అరాచక శక్తులకు మద్దతిచ్చిన గుజరాత్ ప్రభుత్వ చర్యను దేశవ్యాప్తంగా నిరసించాలి
బిల్ కిస్ భానో అత్యాచార కేసులో సర్వోన్నత న్యాయస్థాన తీర్పును గుజరాత్ కేంద్ర ప్రభుత్వాలకు చెంపపెట్టుగా ఎలు గెత్తి చాటాలి.
కోర్టుల విషయంలో ప్రభుత్వాల అనుచిత జోక్యాన్ని తీవ్రంగా ఖండించాలి.
--- వడ్డేపల్లి మల్లేశం
గోద్ర మత ఘర్షణల మారణ హోమం అనంతరం బిల్కిస్ భానో సామూహిక అత్యాచారం హత్యల పర్వం భారతదేశంలో నిస్సహాయులకు రక్షణ లేదని తేల్చినా, పాలకుల ఉత్సాహం స్వార్థ ప్రయోజనాలను న్యాయపాలిక తిప్పి కొట్టి నేరస్తులకు తగు శిక్ష తిరిగి ఖరారు చేసిన సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును పౌర సమాజం యావత్తు హర్షించాలి. ప్రభుత్వ ,అరాచక శక్తుల ధమననీతిని నిరంతరం ఖండిస్తూనే ఉండాలి. 2002లో గుజరాత్లో గోద్ర రైలు ప్రయాణంలో జరిగిన మారణకాండ ఆ తదనంతరం దాన్ని సాకుగా చూపి ముస్లిం వర్గాల పైన ఎక్కడికక్కడ హత్యలు అరాచకాలకు పరాకాష్టగా బిల్ కిస్ భానో ఉదాంతాన్ని చెప్పుకోవచ్చు. రోజుల తరబడి నిరంతరం సాగుతున్న అత్యాచారాలు హత్యల నుండి రక్షించుకోవడానికి రందికపూర్ కు చెందిన గర్భిణీ బిల్కీస్ భానో కుటుంబ సభ్యులు పరిగెడుతుంటే పసి పాపతో సహా ఏడుగురిని హత్య చేయడంతో పాటు ఐదు నెలల గర్భవతినీ అత్యాచారం చేసి మారణకాండ సృష్టించిన ఆగంతకులకు మరణశిక్ష పడాల్సింది పోయి అరకొ రగా శిక్షలు ఖరారైనా గుజరాత్ ప్రభుత్వ సహకారంతో నిర్దోషులని తేల్చిన అతి హీనమైన సన్నివేశాన్ని విమర్శించకుండా ఉండలేము. ఐదు నెలల గర్భినీ నని దయతో వదిలివేయాలని కోరినా కరుణించకపోగా సామూహిక అత్యాచారానికి పాల్పడి చనిపోయిందనుకొని వదిలేసిన సంఘటన, రక్తపు ముద్దగా మారిన దయనీయ స్థితి మానవ మృగాల కర్కషత్వానికి పరాకాస్టగా మారితే బిల్కస్ భానో నిరంతర పోరాటం అనేక మలుపులు తిరిగి చరిత్రత్మక తీర్పు ప్రజలను ఆలోచింపచేసినందుకు సర్వత్ర హర్షం వ్యర్థమవుతున్నది.
కొన్ని సంఘటనలను పరిశీలిస్తే:-
2002 మార్చి 3 తేదీన బిల్ కిస్ భానో పై అత్యాచారము కుటుంబ సభ్యులను ఏడుగురిని హత్య చేయడంతో పాటు 11 మంది ఆ దుర్ఘటనలో చనిపోయినట్లు తెలుస్తుంది. దోషులుగా తేలినటువంటి 11 మందికి 2008లో బాంబే ట్రయల్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించగా బాంబే హైకోర్టు 2017లో ఖరారు చేసినట్లు తెలుస్తుంది. 2019లో సుప్రీంకోర్టు 50 లక్షల న ష్టపరిహారాన్ని బిల్కీస్ భానుకు ఇవ్వాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ అనంతర విచారణను కొనసాగించింది. 2008 నుండి 14 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన అనంతరం 2022 ఆగస్టు 15వ తేదీన ఆగంతకులను విడుదల చేయడంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషించినా అప్రతిష్టను మూట కట్టుకోవడమే కాదు సుప్రీంకోర్టు చివాట్లకు తలవంచక తప్పలేదు. ఈ కేసు పైన విచారణ జరిపింది మహారాష్ట్ర హైకోర్టు అయితే ఒకవేళ శిక్ష కాల పరిమితిని తగ్గించడానికి ఆ రాష్ట్రానికి మాత్రమే అవకాశం ఉంటుందని కానీ దానికి భిన్నంగా గుజరాత్ ప్రభుత్వం లేని అధికారాన్ని వినియోగించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సిఫారసు చేయడాన్ని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో మందలించింది.
2022లో విడుదలైన తర్వాత ఆ 11 మంది యొక్క విడుదలను రద్దు చేయాలని అదే నెలలో 6000 మంది సామాజిక కార్యకర్తలు పౌరులు సుప్రీంకోర్టును అభ్యర్థించగా, 134 మంది ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు ఈ దురాగతాన్ని ఖండిస్తూ తగిన చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టుకు లేఖ రాసినట్లుగా తెలుస్తున్నది . ఈ విడుదల పైన దాఖలైన పిటిషన్లను వి చారించిన సుప్రీంకోర్టు మరో ధర్మాసనం 2023లో ఏ అధికారంతో గుజరాత్ ప్రభుత్వం శిక్ష కాలాన్ని తగ్గిస్తూ విడుదలకు సిఫారసు చేసిందని సూటిగా నిలదీసిన సుప్రీంకోర్టు దిద్దుబాటు చర్యలలో భాగంగా 2024 జనవరి 8వ తేదీన జస్టిస్ నాగరత్నమ్మ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గార్లతో ఏర్పడిన సుప్రీంకోర్టు బెంచ్ గుజరాత్ ప్రభుత్వ చర్యను ఖండిస్తూ తిరిగి యావజ్జీవ శిక్షను కొనసాగిస్తూ రెండు వారాల లోపల అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించడం ద్వారా ప్రభుత్వ అండ అక్రమార్కుల దుశ్చర్యలు శాశ్వతం కాదని న్యాయవ్యవస్థ మానవతా దృక్పథంతో పరిశీలిస్తే తనకున్న అధికారాన్ని ఉపయోగించగలిగితే అభాగ్యులకు న్యాయం నేరస్తులకు శిక్ష పడుతుందని భరోసా ఇవ్వడానికి కొంతవరకైనా ఈ తీర్పు ఉపయోగపడుతుంది.
విడుదలకు నియమించిన గుజరాత్ ప్రభుత్వ కమిటీ, విడుదల సందర్భంలో చేసిన హంగామా:-
బిల్కిస్ బానో కేసులో నేరస్తులైన 11 మందిని విడుదల చేయించడం కొరకు బిజెపి గుజరాత్ ప్రభుత్వం నెలకొల్పిన కమిటీలో బిజెపి శాసనసభ్యులతో పాటు ఇతరులు అత్యాచారం కేసులో శిక్ష పడిన వారిని వెనుకేసుకు రావడంతో పాటు వాళ్లంతా సంస్కారవంతులని కితాబు ఇవ్వడం, వారందరికీ జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించడం, ఆ మేరకు సుప్రీంకోర్టు విడుదల చేయడం చకచకా సాగింది. విడుదలైన వారి కాళ్లకు దండాలు పెట్టి, మెడలో పూల దండలు వేసి, చూడడానికి వచ్చిన వాళ్లకు మిఠాయిలు పంచి నానా హంగామా సృష్టించిన తీరు అక్రమార్కులకే ప్రభుత్వం ఏ రకంగా అండగా ఉన్నదో ఈ ఉదంతo తెలియజేస్తున్నది. స్వతంత్ర పోరాటం చేసి జైలు నుండి వచ్చిన వారికి చేసినట్టు సన్మానాలు సత్కారాలు ఏమిటని శివసేన నిలదీయడంతోపాటు దేశవ్యాప్తంగా కొందరైనా స్పందించిన తీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టుగా భావించాలి.
విచారణ లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం సంకుచిత రాజకీయ ధోరణితో తీసుకున్న నిర్ణయం న్యాయ వ్యవస్థ పై ఎంత ప్రభావం పడిందో ఈ సంఘటన మనకు తెలియజేస్తున్నది. 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ శిక్ష తగ్గింపు విధానాన్ని ప్రకటించినప్పటికీ ఆ విధానానికి భిన్నంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని నిలదీసిన సుప్రీంకోర్టు తిరిగి యావత్ జీవ శిక్ష కొనసాగించాలని తీర్పు ఇవ్వడం అన్ని వర్గాలకు అన్ని శాఖలకు గుణపాఠం కావాలి. వ్యవస్థ పట్ల సామాన్య ప్రజానీకానికి విశ్వాసం పెరగడానికి ఈ తీర్పు దోహదపడగా, అక్రమార్కులను ఎంతకైనా తెగించి రక్షించడానికి పాలకవర్గాలు సిద్ధంగా ఉంటాయనే కుట్రపూరిత వైఖరి ఈ సంఘటనతో బయటపడింది. 2022 ఆగస్టు 15న విడుదలైన 11 మంది నేరస్తులు గుజరాత్ లోని దాహోదు జిల్లాలోని రందిక్ పూర్ సింగ్ వాద్ గ్రామాలకు చెందిన వ్యక్తులు ఇంటికి తాళాలు వేసి తప్పించుకు వెళ్లినట్లు స్థానికులు చెబుతుంటే సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఏకైక వ్యక్తి " నేరస్తులను ఉరితీయాలి లేదంటే జీవితాంతం జైల్లోనే ఉంచాలి*" అని నినదించడం న్యాయవ్యవస్థకు పాలకవర్గాలకు కూడా సవాల్ విసిరినట్టుగా భావించవలసి ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కారణాలు సందర్భాలను చూపకుండా మరణశిక్ష యావజీవ శిక్షల్ని తగ్గించే అధికారాన్ని ప్రభుత్వానికి అప్పగించే క్రిమినల్ చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుచిత అసంబద్ధ నిర్ణయాలను చట్టబద్ధం చేసే ప్రమాదం ఉన్నదని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేయడాన్నీ కూడా మనం గమనించాలి. నేరానికి తగిన శిక్ష, ప్రభుత్వాలు నేరస్తులకు వంత పాడితే గుణపాఠం ఎప్పుడైనా అవసరం. కటిన శిక్షలు లేని సమాజంలో అరాచక శక్తులను నేరగాళ్లను అత్యాచారాలు హత్యలను పురీ కొల్పే అపరాధులకు పట్టపగ్గాలు ఉండవు. ఆ దుస్థితిని ఊహించడమే అత్యంత ప్రమాదకరం . సమకాలీన అంశాలు సంఘటనల పట్ల సమాజం ఎప్పటికప్పుడు స్పందించాలి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడంతో పాటు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను కూడా సమర్థించడం ద్వారా న్యాయ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత కూడా పౌర సమాజానిదే.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత. (choutapally)హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)