ఏ ప్రయోజనాల కోసం  బి ఆర్ ఎస్ తో కలిసి నడవడం?

Mar 30, 2024 - 23:49
 0  5

 బహుజన వాదాన్ని  తాకట్టు పెట్టినట్లు అనే విమర్శలకు సమాధానం ఏమిటి?

టిఆర్ఎస్ను ఘాటుగా విమర్శించిన నోటితోనే  మద్దతు కోరడం  ఎన్నికల పన్నాగమా ?

వ్యక్తిగత ప్రయోజనాల కోసం  ప్రజాభిప్రాయాన్నీ వంచించడం  రాజ్యాంగ ద్రోహమే .

----వడ్డేపల్లి మల్లేశం 

బహుజన వాదాన్ని  సమాజంలో విస్తరింప చేయడం అనేది  ఈనాటి సమస్య, సవాలు, డిమాండ్ కాదు.  జ్యోతిబాపూలే కాలంలో మొదలై  ఆ తర్వాత వరుసగా అనేకమంది  బీసీ ఉద్యమకారులు సంఘసంస్కర్తలు  మెజారిటీ ప్రజలైనటువంటి బహుజనుల పట్ల అంకితభావంతో సమాజ ఉద్ధరణ కోసం కృషిచేసినారు అనడంలో సందేహం లేదు .  నారాయణ గురు,సాహు మహారాజ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి మహనీయులు  బీసీ ఉద్ధరణ కోసం చేసిన కృషి  రాజ్యాంగబద్ధంగా హక్కులను కల్పించడం కోసం అంబేద్కర్ చేసిన ప్రయత్నం  ఈ కోవలోనివే . రాజ్యాంగ రచన కాలంలో  బీసీలకు ప్రత్యేక సౌకర్యాల కోసం  అంబేద్కర్ ప్రయత్నిస్తే ఆనాటి అగ్రవర్ణ నాయకత్వం అడ్డుకున్న కారణంగా  మెజారిటీ ప్రజలైన బీసీలకు  ఆ అవకాశాలు అందకుండా పోయినప్పటికీ ఎస్సీ ఎస్టీ వర్గాల కైనా  కొంత మేలు జరిగిన మాట వాస్తవం.  అయినప్పటికీ ప్రత్యేక ఏర్పాటు ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు  బీసీల అభ్యున్నతి కోసం కమిషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆ పనిని  రాబోయే కాలంలో చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించినప్పటికీ  ఇప్పటికీ  చిత్తశుద్ధి లేని పాలకుల కారణంగా  చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు అనే డిమాండ్ డిమాండ్ గానే మిగిలిపోయినది. 
  బహుజన వాదాన్ని  బలంగా తీసుకువచ్చే క్రమంలో  కాన్షీరాం  బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి  ఉత్తరప్రదేశ్  రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా  ఆ పార్టీని అధికారంలోకి తెచ్చి దేశవ్యాప్తంగా  పార్లమెంటులోనూ  ప్రవేశించి బహుజనులకు దిక్సూచిగా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే . ఆ క్రమంలో బిఎస్పి పార్టీ దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చి  అనేక చోట్ల  కొంతమంది ప్రజా ప్రతినిధులను చట్టసభల్లోకి పంపించినప్పటికీ  బహుజనులను పార్టీలోకి  తీసుకురావడంలో కొంత  వెనుకబాటు ,  అదే క్రమంలో బహుజన  వర్గాలకు చెందిన వాళ్లు అన్ని రాజకీయ పార్టీల్లో అవకాశవాదంతో చేరడం కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఎదగక పోవడానికి ప్రధాన కారణమైనది . అంతేకాకుండా  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనక చూసినప్పుడు  రాష్ట్ర నాయకత్వం  మాత్రమే ఉంటే స్థానిక నాయకత్వాలు అంతగా ప్రచారంలో లేకపోవడమే కాకుండా  జాతీయ నాయకత్వం వచ్చిన సందర్భంలో  కనీసం రాష్ట్ర నాయకుని పరిచయం కూడా జరగనటువంటి పరిస్థితులు కొంత  పార్టీ వెనుకబాటు కు కారణమైనవి. ఈ సందర్భంలో  2021 ఆగస్టు మాసంలో బీఎస్పీ  పార్టీలో చేరి పార్టీకి అధ్యక్షునిగా కొనసాగినటువంటి  మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు   రెండున్నర సంవత్సరాల పాటు ఆ పార్టీని విస్తృత స్థాయిలో  ప్రజల్లోకి తీసుకు వెళ్లిన మాట  వాస్తవమే.  టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగిన నాడు  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆ పార్టీ పైన  ఘాటైన విమర్శలు చేసి బహుజన  ద్రోహి అనీ నిందించి  ఇటీవల ఆ పార్టీతో  సంబంధాలు పెట్టుకునే క్రమంలో ఒప్పందం కుదుర్చుకోవడం  ఆ తర్వాత జాతీయ నాయకత్వం యొక్క హెచ్చరికతో వి రమించుకొని పార్టీకి రాజీనామా చేయడం,  అయినప్పటికీ బీఆర్ఎస్ తో కలిసి నడుస్తామని ప్రకటించడం పట్ల ప్రజలు ప్రజాస్వామికవాదులు విశ్లేషకులు ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే బహుజన వాదాన్ని  కుటుంబ పాలనకు తాకట్టు పెట్టినట్టు అవుతుందని కొందరు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు.
     ఏ ప్రయోజనాలకు  ఈ రాజీనామా? టిఆర్ఎస్ తో చర్చలు :-
*********
బహుజన వాదాన్ని ఆకాశానికి ఎత్తిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు  కొన్ని కారణాలు చెప్పి తాత్కాలికంగా ఎన్నికల్లో  గెలవడానికి కొత్త రూపంలో బిఆర్ఎస్ తో చర్చలు జరిపి  ఆ తర్వాత జాతీయ పార్టీ ఆదేశం మేరకు పొత్తును  వ్యతిరేకించడంవలన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం  సున్నితంగా బీఎస్పీ నుండి తప్పుకోవడానికేనా ? అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాడు  బీఎస్పీ అధినేతగా  దొరల గడీల కుటుంబ పాలన  అని,  బహుజనులకు ద్రోహం చేస్తున్న పార్టీ అని,  స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు, నిర్బంధం అన చివేత యధేచ్ఛగా  కొనసాగుతున్నది , ప్రజాస్వామిక విలువలు మృగ్యమైనవి అని ఘాటుగా విమర్శించి   పార్లమెంట్ ఎన్నికల కోసం  మొదట్లో పొత్తుకుదురుచుకోవడం ఆ తర్వాత  పార్టీ నుండి వైదొలగి రాజీనామా చేసి  టిఆర్ఎస్ తో కలిసి పని చేయడానికి సిద్ధపడడం అంటే  బహుజన వాదాన్ని  ప్రజల ఆత్మగౌరవాన్ని  గాలికి వదిలేసినట్టే ! ఇప్పటికైనా   స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా టిఆర్ఎస్ మద్దతుతు ఎన్నికలకు పోవాలని  ఆలోచిస్తున్నట్లు కొందరు వాదిస్తే మరి కొందరు టిఆర్ఎస్ లోనే కలిసి  ఏకాయకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోనున్నట్లు యూట్యూబ్ ఛానల్ లో వస్తున్న వార్త కథనాలు  ప్రజలను ప్రజాస్వామిక వాదులను బహుజన వాదులను ఆలోచింపజేస్తున్నావి.  రాజకీయ పార్టీలకు లక్ష్యము, సిద్ధాంతము, ఆచరణ, ప్రజా ప్రయోజనాలు  చాలా ముఖ్యం.  ఏకరూప సిద్ధాంత భావజాలం కలిగిన పార్టీలతో కలిసి పోవడం అంటే కొంత అర్థం ఉంటుంది కానీ  టిఆర్ఎస్ తో కలిసి పోవడానికి ప్రయత్నిస్తే  రాబోయే కాలంలో పలు విమర్శలకు గురికాక తప్పదు.  అంతేకాదు రాష్ట్రంలో  బహుజన వాదాన్ని  కొంత ప్రచారంలోకి తీసుకువచ్చి ఆ వెంటనే  రాజీనామా చేయడం ద్వారా  ఆ వాదాన్ని  ఆగాధంలోకి నెట్టినట్టేనా?  ఏది ఏమైనా  రాజ్యాంగాన్ని మార్చాలి అని  ప్రకటన చేసి వివాదానికి గురైనటువంటి బారాస పార్టీతో  అంబేద్కర్ భావజాలం నుండి  ఎదిగిన బహుజన వాదం ఆ పార్టీకి నాయకత్వం వహించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  ఏ రకంగా  కలిసిపోతారో విజ్ఞులు ఆలోచించవలసిన అవసరం ఉన్నది.  అవకాశవాద రాజకీయాలకు ఎవరు పాల్పడిన  కొంత ఆలస్యంగానైనా ప్రజలు గుర్తిస్తారు తగిన శాస్తి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.  రాజకీయ పార్టీలలో ప్రధాన బాధ్యతల లో ఉన్నవారికి వ్యక్తిగత ఆలోచనలు అంటూ ఉండడానికి ఆస్కారం లేదు  ఆ విషయాన్ని ఇప్పటికైనా గమనిస్తే మంచిది.  ప్రజల చిత్కారానికి ,ఆగ్రహానికి ,ఓటమికి గురైనటువంటి బారాస పార్టీతో  బహుజన వాదాన్ని ఎత్తుకున్నటువంటి బీఎస్పీ అధినేత  పార్టీకి రాజీనామా చేసి కలిసిపోవడం  అది రాజకీయాలలో వికృత చేష్టలకు పరాకాష్టగా భావించవలసి ఉంటుంది.  ప్రజల విశ్వాసాన్ని
కోల్పోవడమే కాకుండా ప్రజల ఆగ్రహానికి గురి అయ్యే  పరిస్థితులు ఏ రాజకీయ పార్టీ తెచ్చుకున్నా  ప్రజల చేతిలో శిక్ష తప్పదు .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333