జర్నలిజం లోతుపాతులపై సమాజం అవగాహన పెంపొందించుకోవాలి
సామాజిక మార్పుకు పోషిస్తున్న పాత్ర, వారి సామాజిక బాధ్యత పత్రికలు టీవీ ఛానళ్లు సామాజిక మాధ్యమాలు జర్నలిస్టుల నీ బద్ధతకు ఆనవాళ్లు కావాలి .* జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి.
---- వడ్డేపల్లి మల్లేశం
పత్రికొక్కటున్న పదివేల సైన్యంపు పత్రికొక్కటున్న మిత్రకోటి పత్రిక లేకున్న ప్రజకు రక్ష లేదు " అంటూ పత్రికారంగా నిపుణుడు ప్రముఖ జర్నలిస్ట్ నార్ల వెంకటేశ్వరరావు ఇచ్చిన పిలుపు సమాజానికి పత్రికా రంగంతో పాటు సామాజిక మాధ్యమాలకు అటు ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరికగా పనిచేస్తుంది . పత్రికలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నటువంటి సుమారు 50 సంవత్సరాలకు ముందు ఇచ్చిన ఈ పిలుపు నేటికీ కూడా అన్ని రకాల జర్నలిస్టులకు పత్రికలు, మీడియా, టీవీ ప్రసారాలకు వర్తిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. "సమాజంలో అనునిత్యం తారసపడుతున్నటువంటి అంశాల పట్ల కథనాలు, వార్తలు, చిత్రాలు, వీడియో చిత్రీకరణ, ఇతర ఆధారాలు సేకరించి వార్తలుగా వ్యాఖ్యానాలు కథనాలు కథలు విశ్లేషణలుగా మలిచి వార్తాపత్రికలో ప్రచురణకు టీవీ ఛానల్లో ప్రసారానికి యోగ్యంగా తయారు చేసే కలను జర్నలిజం అంటారు." ఈ రంగంలో పనిచేసే వాళ్లను జర్నలిస్టులు అని పత్రికా ప్రతినిధులు అని మనం తరచుగా పిలుస్తూ ఉంటాం . ఈ రంగం ఎంత బాధ్యతాయుతమైనదో ఆ రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా అంతకుమించిన సామాజిక బాధ్యత ఉంటుంది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అనేక పెద్ద పత్రికలతో పాటు ప్రధానంగా చిన్న పత్రికలు ఆన్లైన్ పత్రికలు కూడా పెద్ద మొత్తంలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మరొక్క విషయం చెప్పదలుచుకుంటే పెద్ద పత్రికల్లో సాధ్యం కానీ సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు సన్నివేశాలను వాస్తవ కథనాలుగా చిత్రీకరించి అవసరమైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కూడా నిర్మోహమాటంగా ప్రసారం చేస్తున్న ప్రచురిస్తున్న సందర్భాలను మనం గమనించవచ్చు . పత్రికలు, చానెళ్లు, టీవీ ప్రసారాలు, సామాజిక మాధ్యమాలలో వస్తున్నటువంటి వార్తలు వాటికి సంబంధించిన పూర్వాపరాలను సమాజము నిషితంగా పరిశీలించాలి . ఆ రంగంలో పని చేస్తున్నటువంటి జర్నలిస్టుల కృషిని అభినందించడం, అవసరమైతే సద్విమర్శ చేయడంతో పాటు వాళ్లు కార్యక్షేత్రంలో ఎదుర్కొంటున్న కష్టసుఖాలను కూడా అంచనా వేయవలసి ఉంటుంది. పత్రికల్లో చదివి, ఛానల్లో చూసి విని బాధ్యత తీరింది అనుకుంటే అది సమాజం తన బాధ్యతను విస్మరించినట్లే . జర్నలిజంలో పని చేస్తున్నటువంటి లక్షలాదిమంది జర్నలిస్టులు ఎంతో బాధ్యతాయుతంగా కుటుంబ బంధాలను కూడా అవసరమైతే మరిచి, కొన్ని సందర్భాలలో ధైర్య సాహసాలు చేసి, అనితర సాధ్యమైనటువంటి అంశాలను అన్వేషించి విశ్లేషించి కథనాల రూపంలో అందించవలసి ఉంటుంది. అవసరమైతే చట్టానికి సవాలుగా, న్యాయానికి మద్దతుగా, పెట్టుబడుదారి వర్గానికి ఛాలెంజ్ గా కూడా పనిచేయవలసిన సందర్భం జర్నలిస్టులది. ఈ రంగంలో పని చేసినటువంటి అనేకమంది సంపాదకులు, జర్నలిస్టులు, పత్రిక అధిపతులు మాఫియాలు గుండాలు అరాచక శక్తులు నేరస్తుల చేతిలో బలైన సందర్భాలు కూడా భారతదేశంలో అనేకం. అంతేకాదు ఇప్పటికీ పత్రికా స్వేచ్ఛ విషయానికొస్తే భారతదేశం సుమారు 180 దేశాలకు గాను 145వ స్థానంలో ఉన్నదంటే మనదేశంలో పత్రికా స్వేచ్ఛ ఎంత దయనీయస్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు . ప్రజల పక్షాన పత్రికను ప్రచురించడానికి, పత్రికను సమకూర్చడానికి ,అవినీతి ఆకృత్యాలపై ఉక్కుపాదం మోపి అన్వేషిస్తున్న జర్నలిస్టులను,మద్దతిస్తున్న ప్రజాస్వామిక వాదులు,పౌరసమాజాన్ని పాలకవర్గాలు మాత్రం నేరస్తులుగా చిత్రీకరించడం తగదు.
నిబద్ధతకు ఆనవాళ్లుగా జర్నలిస్టులు- ప్రభుత్వం యొక్క తోడ్పాటు:-
***********
పత్రిక, చానెల్ ప్రసారాలు, సామాజిక మాధ్యమాలు రూపం ఏదైనా సారం ఒక్కటే. సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను ఎత్తి చూపడమే కాకుండా మంచిని విస్తృత పరచడం, చెడును ఖండించడం , ప్రజలు ప్రజాస్వామ్య వాదులు పౌర సమాజంతో పాటు ప్రభుత్వ వర్గాల యొక్క బాధ్యతను గుర్తింప చేయడం వంటి కీలకమైన రంగంలో పని చేసే వాళ్లే జర్నలిస్టులు. అంత ఉత్కృష్టమైనటువంటి జర్నలిజం అప్పుడప్పుడు అనేక ఆటుపోట్లకు ఒడిదొ డుకులకు గురి అవుతున్నప్పటికీ ఆగంతకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాలు నిక్కచ్చిగా వ్యవహరించాలి. పత్రికా కార్యాలయాలను ధ్వంసం చేయడము , జర్నలిస్టుల పైన దాడులకు పాల్పడడం, పత్రికా కార్యాలయాలు మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు బెదిరింపు కాల్స్, పత్రిక సంపాదకులు జర్నలిస్టుల చంపుతామని చేసే హెచ్చరికలు అలాంటి సన్నివేశాలకు భారతదేశంలో కొదవేమీ లేదు. అంటే ఈ దేశంలో మీడియా రంగం స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రజా క్షేత్రంలో కొనసాగడం లేదని అర్థం చేసుకోవాలి . .అవసరమైతే గుట్టలు చెట్లు, పుట్టలు, వాగులు, వంకలు లోయల్లోకి కాలినడకన కూడా ప్రయాణించి అక్కడి సన్నివేశాన్ని జన జీవితానికి పరిచయం చేయడానికి జర్నలిస్టులు చేస్తున్న సాహసాలు, తీసుకుంటున్న శ్రద్ధ , ఆచరిస్తున్న నిబద్ధత అంతా కాదు. పై స్థాయిలో పనిచేసే జర్నలిస్టుల వేతనాలు కొంత హెచ్చుగా ఉండవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాలు మండల స్థాయి లో పనిచేసే వాళ్ల యొక్క వేతనాలు అత్యల్పమే కాదు నామ మాత్రం కూడా. అయినా ఒక సామాజిక బాధ్యతగా గౌరవంగా ప్రజా క్షేత్రంలో పనిచేయడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో కూడా వస్తున్న వారు అనేకo . కొన్ని సందర్భాలలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రైవేట్ రంగంలో జరుగుతున్నటువంటి అరాచకత్వాన్ని శోధించి సాధించి పరిశీలించి ప్రజానీకానికి అందిస్తున్న సందర్భంలో వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనేకం.
జర్నలిజం లో పనిచేస్తున్న కొద్దిమంది పైన కొన్ని విమర్శలు లేకపోలేదు కానీ ఆ విమర్శలను తిప్పి కొట్టే క్రమంలో ఆరోపణలకు ఆస్కారం లేకుండా పని చేయవలసి ఉంటుంది. అదే సందర్భంలో పత్రికలు చానళ్లు ఇతర మీడియా యాజమాన్యాలు కూడా సరిపోయిన స్థాయిలో వేతనాలు ఇవ్వకపోవడం కూడా యిoదుకు ప్రధాన కారణం. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని ప్రజల దృష్టికి తీసుకు పోవడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల కృషిని గుర్తించి ప్రభుత్వం నిర్ణీత స్థాయిలో వేతనాలను అందించడం ద్వారా తన సామాజిక బాధ్యతను గుర్తిస్తే భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ స్థానం లభించే అవకాశం ఉన్నది. ఇటీవల గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో కూడా జర్నలిస్టుల పైన విచ్చలవిడిగా జరిగిన దాడులను గమనించినప్పుడు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం .న్యాయ వ్యవస్థ కూడా ఇలాంటి దుర్మార్గాలను గుర్తించి, జర్నలిజం ప్రాధాన్యతను పరిశీలించి జర్నలిజం పైన జరుగుతున్న దాడులపై కఠిన చర్యలకు ప్రభుత్వాలను ఆదేశించాలి. పౌర సమాజం తమ బాధితను గుర్తించి జర్నలిజానికి జర్నలిస్టులకు మద్దతు ప్రకటించినప్పుడు, ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్న దోపిడీ పీడనను వ్యతిరేకించే క్రమంలో ప్రభుత్వము కూడా జర్నలిస్టులకు సహకరించినట్లయితే అన్ని రంగాలలో సుపరిపాలన సాధ్యమవుతుంది. ఆ వైపుగా జర్నలిస్టులకు కనీస అవసరాలను సమకూర్చడంతో పాటు వారి కుటుంబాలలో మానవాభివృద్ధిని చిగురింప చేసినప్పుడు మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా జర్నలిస్టులు సామాజిక మార్పుకు సమసమాజ నిర్మాణానికి,నీతివంతమైన వ్యవస్థ కోసం పునరంకితులై పనిచేస్తారు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు,అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )