ఒకటే జననం ఒకటే మరణం.ఆలోచించు ఒక్క క్షణం.

జీవితాన్ని సవాల్ గా తీసుకోవాలి కానీ క్షణికావేశంలో కడతే ర్చుకోవడం నేరమే.* కష్టాలు కన్నీరు ఎదురైనా నీ దారి నువ్వే సాగిపో నీ గమ్యం చేరుకో .* ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం వేల మానవ వనరులను కాపాడుకోవడం సమాజం , పాలకుల బాధ్యత కూడా.
--- వడ్డేపల్లి మల్లేశం
ఒక పొరపాటు జరిగితే సవరించుకోవడానికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు వస్తాయి కానీ మనిషిగా పుట్టిన తర్వాత తప్పులు చేయడం సవరించుకోవడం పునరాలోచన చేయడం వంటి వాటికి ఆస్కారం లేకుండా ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
ఎందుకంటే జీవితం ఒకటే కనక పుట్టిన నుండి చావు మధ్యన తీసుకునే నిర్ణయాలు మన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని ,జీవన గమనాన్ని, నాగరికతను, సామాజిక చింతనను నిర్ణయిస్తాయి . మనిషిని మనిషిగా చూసేది ఈ అంశాల ప్రాతిపదికనే కనుక జీవితం చాలా విలువైనదని అందుకు తగిన విధంగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అనుక్షణం క్షణక్షణం సద్వినియోగం చేసుకునే క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి తనకంటూ ఒక స్థానాన్ని పదులపరుచుకోవాలి .అంటే చరిత్రలో నిలిచిన మహనీయుల చరిత్రలను చదవడం మాత్రమే కాదు ప్రతి వ్యక్తి తనకంటూ ఓ చరిత్రను నిర్మాణం చేసుకోవడం కూడా అవసరం అని దీని అర్థం. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ *"జీవితంలో నిరాశ నిస్పృహకు తావూ ఉండకూడదని అదే సందర్భంలో తనకంటూ ఒక చరిత్రను నిర్మాణం చేసుకునే స్థాయిలో కృషి కొనసాగించాలని చేసిన సూచన గమనించదగినది.
క్షణికావేశం తప్పుడు నిర్ణయాలు :-
******
మనిషి మెదడు యొక్క శక్తి అపారమైనది కానీ దానిని సద్వినియోగం చేసుకునే సమర్థత సమయస్ఫూర్తి మనందరి పైన ఆధారపడి ఉన్నది .ప్రతి నిర్ణయంలోనూ ఒక ప్రయోజనం , ప్రారంభం, ముగింపు అంటూ శాస్త్రీయంగా నిర్వచించుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. దానికి బదులు క్షణిక ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు, ఆవేశపూరితమైనటువంటి ప్రవర్తన మనిషిని అగాధము లోకి నెట్టే ప్రమాదం ఉంటుంది .ఈ దుష్పరి నామాలు సంభవిస్తాయని తెలిసి కూడా మనిషి అప్పుడప్పుడు మొండితనముతో బాధ్యతారాహిత్యంగా ఇతరులు ఎంత చెప్పినా వినకుండా తన పని తానే చేస్తూ చివరికి కుమిలిపోయే ప్రమాదాలు అనేకం . వ్యక్తి యొక్క చిత్త ప్రవృత్తి గురించి మానసిక శాస్త్రవేత్తలు అనేక రకాలైన ఆలోచనలు చేయడంతో పాటు సూచనలు కూడా చేయడం జరిగింది .మనిషి సంఘజీవి అని అరిస్టాటిల్ చెప్పడం వెనుక ఎంతో పెద్ద వాస్తవ నిజ జీవితం సత్యం దాగి ఉన్నది . మనిషి ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం, పదిమందిలో జీవించడం ఉత్తేజ కరమైన ఉత్సాహభారతమైన వాతావరణానికి కారణం అవుతుంది. తద్వారా పనిలో ఉల్లాసం ఉత్పత్తిలో ఆధిక్యం, ఆరోగ్యంలో అగ్ర భాగాన నిలబడడానికి ఆస్కారం ఉంటుంది .అనేక అవకాశాలు ఉద్యోగాలు వ్యాపారాలు ఆదాయము గౌరవము ఉన్నప్పటికీ కూడా అనేకమంది ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూసి చలించిపోయి ఇక జీవితం ఎందుకు అని ఆత్మహత్య చేసుకోవడాన్నీ మనం నిరంతరం గమనిస్తూ ఉన్నాం. బాలలతో సహా విద్యార్థులు, ఉద్యోగులు ,వ్యాపారులు, మానసిక శాస్త్రవేత్తలు, డాక్టర్లు ,నిపుణులు, కూలీలు, రైతులు, అన్ని రంగాలకు చెందిన వాళ్లు కూడా ఈ ఆత్మహత్యల బారిన పడడం చాలా ఆందోళన కలిగించే విషయం. పేదరికం ,అమాయకత్వం, అనాగరికత, అవమానాలు, ఆదాయం లేకపోవడం, గుర్తింపు లేకపోవడం వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న వాళ్లు అనేకమంది ధైర్యంగా సాహసంగా జీవిస్తున్న సందర్భాలు ఉంటే అన్నీ ఉండి కూడా జీవితాన్ని సంతోషంగా అనుభవించలేని వాళ్లు కూడా ఆత్మహత్యల పాలవుతున్నారు . ఇక పేదరికం, ఉపాధి లేకపోవడం, వివక్షత వంటి సందర్భాలలో ఉన్న వాళ్ళు కూడా మృత్యు బారిన పడుతున్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి . అంటే పేదరికం అవమానాలు వంటి అంశాలు కొంత కారణమైతే అనేక సందర్భాలలో అన్ని రకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా మృత్యు బారిన పడుతున్న విషయాన్ని గమనించినప్పుడు ఇది మానసిక పరమైన బలహీనతగా గుర్తించవలసిన అవసరం ఉన్నది .
భారతదేశములో 140 కోట్ల పైచిలుకు జనాభా ఉంటే ముఖ్యంగా అందులో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో యువతను కలిగి ఉన్న దేశంగా మనకు చాలా గుర్తింపు ఉన్నది. కానీ ఇవాళ ఆత్మహత్యల బారిన పడుతున్న వారిని గమనించినప్పుడు ఎక్కువగా యువతనే కావడం అత్యంత విచారకరం .
చనిపోయిన తర్వాత దృష్టికి వస్తున్న కారణాలను కనుక పరిశీలించినప్పుడు భార్య కాపురానికి రావడం లేదని, లేదా భర్త తాగి వచ్చి విపరీతంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, కుటుంబంలో జరుగుతున్న పోరును భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నామని అనేకమంది తమ వాంగ్మూలాలలో చెప్పడాన్ని మనం గమనించాలి . ఇక విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు అతి సున్నితమైనటువంటి అంశాలను కూడా చావుకీ మార్గంగా ఎంచుకోవడం చాలా విడ్డూరమైన విషయం., ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం కూడా. విద్యార్థులు తమకు స్కూల్ డ్రెస్ కుట్టించలేదని , టీవీ చూస్తున్న సందర్భంలో అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్యన జరుగుతున్న వాగ్వాదము, పాఠశాలకు వెళ్ళమని తల్లిదండ్రులు మంజలించినార ని, లేదా ఉపాధ్యాయులు నిందించినారని , అలాగే ట్యూషన్ ఇతరత్రా కోచింగ్ వెళ్తున్న సందర్భంలో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లుగా వాళ్లు ప్రకటించిన అంశాలను బట్టి మనకు తెలుస్తున్నది. ఇక దేశవ్యాప్తంగా గనక పరిశీలించినప్పుడు కార్మికులు రైతులు, చేతివృత్తుల వాళ్ళు, పేదవర్గాలు, సంచార జీవులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా ఆ కుటుంబాలు వీధిన పడుతున్న విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం చాలా ఉన్నది. కొన్ని గణాంకాలను పరిశీలించినప్పుడు 2018 నుంచి 2022 వరకు దేశవ్యాప్తంగా ఆత్మహత్యల కు పాల్పడిన వాళ్ల సంఖ్యను అంచనా వేసినప్పుడు 7 లక్షల 60,000 అంటే ఆందోళన కలగక మానదు ఏ రకంగా మానవ వనరులను ఈ దేశం కోల్పోతుందొ మనం అర్థం చేసుకోవచ్చు.
2022లో ఆత్మహత్యలకు పాల్పడిన వారి శాతాన్ని వర్గాల వారిగా విశ్లేషిస్తే అన్ని రంగాల వాళ్లు కూడా ఏ లాంటి మినహాయింపు లేకుండా బలి కావడం ఆలోచించదగిన పరిణామం . వ్యవసాయ రంగంలోని వారు 6.6% , విద్యార్థులు 7.6% , నిరుద్యోగులు 9.2% ,వృత్తి నిపుణులు వేతన జీవులు ఉద్యోగులు 9.6% ,రోజువారి కూలీలు 26.4% , స్వయం ఉపాధి పొందుతున్న వాళ్లు 11.4% , ఇక మహిళలు 14.8 శాతం, ఇతరులు 14.3% అని జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక ద్వారా తెలుస్తున్నది.
ఆత్మహత్యల నివారణ- కొన్ని ముందు జాగ్రత్తలు :-
*******
ఒంటరిగా ఆలోచించడం, పదిమందిలో కలిసిపోవడానికి ఇష్టపడకపోవడం, ముభావంగా వ్యవహరించడం ,చేసిన తప్పులను సవరించుకోకుండానే తిరిగి తిరిగి ఆందోళనకు గురి కావడం , సమస్యలను తోటి మిత్రులు అభిమానులతో చెప్పుకోకపోవడం , నిరంతరం నిరాశానిస్పృహ లతో మాట్లాడడం వంటి లక్షణాలను గమనించినప్పుడు అలాంటి వాళ్లను 10 మందితో కలిసి పోయే విధంగా సర్దుబాటు చేయవలసిన అవసరం మనవందరి పైన ఉన్నది. .అలాంటి వాళ్ళ కోణంలోకి మనం వెళ్లి ఆలోచించడం, ప్రశ్నించడం, ఓదార్పు నివ్వడం, భరోసా కల్పించడం, కొన్ని ఉదాహరణల ద్వారా ధైర్యాన్ని నూరి పోయడం వంటి అంశాలు కూడా ఇలాంటి బలహీన సందర్భాలలో బాగా పనిచేస్తాయి. ఆత్మహత్యలు గల కారణాలు పరిష్కరించుకునే విధానం పైన మానసిక శాస్త్రవేత్తలు అనేక రకాలైన సూచనలు నిత్యం చేస్తూనే ఉన్నారు కానీ ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కనుక ఎవరికి వారిమి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు సమస్యను పెద్దదిగా చేయకుండా దృష్టి సారించినప్పుడు మాత్రమే ప్రమాదం నుండి బయటపడే ఆస్కారం ఉంటుంది . కుటుంబ సమస్యలు ,సంఘర్షణలు, వివాదాలు, అనేక గందరగోళాలకు దారితీస్తున్నటువంటి భార్యాభర్తల సంఘర్షణ కుటుంబ నేపథ్యము పైన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర మేధావులు నిపుణులు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ల లోపల ఆత్మ స్థైర్యాన్ని నూరి పోయాలి .జీవితం పట్ల ఉన్నటువంటి చిన్న చూపు ఆందోళనలను తొలగించి ప్రతి విషయాన్ని సవాల్ గా తీసుకునే అలవాటును నేర్పించాలి. ముఖ్యంగా ఇలాంటి లక్షణాలను మనము బాల్య దశ నుండి పిల్లల్లో నూరిపోయడం వలన ధైర్యoగా ఆలోచించడం ,వివేచనతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం, జీవితం యొక్క పలు పారిశ్వాలను అవగాహన చేసుకోవడం, కష్టసుఖాలను సమానంగా చూసే థా త్విక చింతనను నేర్పించడం వలన ఈ బలహీన క్షణాలకు ఆస్కారం లేకుండా కొంతవరకు చూడవచ్చు. ఆర్థికపరమైనటువంటి అంశాల వల్ల చనిపోతున్న వాళ్లు కూడా లేకపోలేదు కుటుంబంలో ఆదాయం లేక అనేక అంశాలకు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో పిల్లలు లేదా తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు కుటుంబాన్ని నెట్టుకు రాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు కూడా అనేకం. అలాంటి పరిస్థితులు పేదరికము, నిరుద్యోగము, వివక్షత, అవమానాలు, ఉపాధి లేకపోవడం , అసమానతలు, అంతరాల, వివక్షత కొనసాగుతున్న అంశాలలో కుటుంబాలలో మాత్రం ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా ఆ కుటుంబాల ఆర్థిక సమస్యలను పరిష్కరించడం ద్వారా సామాజిక సమస్యలను చట్ట పరిధిలో సవరించుకోవడానికి అవకాశాలను కల్పించడం ద్వారా వారిలో ఆత్మ గౌరవాన్ని పెంచవచ్చు . ఇక రైతులు కూలీలు కార్మికులు లక్షలాదిమంది చనిపోతున్న సందర్భంలో వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాథమిక అంశాలను కొంతవరకైనా పరిష్కరించే ప్రయత్నం కుటుంబం, సమాజం, పాలకులు ఆయా పరిధిని బట్టి సహకరించడం చర్యలు తీసుకోవడం ద్వారా కొంతమంది ప్రాణాలైనా కాపాడానికి అవకాశం ఉంటుంది .జీవితము క్షణభంగురమని నిర్వచనం ఇస్తారు కానీ దానిని విశాలమైనటువంటి వేదికని, సుదీర్ఘమైనటువంటి జీవన గమనానికి ఆధార భూతమని, ప్రతి ఒక్కరు గ్రహించే విధంగా జీవితం యొక్క లోతుపాతులను అవగాహన కల్పించాలి. కష్ట సుఖాలలో సమానంగా జీవించడం , భవిష్యత్తు సవాళ్లను అధిగమించడానికి ధైర్యంగా వ్యవహరించడం , ప్రతి చిన్న అంశానికి కృంగిపోకుండా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో పాటు ధైర్యాన్ని నూరి పోయడం ద్వారా ప్రతి అంశం పైన సాధికారత సంపాదించవలసిన అవసరం ఉన్నది. .ముఖ్యంగా మహిళలు అవమానాలకు అత్యాచారాలకు కుటుంబంలో గృహహింసకు తట్టుకోలేక కొందరు కుటుంబ సభ్యులను బెదిరించడానికి మరికొందరు కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలను కూడా మనం గమనించాలి. ముఖ్యంగా ప్రతి కుటుంబం తమ వరకు మాత్రమే ఆలోచించకుండా సమాజంలో మిగతా కుటుంబాలతోని పోల్చుకోవడం ద్వారా ఒకరికొకరు అండగా నిలబడి సమస్యలొచ్చినప్పుడు సమీక్షించుకొని పరిష్కరించుకోవడంతోపాటు ఆసరాగా భావించినప్పుడు క్షణకాలపు దురాలోచనను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఎంతసేపు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారో అక్కడ మానసిక వేదనకు గురవుతూనే ఉంటారు అని అర్థం చేసుకోవాలి. అందుకే" నవ్వుతూ బతకాలిరా నవ్వుతూ చావాలి రా" అనేటువంటి సినీ గేయం మనకెన్నో గుణపాటాలను నేర్పుతున్నది .ముఖ్యంగా సంతోషంతో పది మందిలో కలిసి ఆనందంగా జీవించినప్పుడు మనలో ఊహించకుండానే ఎండార్పిన్ హార్మోన్లు ఉత్పత్తి కావడం వలన మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది తద్వారా బలహీనతలను అధిఘ ;మించడానికి అవకాశం కూడా ఉంటుంది. ఈ అంశం ఎంత చెప్పుకున్నా జీవితాన్ని విశాలంగా అర్థవంతంగా ఆలోచించినప్పుడు మాత్రమే ఈ ఆత్మహత్యలకు చరమగీతం పాడవచ్చు. జీవితం యొక్క సారాంశాన్ని అనుభవించడానికి ఉత్సుకత పెంపొందించుకోవడమే పరిష్కార మార్గం .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)