ఇండస్ట్రియల్ విజిట్ తో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం
తిరుమలగిరి 23 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, అనంతారం విద్యార్థులు మంగళవారం వృత్తి విద్యలో భాగంగా ఇండస్ట్రియల్ విజిట్ నిర్వహించారు. ఒకేషనల్ ట్రేడ్స్లోని మెకానిక్, ఐటీ, మల్టీమీడియా విభాగాలకు చెందిన విద్యార్థులు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వృత్తి విద్యా విభాగాలకు సంబంధించిన అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి, ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పొందారు. సోలార్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, టెలిఫోన్ రిపేర్, హార్డ్వేర్, మల్టీమీడియా తదితర ల్యాబ్లను సందర్శించి ఆయా రంగాల్లో ఉపయోగించే పరికరాలు, సాంకేతిక విధానాలు, విద్యార్థులు నేర్చుకుంటున్న వివిధ కోర్సుల గురించి తెలుసుకున్నారు.
మల్టీమీడియా విద్యార్థులు సంబంధిత ల్యాబ్లను సందర్శించి సాంకేతిక అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆటోమొబైల్, టెలిఫోన్ రిపేర్, హార్డ్వేర్ విభాగాల్లో శిక్షణ పొందుతున్న విధానాలను తెలుసుకున్నారు. పాఠ్యాంశాలకు అనుసంధానంగా ప్రత్యక్ష అనుభవం పొందడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి, సృజనాత్మకత, నైపుణ్యాలు మరియు సాధికారత పెంపొందుతాయని ఒకేషనల్ ట్రైనర్లు చైతన్య, పద్మ తెలిపారు.
ఇండస్ట్రియల్ విజిట్ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని, వివిధ ల్యాబ్లను సందర్శించడం ద్వారా పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సంజీవ్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు తరగతి గది బోధనతో పాటు క్షేత్రస్థాయి అనుభవం కల్పించేందుకు కళాశాల తరఫున వివిధ ప్రాంతాలకు విద్యా సందర్శనలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఒకేషనల్ ట్రైనర్లు చైతన్య, పద్మ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ షేక్ చాంద్, అధ్యాపకులు యాకస్వామితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.