కేవలం వర్ణన మొక్కుబడి అంశాలతో కూడుకున్న రచన సాహిత్యం కాదు
ఎందుకంటే సమాజానికి హితం చేకూర్చాలి కదా ? ప్రలోభాలు, పరిచయాల తో గుర్తింపు రచన ప్రమాణాలకు కొలమానం కాదు.
సామాజిక దృక్పథం, విలువల ఉద్ధరణే పునాది.
---వడ్డేపల్లి మల్లేశం
రచన రంగంలో ఉమ్మడి తత్వం స్పష్టంగా కనబడుతుంది. పరస్పరం రచనలను సమర్థించుకోవడం ప్రశంసించుకోవడం ప్రకటనలకు పరిమితం చేసుకోవడంతో పాటు తమ స్థాయిని ఒకేసారి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ రచన యొక్క సామాజిక చింతన స్ఫూర్తిని ఏమాత్రం గుర్తించకుండానే సమాజంలో భావ ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంస్థల ఏర్పాటు సన్మానాలు పురస్కారాలు జ్ఞాపకాల ప్రధానం సభలు సమావేశాలలో పాల్గొనడంతో కొంత అనుభవం గడించినప్పటికీ రచయితగా తన బాధ్యతను నిర్వర్తించడానికి సంబంధించిన యోగ్యతను సంపాదించుకోవడం ఒకటి రెండు రోజుల్లోనో, కొద్దికాలంలోనో మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. నిరంతరం పరిశీలన, పరిశోధన,సభలు సమావేశాలకు హాజరు కావడం,మేధావులు వక్తల ప్రసంగాలను సాహిత్యాన్ని కవిత్వాన్ని వర్ణనను వినడం, పత్రికలు సాహిత్య పుస్తకాలను అధ్యయనం చేయడం, తమ అనుభవాలు జ్ఞాపకాల అవగాహనను ఇతరులతో చర్చించడంతో సామాజిక అవగాహనను పెంచుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే.....
సమాజంలోని అసహయులు ఎదుర్కొంటున్న సమస్యలు, సమాజ మనుగడకు ఆధారభూతమైన అంశాలు, సామాజిక ద్రోహానికి తలపడుతున్నది ఎవరు? ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను పాలకులు కోరుకుంటున్నారా? ప్రభుత్వం ఎవరి పక్షం వహిస్తున్నది? అనే విషయాలు స్పష్టంగా అవగాహన అవుతాయి. శ్రమను ఏరకంగా వినియోగిస్తున్నాము? శ్రమను దోపిడీ చేసే వర్గాలు ఏమిటి? దోపిడీ చేసే వర్గాలను ఎదుర్కోవడానికి జరుగుతున్నటువంటి కృషి ఏ స్థాయిలో ఉన్నది? అలాంటి ప్రతిఘటనకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్లకు సమాజపరంగా మనం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? అసమానతలు అంతరాలు లేని వ్యవస్థను నిర్మాణం చేసుకోవడానికి ఆటంకాలు ఏమున్నాయి? రాజ్యాంగం ఏం భరోసా ఇచ్చింది? సంపద కేంద్రీకృతం కావడం వలన సమానత్వం సాధ్యమవుతుందా? ఈ దేశంలో వ్యక్తిగత ఆస్తి కలిగి ఉండవచ్చా ?ఉంటే ఎంతైనా కలిగి ఉండవచ్చా?లేక పరిమితులు ఉన్నాయా? భూమి సమానంగా పంచబడినదా? లేకుంటే ఎందుకు పంచబడడం లేదు?
వందలు వేల ఎకరాలు ఉన్నటువంటి వారు స్వయంగా సంపాదించినదా? లేదా ఆక్రమించినదా ? స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఎందుకు కనుమరుగవుతున్నాయి? ప్రభుత్వాల యొక్క అణచివేత ధోరణికి మూలకారణమేమిటి? ఈ దేశంలో పేదరిక నిర్మూలన ఉద్యోగాల కల్పన భూమి పంపిణీ సమానత్వ సాధనకు ప్రభుత్వాలు ఏమైనా గడువు విధించినాయా? మొక్కుబడిగా అమలు చేస్తున్నటువంటి పంచవర్ష ప్రణాళికల వల్ల ప్రయోజనం ఏమిటి? కేటాయిస్తున్నటువంటి కోట్లాది రూపాయల్లో సామాన్యులకు దక్కిందిఎంత శాతం? వంటి అనేక అంశాలలో రచయితకు అవగాహన ఉండాల్సిన అవసరం చాలా ఉంది .గతంలో రచయితలు ఏదో ఒక అంశాన్ని తీసుకొని వర్ణిస్తూ జీవితానికి సంబంధించినటువంటి పార్శ్వాన్ని ఆసరాగా కథలు కవితలు నవలలు అలిన సందర్భాలు అనేకం. కానీ మారుతున్న కాలగమనంలో జీవితంలోని కొన్ని పార్శ్వాలు మాత్రమే సాహిత్యం కాదు మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారాన్ని సూచించగలిగి అవసరమైతే ఆ సమస్యల పరిష్కారానికి ప్రజలను ఉద్యుక్తులను చేయగలిగే సత్తా ఉన్నటువంటిదే నిజమైన సాహిత్యం అని నేడు నిర్వచించు కోవాల్సిన అవసరం చాలా ఉన్నది.
సాహిత్యాన్ని వర్ణనకు పరిమితం చేస్తే జీరో
"మానవాళికి మేలు చేసే క్రమంలో చైతన్యపరిచి, ప్రతిఘటన నేర్పి, ప్రశ్నించడం ద్వారా తమ హక్కులను సాధించుకొని సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఉపయోగపడే నిర్మాణాత్మకమైనటువంటి ఆశలు ఆకాంక్షలు సాధన పోరాట ప్రతిఘటన రూపాల సమాహారమే సాహిత్యం అవుతుంది." మాటవరసకు ప్రజల మేలుకోరి తన సుఖం తను చూసుకునేవాడు రచయిత కాదు వాళ్ళు రాసింది సాహిత్యం అంతకు కాదు. ప్రజల సమస్యల పరిష్కారములో భాగంగా రచయిత తాను లీనమై తన అనుభవాలు జ్ఞాపకాలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించడం ద్వారా కారణాలు కార్యాలను విశ్లేషించుకొని ఆచరణ పూర్వకమైనటువంటి సిద్ధాంత ప్రతిపాదనతో చైతన్యపరిచే విధంగా నేడు రచయితలు తమ బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ "చాలా చోట్ల సాహిత్యాన్ని పరిశీలించినప్పుడు కఠిన పదాలు, లయ బద్ధమైన వాక్యాలు, ఇంపుసొంపు అయినటువంటి వర్ణన మాత్రమే సాహిత్యానికి ప్రామాణికం కాదు.
సామాజిక బాధ్యతను గుర్తింప చేయడం ద్వారా విలువలను ప్రతిక్షేపించే విధంగా సాహిత్యం ఉండాలి అందుకు ప్రతి రచయిత ముందుగా తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ ఆదర్శ భావాలు కలిగి ఆచరణలో ఆశయంలో ముందు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది." కానీ ముఠా తత్వంతో పరస్పరం ప్రేమించుకుంటే అయ్యే పని కాదు .ఇక సామాజిక సాహిత్య సాంస్కృతిక రంగాలలో అనుభవం లేనటువంటి వాళ్ళు ప్రవే శం అసలే లేని వాళ్ళు ఏమాత్రం అర్హత లేని వాళ్ళు సాహిత్య సాంస్కృతిక రంగాలలో పురస్కారాలు ఇస్తున్నారు అంటే ఆ పురస్కారాలను మేధావులు సాహిత్య రంగాల్లో కొంత నిష్ణాతులైన వాళ్ళు సమర్థించి ప్రోత్సహిస్తున్నారు. అంటే మనం పురస్కారాలవైపా? ప్రజల వైపా? ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. అర్హతలు ఉన్నప్పుడు పురస్కారాలను స్వీకరిస్తే తప్పు ఏమీ లేదు కానీ అవకాశాల కోసం కులం మతం పేరుతో మొక్కుబడిగా పంపిణీ చేసే పురస్కారాలు లేదా జ్ఞాపికలు రచనల్లో విషయం లేకుండా సామాజిక అవగాహన కానరాకుండా చైతన్యం లేకుండా లక్ష్యం దిశా చూపకుండా ఉన్నప్పుడు ఎంత పెద్ద వర్ణన ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి?
సామాజిక బాధ్యత గుర్తించాలి.
నువ్వు ఏం చేయాలో ఎలా చేయాలో ఎందుకు చేయాలో ఆదేశిస్తూ హెచ్చరిక చేస్తూ బాధ్యతను గుర్తింప చేస్తూ నీ చుట్టూ అల్లుకొనున్నటువంటి సమాజం యొక్క ప్రస్తుత రూపాన్ని నీ కళ్ళ ముందు ఉంచాలి రచయిత. అప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తులు రచయితలుగా కొనసాగితే ఆ క్రమాన్ని స్వీకరిస్తారు బాధ్యత మరిచిన సోమరులు ప్రగతి వ్యతిరేకులు అక్కడి నుండి పారిపోతారు. ఇవాళ సాహిత్య రంగంలో పనిచేస్తున్న వాళ్లు చాలామంది అనేక సంస్థలలో ఉన్నారు సంస్థలు వేరైనా ఆలోచన ఒకటే రూపంలో ఉన్నప్పుడు మనం అనుకున్న లక్ష్యం వైపు సమాజాన్ని కొంతవరకైనా లాక్కు వెళ్లలేమా? కానీ ఏ మాత్రం అలాంటి మార్పు జరగడం లేదు అంటే సాహిత్య రంగంలోనో, రచనల్లోనో, లక్ష్యాలలోనో లేదా మానవీయ కోణంలోనో ఏదో లోపం ఉండి ఉంటుంది. ఆ లోపాన్ని రచయితలుగా మనం గుర్తించి మన బాధ్యతలను సంస్కరించుకొని ఉన్నత సమాజ ఆవిష్కరణ వైపు పరిగెత్తవలసిన అవసరం చాలా ఉన్నది. .""సమాజానికి ప్రతిరూపమైనటువంటి కుటుంబ వ్యవస్థలో లోటుపాట్లు, ఘర్షణలు, వైఫల్యాలు, విద్వేషపూరిత వాతావరణం, స్త్రీ పురుష వైరుధ్యాలు, ఒంటెద్దు పోకడ, హత్యలు అత్యాచారాలు హింస, అక్రమ వ్యవహారాలకు సంబంధించిన అంశాల లోపల కూడా సాహిత్యం దూసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది.
తద్వారా స్త్రీ పురుషుల యొక్క బాధ్యతలను హక్కులను గుర్తింప చేయడంతో పాటు ముఖ్యంగా మహిళ లోకం ఇంటా, బయట నిర్వహిస్తున్న పాత్రను కొనియాడుతూనే మహిళల వల్ల కుటుంబాలలో వస్తున్నటువంటి విద్వేషాలు, పగుళ్లు, అసూయ ద్వేషాలు, వివక్షత వంటి అంశాలకు కారణభూతమైన సినిమాలు టీవీ ప్రసారాలలోని చెడును అంతం చేయడానికి కూడా రచయితలు పూను కోవాల్సిన అవసరం ఉంది.అంటే "వర్ణనతోని ముడి పెడితే సాహిత్యం నిలబడదు. విషయాన్ని విశ్లేషణ చేసి వివరించి కార్య కారణ సంబంధాలను విస్తృత పరచడం ద్వారా సమాజంలోని భిన్న వర్గాల యొక్క ఆలోచన సరళిని వేగవంతం చేయగలిగితే తమ తమ లోతుల్ని సవరించుకోడానికి కొంతవరకైనా అవకాశం ఉంటుంది.తద్వారా సమాజంలో వైరుధ్యాలు తగ్గి సాహిత్యం తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినట్లుగా భావించగలిగితే సాహిత్యానికి మన రచనలకు అర్థం ఉన్నట్లు. లేకుంటే చుక్కాని లేని నావలాగా లక్ష్యం లేని గమ్యం లాగా సాహిత్యం తన కర్తవ్యాన్ని విస్మరించినట్లవుతుంది. అందుకే సామాజిక బాధ్యత రచయితలకు చాలా కీలకం."
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )