ఉమ్మడి మహబూబ్ నగర్,నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో
రాగల 18 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, గద్వాల్, సంగారెడ్డి, మెదక్, నిజమాబాద్, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.మరో మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, కామారెడ్డిలో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్ నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మియాపూర్, లింగంపల్లి, షేక్ పేట, మెహదీపట్నం, కూకట్పల్లి, కొండాపూర్, మాదాపూర్, రాజేంద్రనగర్, టోలీచౌకి, నిజాంపేట్ ఏరియాల్లో వర్షం కురిసింది. ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంటి నుంచి బయటకు ఎవరు రాకుండా ఉండాలని వాతావరణ శాఖ ప్రజలను సూచించింది.
హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం..
హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, మాదాపూర్, జూబ్లీహిల్స్, సైనిక్ పురి, గాజుల రామారం, అల్వాల్, దిల్‌సుఖ్‌నగర్ సహా తదితర ప్రాంతాల్లో దంచికొడుతోంది. మరోవైపు వర్షాలకు నగరంలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఒక్కసారిగా రోడ్లపైకి వాహనాలు చేరాయి. వర్షం కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మెట్రో లైన్లు, స్టేషన్ల కింద వాహనదారులు ఉండిపోయారు. మరోగంటపాటు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.