దేశాభివృద్ధికి జనాభా గణన దోహదపడుతుంది: అదనపు కలెక్టర్ నర్సింగరావు
జోగులాంబ గద్వాల 10 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జనాభా గణన దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని, ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇండ్ల గణన చేపట్టినట్లు అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. బుధవారం మల్దకల్ మండలం నేతివానిపల్లె గ్రామంలో జరిగిన ప్రత్యేక గ్రామ సభకు అదనపు కలెక్టర్ హాజరై ప్రసంగించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా నాలుగు రకాల వ్యర్థల విభజన గురించి వివరించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల పథకాల గురించి రైతులకు కూలంకషంగా తెలియజేశారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల సహకారం అందిస్తుందన్నారు. వర్షకాలంలో మంచినీటి నిర్వహణ గురించి వివరించి, వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంతో ఉపాధి లేని వారికి పని దినాలు కల్పించి కూలీలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జయశంకర్ బడిబాట కార్యక్రమంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యలతోపాటు ఇతర అంశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపిన సమస్యలను పరిష్కరించడంలో తన శాయశక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామసభ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో ఆంజనేయ రెడ్డి, సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ మునినాయక్, పంచాయతీ కార్యదర్శి నరేష్, వార్డు సభ్యులు, వివిధ శాఖల నుంచి అధికారులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.