పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
హనుమకొండ జిల్లా వంగరలో ఘటన
ప్రిన్సిపాల్, టీచర్లు వేధింపులే కారణమన్న తల్లిదండ్రులు
హుజూరాబాద్‌లో భారీ నిరసన ర్యాలీ, రాస్తారోకో
మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్యే 50 వేల సాయం
26 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
గురుకులంలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగింది. ఈ ఘటనపై హుజూరాబాద్‌లో గ్రామస్తులు ప్రజలు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇది ముమ్మాటికి హత్యేనని, ఆరోపించారు . గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన మమత, తిరుపతి దంపతుల కూతురు శ్రీవర్షిత (15) వంగరలోని పీవీ రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్నది. దీపావళి సెలవులకు వెళ్లిన శ్రీ వర్షిత ఈ నెల 23న తిరిగి పాఠశాలకు వచ్చింది. శుక్రవారం ఉదయం పాఠశాల సిబ్బంది సెల్‌ఫోన్ నుంచి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తనను వెంటనే తీసుకెళ్లాలని, ఇకడ ఉండలేనని మొరపెట్టుకున్నది. దీంతో తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు పాఠశాలకు వస్తున్నట్టు బదులిచ్చారు. ప్రార్థనా సమయం కావడంతో విద్యార్థులంతా బయటకు రాగా, శ్రీవర్షిత కనిపించలేదు. దీంతో డార్మెటరీ హాల్‌కు వెళ్లి చూడగా చున్నీతో ఉరేసుకొని విగత జీవిలా కనిపించింది. వెంటనే ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు....