ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి 

Aug 19, 2026 - 20:07
 0  1
 ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి 
 ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి 
 ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి 

 రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి 

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

బుధవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా ఐడీఓసీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వేణుగోపాల్‌, భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్టతో కలిసి జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లు, వివరాల్లోని వ్యత్యాసాలను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ పూర్తైన అనంతరం మ్యాపింగ్‌ కాని ఓటర్లు, వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత తేదీ, సమయంలో హాజరై పౌరసత్వాన్ని నిర్ధారించే సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.

ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించాలని, అలాగే అక్టోబర్‌ 15 వరకు నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో చేపడుతున్న చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రాష్ట్ర స్థాయికి పంపాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సులభంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఓటర్లకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించి, అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత సమయంలో హాజరయ్యేలా చూడాలని సూచించారు. నోటీసుల జారీ, క్లెయిమ్‌లు–అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తదితర ప్రతి దశను అధికారులు సమన్వయంతో పర్యవేక్షిస్తూ, నిర్ణీత కాలపరిమితిలో ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ జిల్లాలో ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటైజేషన్‌ ప్రక్రియకు సంబంధించిన స్థితిగతులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. జిల్లాలో ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటైజేషన్‌ ప్రక్రియలో గుర్తించిన వివరాల్లోని వ్యత్యాసాలు (Anomalies), మ్యాపింగ్‌ కాని ఓటర్ల వివరాలను నియోజకవర్గాల వారీగా వివరించారు.

పినపాక నియోజకవర్గంలో 39,670 వివరాల్లో వ్యత్యాసాలు (Anomalies), 16,421 నో మ్యాపింగ్, ఇల్లెందు నియోజకవర్గంలో 37,660 వివరాల్లో వ్యత్యాసాలు, 5,656 నో మ్యాపింగ్, కొత్తగూడెం నియోజకవర్గంలో 46,743 వివరాల్లో వ్యత్యాసాలు, 23,428 నో మ్యాపింగ్ ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

అదేవిధంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 28,994 వివరాల్లో వ్యత్యాసాలు, 7,361 నో మ్యాపింగ్, భద్రాచలం నియోజకవర్గంలో 27,162 వివరాల్లో వ్యత్యాసాలు, 7,340 నో మ్యాపింగ్ ఉన్నట్లు వివరించారు.

జిల్లావ్యాప్తంగా మొత్తం 1,80,229 వివరాల్లో వ్యత్యాసాలు (Anomalies), 60,206 నో మ్యాపింగ్ ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ వివరించారు. డిజిటైజేషన్‌ ప్రక్రియలో ఎదురవుతున్న అంశాలను నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తూ, ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

 అనంతరం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామాలు, మున్సిపల్‌ పరిధిలో ధ్రువపత్రాల స్వీకరణకు తేదీ, సమయాలను ముందుగానే ఖరారు చేయాలని అధికారులకు సూచించారు. ఆయా కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. అధికారులకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవసరమైన శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.ప్రతి దశలోనూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, కాలపరిమితులకు అనుగుణంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు.


 ఈ సమావేశంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఎన్నికల విభాగం సూపర్డెంట్ రంగ ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు ఎన్నికల విభాగం సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333