భాగస్వాములు కాకపోవడం వల్లనే పేదరికం రోజురోజుకు పెరుగుతున్నది అందుకే భారతదేశాన్ని "పేద ప్రజలున్న సంపన్న దేశం" అనడం రివాజుగా మారిపోయింది. దేశంలో సంపద పెరిగినంత మాత్రాన ప్రయోజనం లేదు అది జనాభా దామాషాలో ప్రజలందరికీ పంచబడాలి కానీ ఆ ప్రక్రియ జరగకపోవడంతో రోజురోజుకు పేదరికం విచ్చలవిడిగా పెరిగిపోతున్నది. గత తొమ్మిది ఏళ్లలో 25 కోట్ల మంది దుర్బర దారిద్రం నుండి బయటపడ్డారని నీతి ఆయోగ్ తోపాటు ప్రధానమంత్రి కూడా స్వయంగా ప్రకటించిన విషయాన్ని మనం గమనించాలి . అది నిజమైతే సంతోషమే కానీ సుమారు మరో 10 ఏళ్లపాటు దేశంలోని 81 కోట్ల మందికి ఆహార ధాన్యాలను ఉచితంగా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడం అంటే వారంతా పేదవాళ్లనే కదా అర్థం. ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది పేదలు ఉంటే అందులో 23.4 కోట్ల మంది భారతీయులేనని ఇటీవల ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికను బట్టి తెలుస్తుంటే వికసీత భారతదేశం అని గొప్పగా చెప్పడంలో అర్థం ఏమి ఉన్నది. ప్రస్తుతం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 2030 నాటికి 3వ ఆర్థిక వ్యవస్థకు చేరుతుందని ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్ కంపెనీ విడుదల చేసిన ప్రకటనతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించినది . ఇక ఇదే అంశానికి మద్దతుగా నేడు 3.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి అంతకు 8రెట్లు ఎదుగుతుందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . రాబడి లెక్కల మీద ఆధారపడి పేదరికం గుర్తించడం కాకుండా మానవాభివృద్ధి, జీవన ప్రమాణాలు , విద్యా వైద్యం తాగునీరు పౌష్టికాహారం వంటి కీలక అంశాలు ఏ0 తవరకు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయనేది కీలకం .
వెలుగుల నివేదికలోని డొల్లతనం :-
**********
ఇప్పటికీ భారతదేశంలో 17 శాతానికి పైగా పేదరికంలో మగ్గిపోతున్నారనేది చేదు వాస్తవం. కనీస అవసరాలను తీర్చుకోలేని స్థితిలో మానవాభివృద్ధికి దూరంగా నెట్టివేయబడ్డ కోట్లాది ప్రజానీకం గురించి ఆలోచించకపోతే ఎలా? ఈ గడ్డు పరిస్థితులు కొనసాగినా కూడా మూడవ ఆర్థిక వ్యవస్థ అవుతుంది అని చెప్పడంలో అర్థం ఉందా? సుమారు 200 దేశాలకు గాను భారతదేశ తలసరి ఆదాయంలో 140 దేశాల కన్నా దిగువలో ఉందంటే మనం సాధించిన ప్రగతి ఏ పాటిదొ అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆక్స్ ఫామ్ ఇండియా నివేదిక ప్రకారం 1 శాతం సంపన్న వర్గాల చేతిలో 40 శాతం సంపద కేంద్రీకృతమైనదంటే ఆర్థిక అసమానతలు పేద ప్రజల దుర్భర స్థితిగతులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు కదా ! ఈ వాస్తవాలను కాదని చెప్పగలరా? అంతేకాదు ముఖ్యంగా విద్యా వైద్యం ప్రైవేటు రంగంలో కొనసాగుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నామమాత్రంగా మిగిలిపోయిన కారణంగా ప్రజల ఆదాయంలో సుమారు 60- 70% ఈ రంగాలకే ఖర్చవుతుంటే పేదలు మరీ పేదలుగా మారుతున్నది నిజం కాదా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం గా సమతుల పౌష్టికాహారానికి నోచుకోని బాదితులు 15 నుండి 49 ఏళ్ల వయసులోని స్త్రీలలో 57 శాతం పురుషుల్లో 25 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారంటే ప్రభుత్వం ఏం సమాధానం ఇవ్వగలదు?. ఇక 10 ఏళ్ల లోపు బాలల ఎదుగుదలలో దుర్భర పరిస్థితులు తాండవిస్తున్నాయంటే పేదరికం నుండి బయటపడ్డారు అనే ప్రభుత్వ వాదనలో వాస్తవం ఎంత?
పరిష్కారాల వైపు ఆలోచిస్తే
ఆర్థిక అంతరాలను తగ్గించడం, ఆదాయ మార్గాలను పొదుపు పెంచడం వంటి 17 సుస్థిరమైన అభివృద్ధికి సంబంధించి ఐక్యరాజ్యసమితి చేసిన సూచనలను పాటించడంలో పాలకులు విఫలమవుతున్నారు కనుకనే ఈ దుర్భర పరిస్థితులు దేశంలో నెలకో న్నాయి. ఇప్పటికైనా ఆర్థిక నిపుణుల సూచనలు , విశ్లేషకుల అభిప్రాయాలను , జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థ మూడవ స్థానంకి చేరుతుందనే మాటకు కొంతవరకైనా అర్థం ఉంటుంది. విద్యా వైద్యము ఉపాధి అవకాశాల పైన ప్రభుత్వ దృష్టి సారించి ఆదాయ మార్గాలను గణనీయంగా పెంచడానికి కీలక నిర్ణయం తీసుకోవాలి. అప్పుల బారిలో కూరుకుపోయి మరి పేదలుగా మారకుండా తగు జాగ్రత్తలు చాలా అవసరం. పెట్టుబడులు ఎక్కువై ఆదాయము తక్కువై చేసిన అప్పులకు రైతులు ఎందరో ఆత్మహత్యల బారిన పడడం విచారం ఆ పరిస్థితుల నుండి రైతాంగాన్ని గట్టి ఎక్కించాలి . అదే సందర్భంలో కార్మికులు, చేతువృత్తుల వాళ్ళు ఇతర పేద వర్గాల ఆర్థిక స్థితిగతుల పైన సమగ్ర సర్వే జరిపి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి అమలు చేయాలి. 81 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు మాత్రమే కాదు ప ప్పులు, నూనెలు, ఇతర నిత్యావసర వస్తువులతో పాటు పోషకాహారాన్ని ప్రత్యేకంగా సరఫరా చేయడం ద్వారా భయంకరమైన రోగాల బారి నుండి తప్పించుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడం కూడా పాలకుల బాధ్యతగా గుర్తించి ఆరోగ్య భారతాన్ని నిర్మించాలి. సుమారు 60 శాతం గా ఉన్నటువంటి యువతకు చదువుకు తగిన నైపుణ్యాలను పెంపొందించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహకారాన్ని అందించడం ద్వారా కోట్లాది కుటుంబాలకు భరోసా కల్పించాలి. విద్యా వైద్య రంగాల పైన కొఠారి ఇతర కమిషన్లు చేసిన సూచన ప్రకారంగా వ్యయాన్ని పెంచి సుస్థిర విధానాలను అమలు చేయాలి . ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో రహదారులు లేక ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, విద్యుత్ శక్తి, తాగునీరు, రహదారుల వంటి ప్రాథమిక సౌకర్యాలను లేని ప్రాంతాలను గుర్తించి కల్పించడం ద్వారా నిజమైన వెలుగులు నింపాలి. అప్పుడు మాత్రమే ప్రపంచ స్థాయిలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ పై స్థానానికి ఎదుగుతుందంటే విశ్వసించడానికి అవకాశం ఉంటుంది.అభివృద్ధి పేరున అంకెలకు మాత్రమే పరిమితమైతే ఆచరణలో కిందిస్థాయిలో అభాగ్యులు కొట్టుమిట్టాడుతుంటే ఇదే రకమైన ప్రగతియో పాలకులే తేల్చుకోవాలి.
( వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, అరసం కార్యవర్గ సభ్యుడు. హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)