దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలు అరెస్ట్

తిరుమలగిరి మోత్కూర్ 20 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని ముశిపట్ల గ్రామంలో దొంగతనానికి రెక్కీ నిర్వహిస్తున్న నలుగురు అనుమానాస్పద మహిళలను గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రాంతీయులు, పోలీసులు కథనం ప్రకారం, గురువారం మధ్యాహ్నం సమయంలో నలుగురు మహిళలు గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వీరి ప్రవర్తన పట్ల అనుమానం కలిగిన గ్రామస్తులు వారిని నిలిపి ప్రశ్నించారు. మీది ఏ గ్రామం? ఇక్కడ ఎందుకు వచ్చారు? అనే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో, మరింత అనుమానం వ్యక్తమైంది. ఒక దశలో వారు తప్పించుకునే ప్రయత్నం చేయగా, ప్రజలు గుంపుగా వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి విచారించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.విచారణలో నలుగురూ వరంగల్ జిల్లా వాసులుగా ఉండగా, వారు వరంగల్ రెడ్డినగర్, హన్మకొండ, ఖాజీపేట, మడికొండలకు చెందిన తూర్పతి మైసమ్మ, స్వాతి, శారద, సునీతలుగా పోలీసులు గుర్తించారు. వీరిపై ఇప్పటికే మూడు నుండి నాలుగు వరకు దొంగతన కేసులు నమోదై ఉన్నట్లు ప్రొహిబిషనరీ ఎస్‌ఐ నోయల్ రాజు వెల్లడించారు. ఇవాళ వారు ముశిపట్ల గ్రామంలో దొంగతనానికి ముందు రెక్కీ నిర్వహించినట్లు అనుమానిస్తున్నాం. వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు వారిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) కు అప్పగించాం,” అని ఆయన పేర్కొన్నారు. గ్రామస్థుల అప్రమత్తత, సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో చోరీలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు...