నీతి మాలిన సంభాషణల్లో జీవితం లేదు అసూయ ద్వేషాల మధ్యన జీవితాలు బుగ్గిపాలు
సగటు ప్రజల జీవితానికి స్థానం లేదు.
సంపన్న వర్గాల జీవనయానాన్ని కథాంశంగా చూపిస్తే ప్రయోజనమేంటి?.
అశ్లీల దృశ్యాలపై అదుపు లేదు.* టీవీ ప్రసారాలు సీరియల్ల లోని అసంబద్ధ అంశాలు నిషేధించాలి.
----వడ్డేపల్లి మల్లేశం
ప్రజా జీవితానికి సంబంధం లేని చర్చ, సీరియల్, సినిమా, నిర్ణయం, ఊహ నిష్ప్రయోజనమైనవి. సమకాలీన సమాజంలోని తప్పటడుగులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ అవి డామినేట్ చేయకుండా నివారించగలిగే మార్గాలను వెతికి మెజారిటీ ప్రయోజనాన్ని అందించగలిగే ఆలోచన సర్వత్ర ఉండాలి .అది సినిమా సీరియల్ సామాజిక మాధ్యమాలలో వెలువడే ప్రసారం ఏదైనా కావచ్చు. కానీ టీవీ ప్రసారాలలో అనుక్షణం కనిపిస్తున్న సీరియల్ ప్రజా జీవితాన్ని పక్కనపెట్టి, సమకాలీన జీవిత సమస్యలను స్పృశించకుండా, సామాన్య ప్రజా జీవితాన్ని తీసుకోకుండా, సంపన్న వర్గాలకు సంబంధించిన జీవితాలనే ప్రధానం చేసుకొని, ఊహా జగత్తులో ఊరేగే సామాజిక ప్రయోజనం ఇసుమంతైనా లేని కథ అంశాలు సంభాషణలు సన్నివేశాలు ప్రయోజనం కంటే ఈ వ్యవస్థకు కీడే ఎక్కువగా చేస్తున్నాయని అందరం గుర్తించాలి. నిర్మాతలు, దర్శకులు, ఆర్థికంగా పెట్టుబడి పెట్టి లక్ష్యాన్ని నిర్ధారించుకునే యాజమాన్యం తో పాటు అందులో నటించే కళాకారులు కూడా డబ్బుల కోసం కాకుండా సామాజిక స్పృహ ఉన్న వాళ్లనే ఎంపిక చేసుకోవడం చాలా అవసరం . ఈ వ్యవస్థ మారాలి మరింత మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించుకోవాలి అనే ఆలోచన నటీనట వర్గంతో పాటు దర్శకులు నిర్మాతలకు లేకుంటే ఉత్తమ సీరియల్ ను విడుదల చేయలేము, దానివల్ల ప్రయోజనాలను పొందలేము. కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం పదిమంది పోషణ కోసం మాత్రమే అని చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా తెలుగు సీరియల్ లో కొనసాగుతున్నటువంటి ఈ వింత ధోరణి, వికృత పోకడను , సామాజిక స్పృహ లేని చైతన్య రాహిత్యాన్ని ముందుగా కట్టడి చేయాల్సిన అవసరం. ఉంది. వ్యాపార ధోరణితో గనుక సీరియల్ లను ఇతర ప్రసారాలను నిర్మించినట్లయితే అక్కడ మొక్కుబడి ఆర్థిక ప్రయోజనాలే తప్ప సామాజిక ప్రయోజనాలు చేకూరవనే స్పృహ ఈ వ్యవస్థతో సంబంధం ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వం, చైతన్యము కలిగినటువంటి ప్రజాస్వామిక వాదులకు ఉండాల్సిన అవసరం ఉన్నది. అనేక రకాల సాంప్రదాయ వ్యక్తీకరణలు , మూస విధానం కారణంగా ఇప్పటికే సమాజం అనేక రకాలుగా నష్టపోతుంటే టీవీ ప్రసారాల ద్వారా మెరుగైనటువంటి వ్యవస్థను ఆవిష్కరించుకునే అవకాశం ఎంతో కొంత ఉన్న పరిస్థితులలో దానిని కూడా పక్కన పెట్టి పెట్టుబడిదారీ వర్గం చేతిలో కొనసాగుతూ ఉంటే ప్రభుత్వం చూస్తూ మౌనంగా ఉంటే ఇక సామాజిక అసమానతలు అంతరాలు వివక్షత తొలగించడానికి ఆస్కారం ఎక్కడిది?.
ప్రసార మాధ్యమాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి టీవీ కార్యక్రమాలు ఎంత బలవంతమైనటువంటి ఆయుధాలుగా నిలబడితే అంత వ్యవస్థకు తోడ్పడుతూ వెన్నుదన్నుగా ఉండే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అసాంఘిక భావజాలాన్ని, సంఘ వ్యతిరేక శక్తులను అడ్డుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ రకమైనటువంటి ప్రయోజనాన్ని ముఖ్యంగా టీవీ ప్రసారాలు సమాజానికి అందించవలసిన అవసరం ఉంది. కానీ అవి కేవలం ప్రైవేటు వ్యక్తుల ఇంటి ఆస్తిగా భావించబడుతూ ప్రభుత్వం యొక్క నియంత్రణ లేని కారణంగా ప్రజల సామాజిక జీవితానికి భిన్నమైనటువంటి భావజాలాన్ని మనుషుల మెదల్ల లో నింపుతూ శ్రమ జీవితానికి దూరంగా నైతిక ఆదర్శ విలువలను తుంగలోతొక్కే కుట్ర కొనసాగుతున్న విషయాన్ని మనం తప్పకుండా గమనించాలి .
టీవీ ప్రసారాలలోని కొన్ని అసంబద్ధ విషయాలు:-
సెల్ఫోన్ వ్యవస్థ ఏ రకంగా ప్రజా జీవితాన్ని డామినేట్ చేస్తున్నదో అంతకు మించిన స్థాయిలో ఈనాడు ప్రజాసమూ హం టీవీ ప్రసారాలకు ఆకర్షితులై మంచి చెడు విచక్షణను ఆలోచించకుండా మొక్కుబడిగా నిరంతరము అతుక్కుపోయిన సందర్భాలను మనం గమనిస్తే దానివల్ల వనగూరుతున్నటువంటి నష్టాలు కూడా తక్కువేమీ కావు . ప్రస్తావించడానికి ఇబ్బంది ఉన్నా అనివార్యమైన పరిస్థితులలో సామాజిక మార్పును ప్రయోజనాన్ని కోరి ఆ సందర్భాలు విషయాలను ఎత్తి చూపక తప్పడం లేదు. ఇటీవలి కాలంలో సీరియల్లో బాగా గమనిస్తున్నటువంటి అంశం ఒకే సన్నివేశానికి సంబంధించిన కథను దీర్ఘకాలం చూపించే జడత్వ పద్ధతి కొనసాగుతూ ఉంటే పెళ్లయిన భార్యాభర్తల మధ్యన శోభనానికి సంబంధించి కుటుంబ సభ్యులందరూ చర్చించుకోవడం, సంవత్సరం తరబడిగా భార్యాభర్తలను శోభనానికి దూరంగా ఉంచిన విషయాన్ని పదేపదే ప్రస్తావించడం, ముహూర్తం లేదు కనుక వారిని దూరంగా ఒంటరిగా జీవించే లాగా ఒత్తిడి చేయడం , విపరీతమైన జాడ్యంతో అసంబద్ధమైన పద్ధతిలో అనాగరికమైన విషయాలను పదే పదే ఎత్తిచూపి పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా అసహ్యించుకునే స్థాయిలో కథను నడిపించడం కొందరిని బాధిస్తున్న విషయం. ఇక చూస్తున్నటువంటి జనం ప్రయోజనం, ప్రభావం వంటి అంశాలని ఎక్కడ ఆలోచించకుండా టైం పాస్ కోసం లేదా మొక్కుబడిగా చూడాలి గనుక అనే పద్ధతిలోనే చూస్తున్నారు కానీ అందులోని తప్పొప్పులను పరిశీలించే ఓపిక సామర్థ్యం చొరవ చూపకపోవడం చాలా విచారకరం. తెలియకుండానే చాప కింద నీరు ప్రవేశించినట్లు మనుషుల మెదల్ల లోకి మనిషిని బలహీనునిగా చేసే బలహీనతలను చొప్పించే ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉన్నది.
స్త్రీ పాత్రల సంఖ్య భారీగా పెంచి ఒకరిపై ఒకరు ఆడిపోసుకోవడం, అసూయ పడడం ,ఆధిపత్యాలు చలాయించడం వంటి సన్నివేశాలను కల్పించి ప్రేమానురాగాలతో జీవించగలిగే సజీవ మానవ సంబంధాలకు గండి కొడుతున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. చెప్పడం వినడం కంటే ప్రత్యక్షంగా చూసే అవకాశం వల్ల వెను వెంటనే ప్రభావం కలిగే అవకాశం ఉన్న "మద్యం తాగకూడదు ప్రమాదకరం అనారోగ్యానికి హేతువు" అని ఒక వైపు ప్రకటన వస్తు ఉంటే మద్యం తాగే సన్నివేశాన్ని చూపించడం అత్యంత విచారకరం ఆందోళనకరం కూడా. సహజంగా సమాజానికి భిన్నమైనటువంటి అసాంఘిక చర్యలు దృశ్యాలను ప్రస్తావించకుండా ఉండాల్సినది పోయి క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు, డాన్సులు, అర్థనగ్న దృశ్యాలు, అసందర్భ ప్రలాపాలు, ద్వంద్వార్థాలతో విలువలను దిగజార్చే ప్రకటనలు సంభాషణలు హావభావాలు నటన సీరియల్ నిండా దర్శనమిస్తున్న విషయం అందరికీ తెలిసినా ఎందుకు స్పందించడం లేదు? ముఖ్యంగా మహిళలు మహిళా సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదు ?ఇప్పటికి అంత చిక్కనీ సమస్య..
స్త్రీని అంగడి బొమ్మగా, ఆట సరుకుగా, మార్కెట్ వస్తువుగా సమాజంలో ఒకవైపు వాడుకుంటూనే సీరియల్ లోను వ్యాపార ప్రకటనల్లోనూ స్త్రీలను అత్యంత హీనంగా చూపించడాన్ని మనం గమనించవచ్చు . ఢీ,శ్రీదేవి డ్రామా కంపెనీ , జబర్దస్త్ వంటి అనేక సీరియల్ ప్రసారాలలో పాల్గొనే వాళ్లతో పాటు న్యాయ నిర్నేతలుగా పనిచేసే మహిళలు ముఖ్యంగా అర్థనగ్న శృంగార ప్రదర్శనతో పా ల్గొనడం ,వ్యాఖ్యానించడం , ఆట మాట నటన, చిరునవ్వు, విశ్లేషించడం చూస్తుంటే సమాజమే సిగ్గుపడుతున్నది తప్ప నిర్వాహకులు గాని ఏనాడైనా ప్రభుత్వం కానీ ఆలోచించిన దాఖలా లేదు అనేది నగ్నసత్యం. "కథలో సామాన్యుల జీవితం లేదు, సమాజం ఎదుర్కొంటున్నటువంటి అసమానతలు అంతరాలు దోపిడీ, పీడన వంచన వివక్షత భూ సమస్యలు మానవ సంబంధాలు విచ్ఛిన్నమవుతున్న దుర్భర పరిస్థితులు ఎక్కడ మనకు కనిపించవు, ఈ సందర్భాలను కథాంశాలుగా ఎంపిక చేస్తే కదా ఆ సమస్యలకు పరిష్కారం దొరికేది! అంటే సమస్యలకు పరిష్కారాలను చూపే బదులు లేని సమస్యలను సృష్టించడం ద్వారా కొత్త ఆసక్తిని కల్పించే ప్రయత్నం చేయడం నేటి టీవీ దుర్లక్ష్యమై కూర్చున్నప్పుడు అవి ఏ వర్గ ప్రయోజనం కోసం పని చేస్తాయో ఆలోచించుకోవాల్సిన అవసరం ముఖ్యంగా సమాజంలోని భిన్న వర్గాలపై ఉన్నది . అదే సందర్భంలో ప్రభుత్వం తన నియంత్రణలో ఆమోదించినటువంటి బహుళ ప్రయోజన మాధ్యమమైన టీవీ ప్రసారాల ద్వారా సమాజానికి ప్రయోజనం కలగనప్పుడు సమీక్ష చేసుకోవాలి కదా! ఆ సోయి లేకుండా ప్రభుత్వాలు ఉంటే ఎలా ?గతంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు ఉద్యమ కాలంలో భాష, భావం, ప్రయోజనం ,సామాజిక చింతన, సామాజిక ప్రయోజనాలు దోపిడీ చేయబడుతున్నాయి ప్రజా జీవితంతో సంబంధం ఉన్నటువంటి ప్రజల భాషలో వచ్చే టీవీ ప్రసారాలు సినిమాలను సాధించుకోవాలని గొప్పగా చెప్పుకున్న అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినప్పటికీ కూడా ఇసుమంతా మార్పు జరగలేదంటే ఇది రాష్ట్రం ఆవిర్భవించడంతో పరిష్కారమజే సమస్య కాదు... ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన సమస్యగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పౌర సమాజం ప్రభుత్వాలు మేధావులు అధికారులు ఉమ్మడిగా కృషి చేసి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సమాజాన్ని ప్రభావితం చేసే బలమైన సాధనమైనటువంటి టీవీ ప్రసారాల రూపకల్పనను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంది. మేలు చేయకపోయినా కీడు చేయకూడదు అని జనంలో ఒక నానుడి ఉన్నది అలాగే ఈ వ్యవస్థకు మేలు చేయకపోయినా మంచిదే కానీ కీడు చేసే ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి టీవీ ప్రసారాలను కచ్చితంగా సమీక్షించవలసిందే !అసంబద్ధం అర్థనగ్న దృశ్యాలు అసాంఘిక అంశాలకు మద్దతిచ్చే సీరియల్లు ప్రసారాలను నిషేధించవలసిందే ! ఆ వైపుగా ఉమ్మడిగా కృషి జరగాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది .
త్రుణీ కరించవలసిన మరికొన్ని.....
ఆత్మీయంగా పలకరించుకున్న సందర్భం కనిపించదు, ద్వేషాలు అసూయలు, కొట్లాటలు ఈర్ష్య , ప్రతి విషయాన్ని సవాల్ గా తీసుకోవడం, ఎలా సాధిస్తారో చూస్తాం, ఎలా శోభనం చేస్తారో చూస్తాం, ఎలా పెళ్లి జరుగుతుందో చూద్దాం , భార్యాభర్తలు కలిసి ఉండకుండా విడదీయడానికి చేసే ప్రయత్నాలు, మెడనిండా కిలోల కొద్ది బంగారం గొలుసులు, ఖరీదైన బంగాళాలు కార్లు, సామాన్య జీవితానికి కనీసం ప్రవేశం కూడా లేనటువంటి కుటుంబ వాతావరణం సర్వసాధారణం. పెట్టుబడిదారీ విధానానికి వంతపాడే టీవీ ప్రసారాలు
సీరియల్ లను పెంచి పోషించడం అనైతిక పద్ధతి అని ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించాలి, వాటిని నిర్మించి నిర్వహించే సంస్థలు గుణపాఠం తెచ్చుకోవాలి, బాధ్యతను గుర్తించాలి. కథ సంభాషణలు రాసే రచయితలు సామాజిక బాధ్యతగా సోయి తెచ్చుకొని మార్పును ఆశించే వైపుగా కృషి చేయాలి. మహిళా నటులు న్యాయ నిర్ణేతలు ఇతర చోట్ల మహిళలు నిర్వహిస్తున్నటువంటి అశ్లీల పాత్రలను సన్నివేశాలను దృశ్యాలను డ్రెస్సింగ్ ను పౌర సమాజంతో పాటు ముఖ్యంగా మహిళా సంఘాలు ఎక్కడికక్కడ నిరసించాలి . విప్లవ సంఘాలు ప్రజా సంఘాలు పోరాడితే తప్పకుండా ఈ విషయంలో మార్పు సాధించవచ్చు. సమాజాన్ని నిట్ట నిలువునా చీ లుస్తూ అనేక రుగ్మతలకు ఆజ్యం పోస్తున్నటువంటి అసంబద్ధ జీవితాలను చూపించే టీవీ ప్రసారాలు తప్పుడు విధానాలను ప్రోత్సహిస్తున్నాయనే చైతన్యం లేకపోవడమే విచారకరం ! ఆ వైపుగా ప్రేక్షకులు దృష్టి సారించి సమాజం కుటుంబ బాగుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నటువంటి టీవీ ప్రసారాల యాజమాన్యాల పై నిరసన తెలుపగలిగే చైతన్యాన్ని నింపుకోవడం తద్వారా మార్పును సాధించడం ద్వారా సమాజం మరింత ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని కోరుకోవడమే మన ఉమ్మడి లక్ష్యం కావాలి . సామాజిక మార్పుకు బలవత్తర సాధనమైన టీవీ ప్రసారాలు ఆ వైపుగా సహకరించాలని మనసారా కోరుకుంటూ ఎక్కడికక్కడ సమీక్షించుకొని తమ తమ పొరపాట్లను సవరించుకొని చైతన్యముతో ముందుకెళ్లడమే మన అందరి ముందున్నటువంటి కర్తవ్యం .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, ఉపాధ్యాయ ఉద్యమనేత (చౌటపల్లి) హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)