పీర్ ఎడ్యుకేషన్ కార్యక్రమంపై ఆశా నోడల్స్, ఫెసిలిటేటర్లకు శిక్షణ.
జోగులాంబ గద్వాల 11 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. జె. సంధ్య కిరణ్మయి అధ్యక్షతన జిల్లాలోని ఆశా నోడల్స్ మరియు ఆశా ఫెసిలిటేటర్లకు రాష్ట్రీయ కిషోర్ స్వస్త్య కార్యక్రమంలో (RKSK) భాగంగ పీర్ ఎడ్యుకేషన్ (Peer Education) కార్యక్రమంపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ, ప్రతి ఆశా కార్యకర్త తన పరిధిలో 10–19 సంవత్సరాల వయస్సు గల నలుగురు యుక్తవయస్సు వారిని (ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు) ఎంపిక చేయాలని తెలిపారు. వీరిలో పాఠశాలకు వెళ్లే వారు, పాఠశాలకు వెళ్లని వారు ఇద్దరూ ఉండేలా ఎంపిక చేయాలని సూచించారు. ఎంపిక చేసిన పీర్ ఎడ్యుకేటర్లు తమ ప్రాంతంలో 15 నుంచి 20 మంది సహచరులతో చిన్న గ్రూపులను ఏర్పాటు చేసి, నెలకు నాలుగు సమావేశాలు నిర్వహిస్తూ ఆరోగ్యం మరియు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో పోషకాహారం, రక్తహీనత నివారణ, యుక్తవయస్సులో శారీరక–మానసిక మార్పులు, పునరుత్పత్తి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, మాదక పదార్థాల వినియోగం నివారణ, అసంక్రమణ వ్యాధుల నివారణ, నెలసరి రుతు స్రావ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షిత లైంగిక ప్రవర్తన వంటి అంశాలపై పీర్ ఎడ్యుకేటర్ల ద్వారా సమాచారం, అవగాహన మరియు విద్య అందించనున్నట్లు వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా. అస్గర్ అలీ, DPHNO వరలక్ష్మి, ఇన్చార్జి మీడియా ఆఫీసర్ హీర్య నాయక్, PHN తీర్మాలరాణి SO తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.