అనంతపురం గుట్టలు వద్దు.. పట్టణంలోనే కోర్టు కావాలి.
➖ జిల్లా కలెక్టర్‌కు బీజేపీ వినతి
జోగులాంబ గద్వాల 11 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా కోర్టు సముదాయాన్ని అనంతపురం గుట్టల వద్ద నిర్మించకుండా, ప్రజలకు అందుబాటులో ఉండే గద్వాల పట్టణ సమీపంలో ఏర్పాటు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా శాఖ గురువారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించింది.
ఈ సందర్బంగా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రామాంజనేయులు, పార్టీ సీనియర్ నాయకురాలు డీకే స్మిగ్నారెడ్డి, బండల వెంకట్రాములు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతు... జిల్లా కోర్టు ప్రజలకు సులభంగా చేరుకునే ప్రాంతంలో ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రస్తుతం ప్రతిపాదిత అనంతపురం గుట్టల ప్రాంతం పట్టణానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పాటు భూసమీకరణ, గుట్టల తొలగింపు, లెవెలింగ్ పనుల కోసం అదనంగా రూ 19 కోట్ల భారీ ప్రజాధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో జిల్లా కోర్టు నిర్మాణానికి ఆర్‌డీవో కార్యాలయం పరిసర ప్రాంతం లేదా కేఎల్‌ఐ అతిథి గృహం (గెస్ట్ హౌస్) సమీపంలోని ప్రభుత్వ స్థలం వంటి ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని బీజేపీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు సులభ రాకపోకలు, ప్రభుత్వ కార్యాలయాలకు సమీపం, మరి ముఖ్యంగా భద్రతపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోర్టు సముదాయ నిర్మాణానికి తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. జిల్లా కోర్టు సముదాయం నిర్మాణాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, అయితే అది ప్రజా ప్రయోజనాలు, అందుబాటు, రక్షణ వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని గద్వాల పట్టణ సమీపంలోనే ఏర్పాటు చేయాలన్నదే భారతీయ జనతా పార్టీ డిమాండ్ అన్నారు.
పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు