అరైవ్–అలైవ్’లో భాగంగా హెల్మెట్ అవగాహన కార్యక్రమం
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా వాహనదారులకు హెల్మెట్లు
జోగులాంబ గద్వాల 25 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘అరైవ్–అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఎర్రవల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ బి.ఎం. సంతోష్ స్వయంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు ధరింపజేసి రోడ్డు భద్రతపై స్పష్టమైన సందేశం ఇచ్చారు.
కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ప్రతి ప్రాణం అమూల్యమైనది అని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా, అది ఒక కుటుంబ భవిష్యత్తును కాపాడే రక్షణ కవచవమని తెలిపారు. యువత ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధిక వేగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. రోడ్డు భద్రతను సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్. మాట్లాడుతూ ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం లక్ష్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడమేనని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ వినియోగించాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీ వై. మొగిలయ్య , గద్వాల్ టౌన్ సిఐ టంగుటూరి శ్రీను, గద్వాల పట్టణ ఎస్సైలు సతీష్ జహంగీర్ లు, ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు, సిబ్బంది మరియు పోలీసు అధికారులు పాల్గొని వాహనదారులకు అవగాహన కల్పించారు.