కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం కై అభ్యుదయ, మానవతా, ప్రజాస్వామి కవాదులు కృషి చేయాలి
గత పదేళ్లుగా విధ్వంసమైన సంస్కృతి,
ఆర్థిక సంక్షోభ, అంతరాలు, అసమాన తలను సవాలుగా స్వీకరించాలి.
బుద్ధి జీవులుగా బాధ్యత విస్మరిస్తే ప్రజల ముందు తలవంచవలసి వస్తుంది జాగ్రత్త.
---వడ్డేపల్లి మల్లేశం
అనేక అంతరాలతో కూడుకున్న భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఆసమాన తల వైపుగా కొనసాగుతూ ఉంటే పాలకులు గత 77 సంవత్సరాలుగా ప్రజల జీవితాలను మార్చడానికి ఏమాత్రం కృషి చేయని కారణంగా ఆదేశిక సూత్రాలు అడ్డు వచ్చినా సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడాన్నీ ఆపలేకపోయింది భారత రాజ్యాంగం. అందుకు గత 77 సంవత్సరాలుగా పాలించిన పాలకులే బాధ్యత వహించాలి ఇప్పటికీ 10 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు లేకపోగా పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులు, ఆత్మహత్యలు, అసమానతలు, అంతరాలు, సంపద కేంద్రీకరణ మునుపెన్నడూ లేని స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంటే మూడోసారి ముచ్చటగా అధికారానికి రావాలని ఆశ పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి చెక్ పెట్టే విధంగా కృషి చేయవలసిన పౌర సమాజం ప్రజాస్వామిక వాదులు మేధావులు బుద్ధి జీవులు పౌర సంఘాలు మౌనంగా ఉంటే ఇంతకుమించినటువంటి అన్యాయం మరొకటి లేదు. Nda భారత రాజ్యాంగాన్ని మార్చి తమకు అనుకూలంగా సవరించుకునే ప్రమాదం కూడా లేకపోలేదు జాగ్రత్త .
భారతదేశంలో ప్రణాళికలు బడ్జెట్ రూపకల్పనలో సామాన్య ప్రజానీకాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదని మేధావులు ఆర్థికవేత్తలు గత దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని 10 ఏళ్ల పాలనలో కేవలం భక్తిని , మతాన్ని, బావా వేషాలను ప్రజల మధ్యన రుద్ది పబ్బం గడుపుకుంటున్నది అని ప్రతిపక్షాలు ఇండియా కూటమి ఘాటుగా విమర్శిస్తుంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేకపోవడం అత్యంత విచారకరం. ఇటీవల ఒక బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో ఏటా ఖర్చు చేస్తున్న పెట్టుబడిలో 90 శాతం గా ఉన్నటువంటి సామాన్య ప్రజానీకానికి 6 శాతం నిధులను కూడా ఖర్చు చేయడం లేదంటే అట్టడుగు వర్గాలు ఎంత వివక్షతకు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సీనియర్ కాంగ్రెస్ నేత సోనియాగాంధీ దేశంలో దారిద్ర రేఖ దిగువన గల వారి శాతం 15% గా ఉందని ఆందోళన చేస్తూ ఉంటే ఇక మనం ఏ వైపు ప్రయాణిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు.
గత కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను గత పది ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం క్రమక్రమంగా ప్రైవేటుపరం చేసి పేద ప్రజలకు ప్రభుత్వ రంగంలో వాటా లేకుండా చేసిన దుస్థితిని అడ్డుకోకపోతే ఎలా ? అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులతో పాటు రైతు సమస్యల పైన దేశవ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా భారత్ బంద్ పేరుతో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న కేంద్రం పట్టించుకోని కారణంగా అనేక పరిశ్రమలు మూతపడడంతో పాటు తమ ఉపాధిని హక్కులను కోల్పోయి అచే తనంగా మిగిలిపోతున్నటువంటి జనానికి భరోసా లేని ఈ దేశంలో ప్రస్తుత పాలనలో ఎందుకు అమాయకంగా మిగిలిపోవాలి? ప్రశ్నించకుండా, ప్రతిఘటించకుండా , ఎన్డీఏ ప్రభుత్వ విధానాల పైన ఉద్యమించకుండా ఉంటే మేధావులు బుద్ధి జీవులు దేశ ప్రజల ముందు తలవంచవలసి వస్తుంది జాగ్రత్త అని హెచ్చరికలు సర్వత్రా వెల్లువెత్తుతున్న తరుణమిది .
ఎన్నికలు కాదు... ప్రజాస్వామ్య నిరంకుశత్వం మధ్యన యుద్ధమే అంటే సబబు:
ప్రజల విశ్వాసాల పునాదిగా మతతత్వాన్ని పెంచి పోషిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అడ్డువచ్చిన అన్ని వర్గాలను కొల్లగొడుతూ ఉంటే ఈ దేశంలో నిర్మాణాత్మకమైన పరిపాలన ఎలా సాధ్యమవుతుంది? అసమానతలు అంతరాలు దోపిడీ, పీడన వంచన విచ్చలవిడిగా కొనసాగుతూ ఉంటే ఇటీవలి అంతర్జాతీయ సంస్థల నివేదిక ప్రకారంగా భారతదేశంలో 1 శాతం సంపన్న వర్గాల చేతిలో 40.1% సంపద కేంద్రీకృతమైనదనే చేదు వాస్తవాన్ని ఎలా జీర్నించుకోగలం? ఇది ఎన్డీఏ ప్రభుత్వ పాపం కాదా ? సిబిఐ ఈడి ఐటీ ఎన్నికల సంఘం వంటి స్వచ్ఛంద స్వయం ప్రతిపత్తి గల కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న కారణంగా ప్రతిపక్షాలను టార్గెట్గా చేసుకొని అనుకూలంగా లేని వర్గాలపైన ఉక్కు పాదం మోపడానికి చేస్తున్న ప్రయత్నం పైన ఏకమైనటువంటి 28 పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి గత కొంతకాలంగా ఈ దేశంలో అధికార ప్రభుత్వానికి ఎదురు దాడి చేస్తున్న విషయం తెలిసిందే . అధికార పార్టీలో చేరితే చాలు ఉన్న కేసులన్నీ మాఫీ చేయడం, ప్రశ్నిస్తే లేని కేసులను మోపడం అధికార పార్టీ రివాజుగా మారిపోతే ఈ దుర్నీతిని ఎండగట్టే క్ర మంలో ఇండియా కూటమి శక్తి వంచన లేకుండా చేస్తున్న ప్రయత్నాన్ని ఉద్యమకారులు, మేధావులు, బుద్ధి జీవులు, పౌర ప్రజా సంఘాలుగా స్వాగతించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్,నిత్యావసర ధరలను భారీగా పెంచి ప్రజల కొనుగోలు శక్తిని కేంద్రం పీల్చివేసిన విషయం అందరికీ తెలిసిందే. అనేక రాష్ట్రాలలో స్థిరంగా ఉన్నటువంటి ప్రభుత్వాలలో జోక్యం చేసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిన విషయం కూడా కొత్తేమీ కాదు . మణిపూర్ లో రెండు తెగల మధ్యన జరిగినటువంటి ఘర్షణను నివారించే బదులు అధికార పార్టీ ఆజ్యం పోసి కొండ జాతి తెగలను అవమానించే విధంగా మహిళలను నగ్నంగా ఊరేగించి రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహించిన విధానం ఎంత అవివేకమో అర్థం చేసుకోవచ్చు .మణిపూర్ ఆల్లర్ల పైన చర్చకు పట్టు పట్టినటువంటి ప్రతిపక్షాల పైన చట్టసభల్లో వేటువేసి 143 మంది సభ్యులను బహిష్కరించి తమ ఒంటెద్దు పోకడను ప్రదర్శించిన విషయం మనందరికీ తెలుసు. గతంలో భారత సర్వోన్నత న్యాయస్థానం సిజెఐగా పనిచేసిన ఎన్ వి రమణ గారు పార్లమెంటులో చట్టాల రూపకల్పన చర్చ లేకుండానే కొనసాగుతున్నదని చేసిన విమర్శను కేంద్రం ఏనాడూ పట్టించుకోకపోవడం కూడా విచారకరం .దేశానికి తిండి పెట్టే రైతన్నలు తమ హక్కుల కోసం మోపినటువంటి దుర్మార్గపు నల్ల చట్టాలను విముక్తి కోసం పోరాటం చేస్తే 750 మందిని బలి తీసుకున్న కేంద్రం కనీసం మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించాలని కోరితే పట్టించుకోని దశలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ఇచ్చిన హామీ బూటకం గానే మిగిలిపోతే దేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి పెట్టుబడిదారులు ప్రభుత్వ బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలను సుమారు 16 లక్షల కోట్లను మాఫీ చేసి కేంద్రం వాళ్లపైన సానుభూతి చూపినది. అంటే ఈ దేశంలో ప్రభుత్వం ఏ వర్గ ప్రయోజనం కోసం పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2014 నాటికి దేశం అప్పు 50 లక్షల కోట్లు ఉంటే గత పదేళ్లలో 100 లక్షల కోట్లకు పైగా అదనంగా అప్పులు చేసిన ఈ దేశ పాలకులు ఏ వర్గ ప్రయోజనం కోసం ఖర్చు చేసినారో ఇప్పటికీ ఇండియా కూటమి ప్రశ్నకు సమాధానం లేకపోవడం అత్యంత విచారకరం . తమ వద్ద వెయ్యేళ్ళ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని 20,47లో జరగబోయే ఎన్నికల కోసం ఇప్పటినుండి సిద్ధమవుతున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించడం నిజంగా హాస్యాస్పదం. ఏటా 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం గత పది ఏళ్లలో కేవలం 7 లక్షల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసి చేతులు దులుపుకున్నది అంటే ఇచ్చిన హామీ ఏమైనట్లు ?మాటలకు చేతలకు పొంతన లేకుండా దేశంలోని సామాన్య అట్టడుగు వర్గాల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టే విధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలను అడ్డుకోవడానికి అనివార్యమైన పరిస్థితిలో ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా కృషి చేస్తున్నటువంటి ఇండియా కూటమిని సర్వత్ర బుద్ధి జీవులు, మేధావులు, హక్కుల సంఘాలు, పౌర ప్రజాస్వామ్యవాదులు మద్దతు ఇవ్వడం ద్వారా 2024 సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉన్నది. ఇప్పటికే భారత రాజ్యాంగం పైన చిత్తశుద్ధి లేని ఎన్డీఏ పాలకులు పదేపదే రాజ్యాంగాన్ని మార్చుతామని హెచ్చరికలు చేయడం అప్పుడప్పుడు రాజ్యాంగాన్ని పక్కదారి పట్టించే విధానాలకు పాల్పడ డాన్ని మనం గమనించవచ్చు .ఇటీవల అధికార పార్టీకి చెందిన ఎంపీ 400 సీట్లు గనుక కేంద్రంలో వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చుతామని చేసిన హెచ్చరిక రాబోయే పెను ప్రమాదానికి సూచనగా భావించవలసిన అవసరం ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో సంపద కేంద్రీకృతం కాకుండా సమానత్వాన్ని సాధించే దిశగా అసమానతలు అంతరాలకు అవకాశం లేకుండా ఎన్నో ఏర్పాట్లు ఉన్నవి. అంతేకాదు "ఈ రాజ్యాంగం కూడా ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలమైతే పాలకుల యొక్క నిర్లక్ష్యం కూడా తోడైతే దేశ ప్రజలు ఏ రకమైనటువంటి సంకోచం లేకుండా తమకి ఇష్టమైనటువంటి రాజ్యాంగ యంత్రాంగాన్ని రూపొందించుకుంటారు .పరిపాలనను మార్చుకుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థను చిదిమి వేస్తారు. అందుకు ఏ కోశాన కూడా మినహాయింపు అవసరం లేదు" అని స్వయంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన హెచ్చరిక ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వానికి గుణపాఠం కలిగించకపోతే ఎలా? ఈ సూచనను అవకాశంగా ప్రత్యామ్నాయంగా తీసుకోవలసినటువంటి ఇండియా కూటమి మేధావి వర్గం కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తుల వైపు దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో రాజ్యాంగానికి ప్రజలకు ప్రజా ఆకాంక్షలకు ప్రజా ప్రయోజనాలకు ప్రమాదం ఏర్పడనున్న వేళ మూడవసారి అధికారంలోకి రావాలనుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని కట్టడి చేయడానికి అవకాశం ఉన్న మేరకు కృషి చేయడమే ప్రస్తుతం దేశ ప్రజల ప్రజాస్వామ్య వాదుల ముందున్న తక్షణ కర్తవ్యం కావాలి. .దేశం వెలిగిపోతున్నది, వికసిస్తున్నది అంటూ పలుకుతున్నటువంటి రాజకీయ పార్టీల మాటలను బూటకపు నినాదాలుగా స్వీకరించి నిర్మాణాత్మక చర్యలు తీసుకునే విధంగా ప్రత్యామ్నాయ శక్తుల పైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం. ! ఏ శక్తులతో ప్రమాదం పొంచి ఉన్నదో వారి పట్ల అప్రమత్తంగా ఉందాం! అది ఇవ్వాళ దేశ ప్రజల యొక్క చారిత్రక కర్తవ్యం .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్( చౌటపల్లి )జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)