అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు:జడ్పీ చైర్ పర్సన్
జోగులాంబ గద్వాల 22 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- గద్వాల.: -ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించడంతో పాటు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ సరిత అధికారులను ఆదేశించారు. బుధవారం గద్వాలలోని పాత ఎంపీడీవో కార్యాలయ సమావేశపు మందిరంలో జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు ఎజెండాలో చేర్చిన అంశాలపై చర్చించారు.
శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు గురించి మాట్లాడారు. పలువురు జడ్పీటీసీలు తమ మండలాల్లో నెలకొన్న వివిధ సమస్యలపై ప్రశ్నించగా, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు వివరించారు. ఇందులోని ప్రధాన అంశాలపై జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత మాట్లాడుతూ, సదరమ్ ధ్రువపత్రాలు పొందేందుకు స్లాట్ బుకింగ్ సమయాన్ని పెంచేందుకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే హరితహారంలో భాగంగా లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా టిఆర్టి ద్వారా కొత్త టీచర్ల నియామకం చేపట్టే వరకు వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు సమయానికి విధులకు రావాలని, వివిధ టెస్టులు బయటకు రాయకుండా అందుబాటులో ఉన్న ల్యాబ్ లోనే చేయాలన్నారు.
అక్కడ ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకొని ముందుకెళ్లాలన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పారిశుధ్య పనులను చేపట్టి రోగాలు వ్యాపించకుండా అవసరమైన ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ఐజ నుంచి మేడికొండ వరకు ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న రహదారి నిర్మాణం పూర్తి చేయాలని, ఐజ పట్టణంలోని వంతెన పనులు కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్లాస్టిక్ వాడకం పెరుగుతోందని దాంతో క్యాన్సర్ వ్యాధితో మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ సరోజమ్మ, జిల్లా పరిషత్ సీఈవో కాంతమ్మ, పలువురు జడ్పిటిసిలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.