కలెక్టర్ ‘ఓకే’... కింద అధికారులు ‘రిజెక్ట్

Jul 4, 2026 - 19:08
 0  2
కలెక్టర్ ‘ఓకే’... కింద అధికారులు ‘రిజెక్ట్

ఇందిరమ్మ ఇళ్ల తిరస్కరణలపై సమాధానం చెప్పని అధికారులు... పేదల కడుపు కొడుతున్న రహస్య లాగిన్ మాయాజాలం!

మహబూబాబాద్ కలెక్టరేట్, డీఆర్‌డీఓ (హౌసింగ్) కార్యాలయాల్లో దాగుడుమూతలు?

లబ్ధిదారులు ప్రశ్నిస్తే నోరు మెదపని అధికారులు... ఎందుకింత గుట్టు?

కలెక్టర్ ఆమోదించిన ఫైల్‌కే గతిలేకపోతే... ఇక ప్రజావాణి ప్రయోజనం ఏమిటి?

మహబూబాబాద్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ గందరగోళంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, అసిస్టెంట్ ఇంజనీర్ తదితరుల పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి ఆమోదించిన ఫైళ్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) లాగిన్‌కు చేరుకున్న తర్వాత "రిజెక్ట్" అవుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ సాంకేతిక కారణాలతో దరఖాస్తులు తిరస్కరించబడితే, అందుకు గల కారణాలను లబ్ధిదారులకు స్పష్టంగా వివరించడం అధికారుల బాధ్యత. అయితే "మా ఇల్లు ఎందుకు రిజెక్ట్ అయింది?" అని ప్రశ్నించినా సంబంధిత అధికారులు సమాధానం చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా... మౌనం వీడని అధికారులు

గార్ల మండలం సత్యనారాయణపురానికి చెందిన బొమ్మకంటి మాధురి వంటి వందలాది మంది బాధితులు కలెక్టరేట్, డీఆర్‌డీఓ (హౌసింగ్) కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నా స్పష్టమైన సమాధానం దొరకడం లేదని వాపోతున్నారు.

కలెక్టరేట్‌లో అడిగితే సంబంధిత సిబ్బందికి సమాచారం లేదని, హౌసింగ్ విభాగంలో అడిగితే "మా స్థాయిలో ఆమోదించాం... కానీ సిస్టమ్‌లో ఈఈ గారి వద్ద రిజెక్ట్ అయినట్లు చూపిస్తోంది. మాకేం తెలియదు" అంటూ బాధ్యతను ఒకరిపై మరొకరు నెట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పంచాయతీ కార్యదర్శి, అసిస్టెంట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ ఆమోదించిన ఫైల్‌ను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో ఏ కారణంతో తిరస్కరించారనే అంశంపై స్పష్టత లేకపోవడం లబ్ధిదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఆన్‌లైన్ పోర్టల్‌లో సాంకేతిక లోపం ఉంటే, దానిపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బేస్‌మెంట్లు వేశారు... అప్పుల పాలయ్యారు... ఇప్పుడు ఏం చేయాలి?

అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది లబ్ధిదారులు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కొందరు బేస్‌మెంట్లు వేయగా, మరికొందరు గోడలు కూడా నిర్మించారు. అయితే దాదాపు పది నెలలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఒకవైపు అద్దె ఇళ్లను వదలలేక, మరోవైపు కాంట్రాక్టర్ల ఒత్తిడిని తట్టుకోలేక పేద కుటుంబాలు మానసిక వేదన అనుభవిస్తున్నాయి.

హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లాగిన్‌లోనా, లేక జిల్లా ఇంజనీరింగ్ విభాగం స్థాయిలోనా ఫైళ్లు నిలిచిపోయినా, వాటిని పరిష్కరించే బాధ్యత జిల్లా యంత్రాంగంపైనే ఉంటుంది. ప్రతి సోమవారం నిర్వహించే "ప్రజావాణి"లో వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, నెలలు గడిచినా చర్యలు లేకపోవడం పట్ల లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మా డిమాండ్

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించాలి. కలెక్టరేట్, హౌసింగ్ విభాగాల్లో ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

ఆన్‌లైన్‌లో అన్యాయంగా తిరస్కరణకు గురైన బొమ్మకంటి మాధురి సహా ప్రతి అర్హులైన లబ్ధిదారుడి దరఖాస్తును పునఃపరిశీలించి, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలి.

లేకపోతే, బాధితుల తరఫున ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణాత్మక కథనాలతో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని హెచ్చరిస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333