చదువు పట్ల శ్రద్ధ బడి శుభ్రతకు కేటాయించే నిధుల బట్టి తెలుస్తుంది
సుప్రీంకోర్టు మందలించే దాక కూడా మరుగుదొడ్ల సౌకర్యాన్ని
పట్టించుకోని గత పాలకులు .స్కావెంజర్ అనే పేరుతో
అల్ప వేతనాలు సిగ్గుచేటు కాదా ?
శ్రమను గౌరవించి రెగ్యులర్ వేతనాలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత
---- వడ్డేపల్లి మల్లేశం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన పాఠశాలల పరిశుభ్రత అందుకు సంబంధించిన నాలుగవ తరగతి ఉద్యోగుల నియామకము వేతనాలు వివక్షత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా దాదాపుగా రెండు రాష్ట్రాలలో అదే విధంగా అమలు కావడం విచారకరం .శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించే స్వభావం తోటి మనుషులకే కాదు పాలకులకు కూడా లేకపోవడం మూర్ఖత్వం. శ్రమను గౌరవించని , శ్రమకు తగిన వేతనాలను చెల్లించని పైగా బానిసలుగా చూసే స్వభావం మూర్ఖత్వమే కాదు ఆందోళనకరం కూడా. ముఖ్యంగా గ్రామాలలో పట్టణాలలో మునిసిపాలిటీలు గ్రామపంచాయతీలలో పని చేసే కార్మికుల జీవన విధానాన్ని గమనిస్తే వాళ్లు చేసే పనికి వేతనాలకు ఎలాంటి పొంతన లేకపోవడం విచారకరం ఈ విషయాల పట్ల బుద్ధి జీవులు విద్యావంతులు మనసున్న వాళ్లు కూడా కనీసం ఆలోచి0 చకపోవడం వివక్షత, నేరం , సామాజిక బాధ్యతారాహిత్యం కూడా
అలాంటప్పుడు మేము మనుషులం విద్యావంతులం మేధావులం కవులు కళాకారులు రచయితలం అని చెప్పుకోవడం సిగ్గుచేటు . కేవలం తమ వర్గ ప్రయోజనం కోసం మాత్రమే కాదు సమాజంలోని భిన్న వర్గాలు ముఖ్యంగా వివక్షతకు అణచివేతకు గురవుతున్న వారి పట్ల బాధ్యత నిర్వహించవలసిన స్థాయిలో ఉన్న బుద్ధి జీవులు ఆలోచించకపోవడం గమనార్హం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పాఠశాలలకు సంబంధించి పారిశుద్ద్యమును గమనించినప్పుడు సుమారు 1980వ దశ కములో ప్రారంభించిన టువంటి పార్ట్ టైం స్వీపర్ వ్యవస్థ 75 రూపాయలతో ప్రారంభించి ఇటీవల వరకు 5000 రూపాయలు చేరుకోలేదంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొందరైతే ఆ వ్యవస్థనుండి వైదొలగి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థలోకి వెళ్లి కనీసం 20వేల రూపాయలను సంపాదించుకుంటున్నారంటే తమ బ్రతుకు తెరువు ఎంత అగమ్య గోచరము అర్థం చేసుకోవచ్చు. ఇక పార్ట్ టైం స్లీపర్లతోపాటు పాఠశాలలో కళాశాలలో కార్యాలయాల నిర్వాహనకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ల యొక్క నియామకం కూడా గత 20 30 సంవత్సరాలుగా జరగకపోవడం పెద్ద అవరోధం కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పార్ట్ టైమ్స్ యొక్క వేతనాలను పెంచకపోయినా కొత్త ఉద్యోగాలను నియమించలేదు కారుణ్య నియామకాల వంటివి తప్ప ఆఫీస్ సబార్డినేట్ స్థానాలను కూడా భర్తీ చేయని కారణంగా పాఠశాలలు కార్యాలయాల యొక్క పారిశుద్ధ్య పనులు ఇతర అవసరాలు అటుకెక్కిన విషయాన్ని మనం గమనించాలి . ఈ సందర్భంలోనే గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలను శుభ్రం చేసే పని పేరుతో స్కావెంజర్ అనే పాత్ర సృష్టించి ప్రాథమిక పాఠశాలలు యూపీఎస్లకు 1500 ఇతర హైస్కూల్వ్యవస్థలో పనిచేసే వాళ్లకు 2500 పేరుతో నామమాత్రపు వేతనాలు ఇచ్చి పెట్టి చాకిరి చేయించుకున్న చరిత్ర మనందరికీ తెలుసు. ఆ 1500, 2500 కూడా ఇవ్వడానికి మనసొప్పని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వ చివరి దశలో పాఠశాలల పరిశుభ్రత బాధ్యతను గ్రామపంచాయతీల సిబ్బందికి కేటాయించి పూర్తిగా వెట్టిచాకిరి చేయించుకున్నటువంటి సందర్భాలను గమనించినప్పుడు మిగతా ఉద్యోగాల లాగా పారిశుద్ధ్య కార్మికుల యొక్క వేతనము ఉద్యోగాలు కూడా క్రమబద్ధీకరించబడి న్యాయబద్ధమైన ఆలోచన చేయకుండా వేత్తిచాకిరి చేయించుకోవడానికి అలవాటు పడిన తీరు భూస్వామ్య సంస్కృతిని తెలియజేస్తున్నది. ఇక ఇతర ఉద్యోగాలను కూడా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తున్న ప్రభుత్వాలు ఆఫీస్ సబార్డినేట్ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి నియామకం చేయకపోవడంలోని ఔచిత్యం ఏమిటో వాళ్లకే తెలియాలి . కొన్ని చోట్ల పాఠశాలల్లో చదువుకునే విజ్ద్యార్థులు స్వీపర్లుగా మారి బండలు శుభ్రం చేసుకుని పాఠశాలలను
నిర్వహించిన సందర్భం చూస్తే అనేక విమర్శలు వచ్చిన విషయం మనందరికీ తెలుసు. మరికొన్నిచోట్ల ఉపాధ్యాయులే స్వీపర్లుగా పారిశుద్ధ కార్మికులుగా అవతారమెత్తిన సందర్భాలు కూడా లేకపోలేదు. అంతటి బాధ్యత రాహిత్యమైన గత పాలకులకు చెంపపెట్టు నిర్ణయాలు తీసుకోవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాలపైన ఉన్నదని గుర్తించడం అవసరం .
కొంత మెరుగైన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు :-
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం రద్దు చేసినటువంటి స్కావెంజర్ తాత్కాలిక పోస్టులను ఆ పని యొక్క ఆవశ్యకతను గుర్తించినటువంటి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల యొక్క విద్యార్థుల సంఖ్యను బట్టి ఆ పాఠశాలకు నిధులను కేటాయించడంతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు ఆ బాధ్యతను అప్పజెప్పడం కొంతైనా సంతోషకరమైన నిర్ణయం .పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ ,మరుగుదొడ్లు ఆవరణ ,పరిశుభ్రత, మొక్కలకు నీరు పోయడం, ఇతర సౌకర్యాలను సమకూర్చడం ద్వారా విద్యార్థులకు కొంత సహకరించడానికి కనిష్టంగా తక్కువ సంఖ్య గల పాఠశాలకు 3000 రూపాయలు గరిష్టంగా 20000 మంజూరు చేయడానికి ఇటీవల నిర్ణయం తీసుకోవడాన్నీ అభినందించవలసిందే. అదే సందర్భంలో ఉపాధ్యాయులు, సబర్డినేట్ ,ఇతర పోస్ట్లు ఏ రకంగానైతే శాశ్వతమైన అవసరాలని భావించిందో అదే మాదిరిగా పాఠశాలల యొక్క పారిశుద్ధ్య బాధ్యతలు కూడా శాశ్వతం అని ఉద్యోగుల నియామకాన్ని కనీస వేతన చట్టం ప్రకారంగా నియమించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. పాఠశాల నిర్వహణకు సంబంధించి గ్రాంటుకు అదనంగా ఈ గ్రాంట్ ను ఇవ్వనున్నట్లు ఇటీవల జీవో 21 వెలువడి నట్లుగా తెలుస్తున్నది ఆ విషయంపై ఉపాధ్యాయులతో రెండు ఆగస్టున జరిగిన ముఖాముఖి సమావేశంలో సిఎం మాట్లాడిన తీరు విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాలల యొక్క భవిష్యత్తుకు కొంత విశ్వాసాన్ని కలిగించినట్లుగా భావించవచ్చు . పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఇతర పనులకు గాను సిబ్బందిని నియమించాలని 2020 -21 నుంచి విద్యార్థులు ఉపాధ్యాయ తల్లిదండ్రులు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వస్తున్నప్పటికీ గత ప్రభుత్వం తాత్కాలికంగా ఆ అవసరాలను తీర్చడంతోపాటు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయం ఇప్పటికే మనం ప్రస్తావించుకున్నాం . ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించడం ద్వారా 30 మంది విద్యార్థులు ఉంటే నెలవారీగా 3000 రూపాయలు 100 మంది విద్యార్థుల వరకు ఉంటే 6000 రూపాయలు 250 మంది విద్యార్థుల వరకు ఉంటే 8000 రూపాయలు 500 విద్యార్థులు ఉంటే 12 వేల రూపాయలు 750 విద్యార్థులు ఉంటే 15 వేల రూపాయలు 750 కి పైగా ఉన్నటువంటి పాఠశాలలకల్ నిర్వహణకు గాను 20వేల రూపాయలు కేటాయించనున్నట్లు ఈ జీవో ద్వారా తెలుస్తున్నది .ముఖ్యమంత్రి హామీ మేరకు పాఠశాల యొక్క పరిశుభ్రతను కాపాడడానికి తాత్కాలిక పద్ధతిలో వేతన జీవులను నియమించుకునే అవకాశం కల్పించడం , అందుకు ప్రత్యేక నిధులను కేటాయించడం కొంతవరకు అభినందనీయమే. కానీ ఈ తాత్కాలిక పద్ధతినుండీ క్రమంగా కనీస వేతన చట్టం ప్రకారంగా వేతనాలను ఇవ్వడం ద్వారా శాశ్వత ప్రాతిపదిక పైన పరిశుభ్రతకు నియామకాలు నిధులను కేటాయించినప్పుడు మాత్రమే పాఠశాలల పరిశుభ్రతతో పాటు విద్యార్థుల యొక్క పరిరక్షణ అందుకు సంబంధించిన భరోసా ఇతర మౌలిక అవసరాలను తీర్చడంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి చేదోడువాదోడుగా ఉండే అవకాశం ఉంటుంది. సరైన సౌకర్యాలు ఉన్నప్పుడు మాత్రమే సరైన విద్య అందుతుంది అనే కనీస ప్రాథమిక సిద్ధాంతం మేరకు పాలకులు గత ప్రభుత్వాల దుర్నీతిని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో మరింత మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ వేతన విధానాన్ని తీసుకొస్తారని ప్రపంచముతోనే పోటీపడే విధంగా నిర్వహిస్తారని ఆశిద్దాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)