అర్హులైన వారందరికీ బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలి
బ్యాంకర్లు–అధికారులు సమన్వయంతో రుణాల పురోగతి సాధించాలి
ఆర్ఎస్ఈటీఐ శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధికి రుణాలు అందించాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.
జోగులాంబ గద్వాల 8 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : జిల్లాలో అర్హులైన వారందరికీ వీరి వీరి గా రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా డిసిసి డిఎల్ఆర్సి కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు,ఇతర రుణ లక్ష్యాలను బ్యాంకులు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోగా పూర్తిస్థాయిలో సాధించాలన్నారు. ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసి,వారు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు.ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల పథకం, మత్స్యకారుల కేసీసీ(కిసాన్ క్రెడిట్ కార్డ్) రుణాల మంజూరులో పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తి మార్చి 31న 228.74% ఉండగా, జూన్ 30న *227.60%*గా నమోదైనందున, దీనిని మరింత పెంచేలా రుణాల మంజూరును వేగవంతం చేయాలన్నారు. ప్రాధాన్యత రంగంలో మార్చి 31న రూ.5,743.98 కోట్ల లక్ష్యానికి రూ.3,463.10 కోట్లు (60.23%) సాధించగా, జూన్ 30న రూ.6,495.02 కోట్ల లక్ష్యానికి రూ.1,050.24 కోట్లు (16.17%) మాత్రమే సాధించడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగంలో మార్చి 31న రూ.4,979.08 కోట్ల లక్ష్యానికి రూ.3,652.98 కోట్లు (73.37%) సాధించగా, జూన్ 30న రూ.5,575.54 కోట్ల లక్ష్యానికి రూ.990.19 కోట్లు (17.75%) సాధించినట్లు తెలిపారు. రుణాల మంజూరును మరింత వేగవంతం చేయాలన్నారు. ఏమ్.ఎస్.యం.ఈ రంగంలో మార్చి 31న రూ.606 కోట్ల లక్ష్యానికి రూ.335.05 కోట్లు (55.29%),జూన్ 30న రూ.691.80 కోట్ల లక్ష్యానికి రూ.205.56 కోట్లు (29.71%) సాధించినందున పురోగతిని మరింత పెంచాలన్నారు.ముద్ర రుణాలు, హౌసింగ్, వ్యవసాయ రంగాలకు సంబంధించిన రుణాల మంజూరును మరింత పెంచాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సదుపాయాలను మరింత విస్తరించాలని సూచించారు. ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపుల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు పొందడం వల్ల కలిగే ప్రతికూలతలు,వడ్డీ భారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియోలు, బాధితుల అనుభవాలు, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీని వేగవంతం చేసి,అర్హత ఉన్న అన్ని సంఘాలకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలన్నారు.యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో శిక్షణ పొందిన నైపుణ్యవంతులైన అభ్యర్థులకు రుణాలు మంజూరు చేసి,వారు స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. బ్యాంకర్లు,అధికారులు క్రమం తప్పకుండా సమన్వయ సమావేశాలు నిర్వహించి,పథకాల అమలు, రుణాల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం వార్షిక రుణ ప్రణాళిక 2026–27 పుస్తకాలను కలెక్టర్ బ్యాంకర్లతో కలిసి ఆవిష్కరించారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఎల్డిఎం శ్రీనివాసరావు, ఇండియన్ నాబార్డ్ డీడీఎం మోహన్ రెడ్డి,ఆర్బీఐ ప్రతినిధి శ్రీనివాసులు వెన్న,ఎస్బీఐ రీజినల్ మేనేజర్ శ్రీ చరణ్, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ ఆర్.యం హరి కృష్ణ, ఇండియన్ బ్యాంక్ డిజియం శ్రీనివాసులు, డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, డిఆర్డీఓ ముషాయిదా బేగం,పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామ లింగేశ్వర్ గౌడ్,ఉద్యానవాన శాఖ అధికారి రాజ్ కుమార్,మత్స్య శాఖ అధికారి షకీల భాను,వివిధ శాఖల జిల్లా అధికారులు,ఆయా బ్యాంకుల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.