అయిజలో అక్రమ ఎర్ర మట్టి మాఫియా దందా

Jun 3, 2026 - 19:58
 0  1
అయిజలో అక్రమ ఎర్ర మట్టి మాఫియా దందా
అయిజలో అక్రమ ఎర్ర మట్టి మాఫియా దందా
అయిజలో అక్రమ ఎర్ర మట్టి మాఫియా దందా

 అర్ధరాత్రి టిప్పర్ అలికిడికి కల్వర్టు ధ్వంసం.

జోగులాంబ గద్వాల 3 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : అయిజ. పురపాలక సంఘ పరిధిలో అక్రమ ఎర్రమట్టి మాఫియా దందా రోజురోజుకూ హద్దు అదుపు లేకుండా జోరందుకుంటోంది. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి వేళల్లో నడుస్తున్న ఈ ఎర్ర మట్టి రవాణా వాహనాలు కేవలం ప్రధాన రహదారులకే పరిమితం కాకుండా, ప్రస్తుతం పట్టణంలోని అంతర్గత వీధుల్లోకి (గల్లీల్లోకి) సైతం చొరబడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి అయిజ పట్టణంలోని ఎస్సీ కాలనీ (4వ వార్డు ఎస్సీ కాలనీ) వీధిలోకి భారీ ఎర్రమట్టి లోడుతో వచ్చిన ఒక భారీ రవాణా వాహనం (టిప్పర్) ఒక్కసారిగా దూసుకురావడంతో, అక్కడి కల్వర్టు పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా, వాహనం తగలడం వల్ల పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో రాత్రి వేళ కావడంతో వీధుల్లో జనాలు ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే కల్వర్టు పూర్తిగా కూలిపోవడంతో ఆ వీధిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న అయిజ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కల్వర్టు ధ్వంసానికి కారణమైన సదరు వాహనంపై కేసు నమోదు చేస్తామని, అలాగే సదరు యజమానితోనే తిరిగి కల్వర్టును పూర్తి స్థాయిలో నిర్మాణం చేయించే బాధ్యత తనదని కాలనీవాసులకు గట్టి హామీ ఇచ్చారు. ఎస్ఐ ఇచ్చిన నమ్మకంతో స్థానికులు ఆ వాహనాన్ని అక్కడి నుండి కదలనిచ్చారు. పట్టణంలో ఇలాంటి అనుమతులు లేని వందలాది వాహనాలు పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా తిరుగుతున్నా మైనింగ్, మున్సిపల్ మరియు ఉన్నతాధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఈ ఎర్ర మట్టి మాఫియాను అరికట్టే నాథుడే కరువవ్వడం అయిజ పట్టణ ప్రజల దురదృష్టకరమని స్థానికులు మండిపడుతున్నారు. ఈ అక్రమ రవాణా వల్ల భవిష్యత్తులో ఇంకెన్ని ప్రాణాలు పోతాయో, ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అయిజలో అక్రమ మట్టి దందాను పూర్తిగా అరికట్టాలని పట్టణ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333