కొత్త ప్రభుత్వం వచ్చేనాటికి  ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు 40 వేల కోట్లు

Nov 1, 2024 - 18:54
Nov 7, 2024 - 20:26
 0  2
కొత్త ప్రభుత్వం వచ్చేనాటికి  ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు 40 వేల కోట్లు

7 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా అందించిన టిఆర్ఎస్ ప్రభుత్వ  ఆర్థిక అరాచకత్వానికి  ఉద్యోగులు గు త్తేదారులు  బలి కావాల్సిందేనా ? ప్రణాళిక బద్ధమైన  కృషి ,ప్రభుత్వ పొదుపు ఈ దశలో కీలకం.
---  వడ్డేపల్లి మల్లేశం

ప్రభుత్వము తనకు వివిధ విభాగాల నుండి వచ్చే ఆదాయం నుండి ముందుగా  ఉద్యోగులు పెన్షనర్ల వేతనాలు,  వివిధ నిర్మాణాలు  పనులకు సంబంధించి  గుత్తేదార్లకు చెల్లించవలసిన  బిల్లులు,  చేసిన అప్పులకు  చెల్లించవలసిన వడ్డీలు ప్రధానంగా మొదటి ప్రాధాన్యతలో  ఉంటాయి.  ఆ తర్వాత కొనసాగుతున్న వివిధ పథకాలకు సంక్షేమ  రంగానికి  చెల్లించడం ఆనవాయితీ . తెలంగాణ రాష్ట్రంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం  పదేళ్ల పాలనా కాలంలో  మిగులు రాష్ట్రంగా అవతరించినప్పటికీ  ప్రాధాన్యత క్రమంలో కాకుండా ప్రభుత్వం ఏకపక్షంగా  తీసుకున్న నిర్ణయాలకు ఖర్చు చేసిన కారణంగా  ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు వివిధ పెండింగ్ బిల్లులతోపాటు గుత్తేదారులకు సర్పంచులకు  చెల్లించవలసిన బిల్లులు  నెలల తరబడిగా పెండింగ్లో ఉండి  గతంలో అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవలసిన దుస్థితి  ఏర్పడిన విషయం అందరికీ తెలుసు . 2023 డిసెంబర్లో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి  7 లక్షల కోట్ల అప్పుతో పాటు  40 వేల కోట్ల  పెండింగ్ బిల్లులు వివిధ సంస్థలు  విభాగాలు ఉద్యోగులకు సంబంధించి  ఉన్నట్లుగా ప్రభుత్వం  ప్రకటించినప్పటికీ   గత సంవత్సర కాలంగా  పెండింగ్ బిల్లులతో పాటు కొన్ని విభాగాలలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా నెలల తరబడి వేతనాలు రాలేదని  ఆవేదన వ్యక్తం చేయడం శోచనీయం.  పోలీసు శాఖలో  సరెండర్ లీవ్ ఇతర  బిల్లులకు సంబంధించినటువంటి  ఏడాదిన్నర కాలంగా  మంజూరు కావడం లేదని ఎవరికి చెప్పాలో అర్థం  కావడం లేదని  కొంతమంది పోలీసులు  ఆవేదన వ్యక్తం చేయడం కూడా  ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి.  అలాగే  పంచాయతీ  కార్యదర్శులుగా పనిచేస్తున్న కొందరికి ఆరు మాసాలుగా  వేతనం రాలేదని , సప్లమెంటరీ బిల్లు పెట్టుకుంటే ఇంతవరకు మంజూరు కాలేదని  ముఖంగా తెలియజేయడం కూడా  ప్రభుత్వానికి తగదు.
    అన్ని ప్రభుత్వ శాఖల నుండి ఆర్థిక శాఖకు వస్తున్న బిల్లులకు  విడుదల చేయడంలో జాప్యం జరుగుతున్నదని  సరెండర్ లీవ్, వైద్య ఖర్చులు , జిపిఎఫ్  రుణాలతోపాటు,  గ్రామపంచాయతీలు వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసినటువంటి  కాంట్రాక్టర్లకు  కొన్ని శాఖల ఉద్యోగులకు కూడా రెగ్యులర్ వేతనాలు కూడా  ఇందులో ఉన్నట్లు తెలుస్తున్నది.  ప్రతి  ప్రభుత్వ చెల్లింపుకు కూడా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి ఉండాలని నిబంధన కారణంగా ప్రస్తుతం లక్షల సంఖ్యలో  బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంటే  వాటి పరిష్కారం కోసం కార్యాలయాలకు వస్తున్న ఉద్యోగులు సర్పంచులు కాంట్రాక్టర్లు  తదితరులకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది . మిగులు రాష్ట్ర మైనటువంటి తెలంగాణలో  వేతనాలకు, రెగ్యులర్గా చెల్లించవలసిన పెండింగ్ బిల్లులకు ఇంత రాద్దాంతం  అవసరమా ?ఈ దుస్థితికి కారణం ఎవరు?  ప్రభుత్వం  వివరణ ఇవ్వవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.  ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే  40 వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయని అందులో పది లక్షల లోపు ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేస్తామని ఆరోజు  ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ  ప్రస్తుతము లక్ష రెండు లక్షలకు సంబంధించిన బిల్లులు కూడా మంజూరు కావడం లేదని  ఉద్యోగులు కాంట్రాక్టర్లు వాపోతున్నట్టు తెలుస్తున్నది.  గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలను అప్పుచేసి  అనేక సంస్థలకు విభాగాలకు చెల్లించవలసిన బిల్లులను పెండింగ్లో ఉంచి  ముఖ్యంగా విద్యుత్ శాఖకు వేల కోట్ల రూపాయలు బకాయిపడి  24 గంటల ఉచిత కరెంటును ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడానికి పరిమితమైన సందర్భంలో  ఇంత లోటు బడ్జెట్ను  కొత్త ప్రభుత్వానికి ఇవ్వడం  ఏ రకంగా సమంజసం?. ప్రస్తుత ప్రభుత్వాన్ని పత్రిక ప్రతినిధులు వివరణ కోరినప్పుడు  వస్తున్న ఆదాయానికి ఖర్చుకు పొంతన లేకపోవడం , ఆశించిన ఆదాయం ఆ స్థాయిలో రాకపోవడం వల్ల  సకాలంలో చెల్లించలేకపోతున్నట్లు  ప్రభుత్వ వర్గాలు తెలియచేస్తున్నాయి.  ప్రభుత్వ వివరణ ప్రకారం గా 2023- 24 సంవత్సరానికి  1.52 లక్షల కోట్లు  పన్నుల ద్వారా ఆదాయం వస్తుందని ఆశించినప్పటికీ  17వేల కోట్ల రూపాయలు తక్కువగా వచ్చినట్లు తెలుస్తుంది.  కేంద్రం నుండి వచ్చే ఆర్థిక సాయం వివిధ గ్రాంట్ల కింద  41,259 కోట్లు వస్తాయని అంచనా వేస్తే  కేవలం 9,729 కోట్లు మాత్రమే వచ్చాయని  కాగ్ తన ఆడిట్లో తెలియచేసింది.  ఈ పరిస్థితులలో  సకాలంలో చెల్లించలేకపోతున్నట్లు  పరిస్థితి కుదుటపడగానే త్వర త్వరగా  చెల్లిస్తామని ఆర్థిక శాఖ వర్గాలు  తెలియజేసినట్లుగా పత్రికల ద్వారా తెలుస్తున్నది.  ఇదే విషయంపైన ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  బట్టి విక్రమార్క గారిని  ఈనాడు సంప్రదించగా  ఎప్పటికప్పుడు చిన్న మొత్తాలను విడుదల చేస్తున్నట్లు పెద్ద మొత్తాలను  వీలు ప్రకారం విడుదల చేస్తామని తెలియజేసినట్లు  తెలుస్తున్నది
        . రెగ్యులర్ వేతనాలను కూడా చెల్లించలేని గడ్డు పరిస్థితులు మాత్రం దారుణం  ఈ విషయంలో ప్రభుత్వం  ప్రణాళిక అబద్ధమైనటువంటి కృషి ద్వారా  దుబారా ను తగ్గించి ప్రభుత్వ ఖర్చులను కూడా  అదుపు చేయడం ద్వారా రెగ్యులర్ వేతనాలను చెల్లించడం  వాంఛనేయం . అదే సందర్భంలో  గత ప్రభుత్వ కాలంలో  అక్రమంగా  చెల్లించినట్లు తేలిన 28 వేల కోట్ల రూపాయల రైతుబంధు పేరున  అప్పనంగా భూస్వాములకు ముట్టిన డబ్బును  చట్ట పరిధిలోపల  వసూలు చేసి ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం ద్వారా ఇలాంటి  అత్యవసర పరిస్థితుల్లో  ప్రభుత్వం చెల్లించడానికి అవకాశం ఉంటుంది.  అంతేకాదు గత ప్రభుత్వం పైన వచ్చిన అవినీతి ఆరోపణలను కూడా తొందరగా దర్యాప్తు జరిపించి  దోషులను తేల్చి  వారి నుండి   అక్రమ సొమ్మును రాబట్టి  ప్రభుత్వ అవసరాలను థీ ర్చుకోవాలి. ఎందుకంటే అదంతా కూడా ప్రజాధనమే కదా!  ప్రజల మీద రకరకాల పన్నులను అదనంగా విధించకుండా  పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు  సంపన్న వర్గాల నుండి రావలసినటువంటి  వివిధ  రకాల  పెండింగ్ పన్ను లను  నిర్బంధంగా వసూలు చేయడం ద్వారా ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవాలి.  ఆదాయంలో  లోటు ఏర్పడినా,  ఆశించిన స్థాయిలో పనులు వసూలు కాకపోయినా ఖర్చులు మాత్రం ఆగవు కదా! అంతెందుకు రెగ్యులర్గా చెల్లించవలసిన వేతనాలు పెన్షన్లు  ఆపడానికి ఆస్కారం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయడం, ,నిధులు సమీకరించుకోవడం మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వం పెండింగ్ బిల్లుల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యకు  పరిష్కారాన్ని చూపుతుంది.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )  ఓ

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333