ధాన్యం కొనుగోలు విషయంలో ఇంత రాద్ధాంతం ?

May 29, 2026 - 13:57
 0  0

ధాన్యం కొనుగోలు విషయంలో ఇంత రాద్ధాంతం ? టిఆర్ఎస్ పాలనలో అదే ధోరణి  నాడు ప్రతిఘటన తక్కువ నేడు  ప్రతిపక్షాల పోరాటం ఎక్కువ అంతే తేడా!  రైతు కష్టనష్టాల గుర్తించకుండా, ఉచిత విద్య వైద్యాన్నిహామీ ఇవ్వని ఏ ప్రభుత్వమైనా వృధా!!

----వడ్డేపల్లి మల్లేశం 

"ఎద్దు ఏడవని  ఎవుసం,రైతు ఏడవని రాజ్యం  సాధించి తీరాలి అదే నిజమైన పరిపాలన" అని  పెద్దలతో పాటు అప్పుడప్పుడు రాజకీయ నాయకులు కూడా  కబుర్లు చెబుతూ ఉంటారు. కానీ ఆచరణలో మాత్రం  అధికార పక్షం ప్రతిపక్షంలోకి వెళ్లిన ప్రతిపక్షం  అధికారంలో కొనసాగిన అదే తంతు, అవే పద్ధతులు, అవే కన్నీరు,  పండించిన పంట నేలపాలు  కావడంలో మాత్రం తేడా ఇసుమంత కూడా లేదు.  ఒక పార్టీ నాయకులు గగ్గోలు పెడితే మరో పార్టీ వాళ్లు కొంత మౌనంగా ఉండవచ్చు  నిజంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత  క్రమక్రమంగా పంటల దిగుమతి బాగా పెరిగిన క్రమంలో  పంటలను కొనుగోలు చేసే సందర్భంలో ఏర్పడిన ఇదే పరిస్థితులు ఆనాడు కూడా తారసపడ్డాయి. కానీ ఆనాడు ప్రతిపక్షంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్  అప్పుడప్పుడే ఎదిగినటువంటి బిజెపి పెద్దగా  కత్తి కట్టలేదు కనుక టిఆర్ఎస్ బతికిపోయింది. కానీ ఆనాడు కూడా ఇదే తంతు  ఇటీవల రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం  కొనసాగుతున్న కాలంలో  అకాల వర్షాల ప్రభావం ఒకవైపు  అరకొర సౌకర్యాలు,  గిడ్డంగులు, గన్ని బ్యాగులు,  కవర్లు, లారీలు,  చివరికి పనివాళ్ళు కూడా అందుబాటులో లేకపోవడం వలన  ఎండలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవుతూ అకాల వర్షాలకు కళ్ళముందే కదలాడుతూ  కడలిని చేరుతూ ఉంటే ఆ రైతుల  దుఃఖం వర్ణనాతీతం.  ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో  దాదాపుగా సగభాగాన్ని ఆక్రమించే వ్యవసాయ రంగం పైన  ఆధారపడి  లక్షలాది కుటుంబాలు జీవిస్తూ ఉంటాయి  ఈ అన్నింటికీ రైతు  భద్రంగా భరోసాగా పంటను పండించి ఇంటికి చేర్చుకున్నప్పుడే కదా  చేతిలోకి డబ్బు వచ్చేది. ఇటీవల కాలంలో పంట దిగుబడి మరీ ఎక్కువ కావడం వల్ల కూడా  ఏర్పాట్లు లేకపోవడంతో ఎవరికి తోచిన దగ్గర వాళ్లు ఆరబోసుకొని  కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చినప్పటికీ కొంత కాలయాపన, కొంత ప్రభుత్వ నత్తనడక,  కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం,  చెల్లింపుల అవకతవకలు,  వీటికి తోడు అకాల వర్షాలు  ముప్పేట దాడి చేస్తుంటే  సన్నకారు, చిన్న కారు రైతులతో పాటు  పెద్ద రైతులు కూడా ఈ  ప్రమాదం బారిన పడక తప్పడం లేదు.  ప్రధానంగా పంటల ఉత్పత్తి గణనీయంగా   ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉత్తర ప్రదేశ్  పంజాబ్ లాంటి  రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఇటీవల కాలంలో తెలంగాణలో మరీ భారీగా ఉత్పత్తి రావడానికి గమనించవచ్చు. పండుతున్న పంటకు సరిపోయే స్థాయిలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత  ప్రభుత్వాలది ఆనాడు టీఆర్ఎస్ కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ ఏర్పాట్లను చేయకుండా విమర్శలను ఖాతరు చేయకుండా  విమర్శకు ప్రతి విమర్శ చేస్తూ  కొనుగోలు చేస్తున్నామని సగం వరకు అయిపోయినాయని చెల్లింపులు చేస్తున్నామని నమ్మబ లకే ప్రయత్నమే కానీ రైతుల కన్నీటి వరద మాత్రం ఆగడం లేదు.  ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మాసాలలో దిగుబడి  అవుతున్నటువంటి వరి పంట  మొక్కజొన్న ఇతర అన్ని రకాల ధాన్యాలు పెద్ద మొత్తంలో మార్కెట్లోకి రావడం  దేశ ఆహార అవసరాలను తీర్చే విషయంలో రైతును అభినందించవలసిందే కానీ  ఆ స్థాయిలో రైతుకు సమాజం గానీ ప్రభుత్వాలు కానీ భరోసా ఇస్తున్నాయా  కన్నీళ్లను తప్ప. 

బాధ్యత మరిచిన ప్రభుత్వాలు:

అత్యంత కీలకమైన పంటల ఉత్పత్తి  భద్రతా భరోసా నిలువ పంపిణి వంటి అంశాల పైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు  పెద్ద మొత్తంలో దృష్టి సారించాలి. ఉమ్మడిగా ఈ బాధ్యతను శక్తికి మించి  నిర్వహించవలసిన అవసరం ఉంటుంది. ఏ రాష్ట్రంలోనైనా అవకతవకలు జరిగినా అమ్మకాలు   కొనుగోలు లోపం జరిగిన కచ్చితంగా ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. అందుకు తగిన ఏర్పాట్లను చేసుకోవడం  పంట కాలాని కంటే రెండు నెలల ముందే అన్ని ఏర్పాటు చేసుకోవడం అవసరమే కదా! ఆ మాత్రం  స్పృహ,  అవగాహన లేకుండా  ప్రతిపక్షాలు  దుమ్మెత్తి పోస్తూ ఉంటే  ఖాతరు చేయకుండా ప్రభుత్వాలు  నటిస్తూ ఉంటే  మధ్యన రైతులు  ఆందోళనకు గురికావాల్సిందేనా? డ్రైనేజీలలో, మురికి కాలువల్లో,  పంట కాలువలు,  వీధుల్లో నిరంతరం  అంతటా వడ్లు ఇతర ధాన్యాలు కొట్టుకొని పోతూ ఉంటే  ఇది ఏమైనా ప్రభుత్వమే నా? లేక  పిల్లగాళ్ళ ఆటలా?అర్థం కాని పరిస్థితి  రైతుల కన్నీరుని కూడా గుర్తించనటువంటి పాలకులు కర్కోటకులే కదా!  అదే సందర్భంలో విమర్శిస్తూ  ప్రజలు రైతుల పక్షాన నటించినట్లు మభ్యపెట్టి ప్రతిపక్షాలు కూడా  ఊక దంపుడు  ప్రసంగాలు ప్రెస్మీట్లో మాని ప్రభుత్వానికి  సలహాలు ఇవ్వాలి రైతులకు వెన్ను ధన్నుగా నిలబడాలి. తమ సామాజిక బాధ్యతను నిర్వహించాలి  కానీ ప్రతిపక్షాలది అలాంటి బాధ్యత ఎక్కడా కనిపించదు.  టిఆర్ఎస్ హయాంలో కూడా రైతు కల్లాల దగ్గర పడుకున్నటువంటి రైతులు  ఎంతోమంది కల్లాల మీదనే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆనాడు ఈనాడు ఏనాడైనా రైతుల పరిస్థితి అదే జరుగుతున్నది. ఆనాడు తమ పాలనలో కూడా జరిగినటువంటి  మారణకాండను ఆ ప్రభుత్వం అంగీకరించలే ఈ ప్రభుత్వం కూడా అంగీకరించడం లేదు .ఈ అత్యవసరమైన రైతు ధాన్యం సేకరణ విషయాన్ని పక్కనపెట్టి  ముఖ్యమంత్రి ఇతర మంత్రులు ప్రభుత్వ అధికారులు  ఊహకు అందని అత్యంత దూరంగా ఉన్న అంశాల పట్ల  ప్రజల  మనసులను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ కాలయాపన చేయడం అవసరమా?  ప్రాధాన్యత ఉన్న ముఖ్యమైన అంశాలను కాలాలవారీగా స్వీకరించి  ఆ సమస్యలు పరిష్కారమైన తర్వాతనే మిగతా సమస్యలను పట్టించుకోవడం ద్వారా ఇలాంటి ఊకదంపుడు విమర్శలకు  ప్రభుత్వాలు గురికాకుండా చూడవచ్చు. మరొకవైపు రైతులను కూడా కాపాడిన పేరు కూడా ఉంటుంది

ఈ విపత్తు సమాజం బాధ్యత
 
సరే ఏది ఏమైనా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం పత్రిక ముఖంగా  ఎత్తిచూపడం చాలా అవసరం. ఆ పాత్ర పోషిస్తున్నటువంటి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాలు టిఆర్ఎస్ లాంటి ఇతర రాజకీయ పార్టీలు  ప్రభుత్వంతో అమీతుమీ తేల్చు కోవడానికి సిద్ధపడడాన్ని స్వాగతించవలసిందే. కానీ అది మొక్కుబడి విమర్శగా కాకుండా  తమ కాలంలో జరిగినటువంటి నేరాన్ని ఘోరాలను  మరణాలను కూడా అంగీకరించి తీరినప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఒక స్పష్టమైన విధానాన్ని  ప్రభుత్వం ప్రతిపక్షం కలిసి నిర్ణయించడానికి ఆస్కారం ఉంటుంది. " ఏపూట తిన్నారో ఎన్ని పస్తులు ఉన్నాడో  కుటుంబ సభ్యులు ఏమైనారు?  ఇల్లు ఎవరికి అప్పగించినారో? తెలియదు కానీ  కల్లాల దగ్గర తల్లి తండ్రి పిల్లలు  నెలల తరబడిగా ఉంటున్నారని వార్తలొస్తున్నాయంటే  ఇది ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నేరమే.  ఈ  చర్యల్లో భాగంగా మృత్యువాత పడినటువంటి రైతులకు ప్రభుత్వం  నష్టపరిహారం కట్టించడం కాదు వాళ్ళ  మృతికి ప్రభుత్వమే కారణమని  అంగీకరించి తీరవలసి ఉంటుంది. " శ్రమను గౌరవించరు,  రైతులకు సహకరించరు, అరకొర సౌకర్యాలతో  ఆగమాగం చేసి  వీధిపాలవుతున్నటువంటి రైతుల జీవితాలకు సార్థకత ఉండాలంటే  కచ్చితంగా ప్రభుత్వాలకు ఒక స్పష్టమైన విధానం అవసరం. ఆ విధానాన్ని  తెలంగాణ ప్రభుత్వం  ముందుగా అఖిలపక్షాలతో సమావేశమై స్పష్టమైన విధానాన్ని  రూపకల్పన చేసి భవిష్యత్తులో  ఒక్క గింజ తడవకుండా ఒక్క వ్యక్తి కూడా నేలరాలకుండా  పండించిన పంట మొత్తానికి భద్రత భరోసా నగదు  చెల్లింపు  సక్రమంగా అయ్యేలా చూడకపోతే  ఇప్పటికే అక్కడ క్క డ రైతులు పోరాటాలను ఉదృతం చేస్తున్నారు.  ఆవేషం, ఆందోళనతో, బాధతో, రోషంతో ఉన్న రైతులు ఏదైనా చేయగలరు. ఎంతకైనా తెగించగలరు.  ఆ  అవగాహన బాధ్యత ప్రభుత్వాలకు ఇప్పటికైనా  రావాల్సిన అవసరం చాలా ఉంది. "  పిడికెడు గింజలు  ఆ రూపానికి రావడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడో ఊహిస్తే కదా అర్థం అయ్యేది  కానీ  కిలోల కొద్దీ   బియ్యం ఇతర ధాన్యం ఆహార పదార్థాలు  హోటలలో ప్రతిరోజు వృధా అవుతూ  డ్రైనేజీ పాలు అవుతున్న విషయాన్ని కూడా గమనించినప్పుడు  రైతు కష్టానికి సరైన విలువ ఇవ్వడం లేదని అర్థమవుతుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనకు ఉండాల్సిన అవసరం ఉంది. పని ఔన్నత్యాన్ని గుర్తించగలిగే సమాజం ఆవిష్కరించగలిగినప్పుడు మాత్రమే  రైతుల సకల కష్టాలు పరిష్కారం అవుతాయి.  ముందుగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ పాలకులకు ఉండాలి.

మూసి ప్రక్షాళన,  ఇతర ఆదర్శ సిటీల పేరుతో వేలాది ఎకరాలను  నమ్మబలికే ప్రయత్నం చేసి  ఆడంబరాలలో ఊరేగడం కాదు  కనీసం ఇల్లు లేని లక్షలాదిమంది  శ్రమజీవులకు ముఖ్యంగా హైదరాబాదులో అర గుంట అయినా కేటాయించి  సొంత ఇల్లు నిర్మించగలిగే సంస్కారానికి ప్రభుత్వం ఏనాడైతే పాల్పడుతుందో  ఆ  ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి వందలాది హామీల అవసరమే లేదు.  విద్య వైద్యాన్ని చాలెంజ్గా  ప్రకటన చేసి ప్రజల రుణాన్ని తీర్చుకున్నదే నిజమైన ప్రభుత్వమౌతుంది.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333