హిట్లర్ ప్రజల్ని అలాగే “ *బ్రేయిన్ వాష్ చేశాడు

May 6, 2024 - 21:23
 0  20
హిట్లర్ ప్రజల్ని అలాగే “ *బ్రేయిన్ వాష్ చేశాడు

తెలంగాణ వార్త  హిట్లర్ ప్రజల్ని అలాగే “ *బ్రేయిన్ వాష్*” చేశాడు! విద్య, వైజ్ఞానిక, ఆర్థిక, శాస్త్రీయ రంగాల ద్వారా దేశాన్ని అభివృద్ధి పరచటం చేతకానప్పుడు.. ఆ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి వేర్పాటువాద రాజకీయాల్ని నడుపుతూ ఆ దేశ ప్రజల మెదళ్లలో మతోన్మాదపు విషాన్ని నింపేయాలి... దేశంలో మెజారిటీ వర్గ ప్రజల ఓట్లు సంపాదించటానికి మైనారిటీ ప్రజలను ఒక బూచిగా చూపుతూ వారి వల్ల మెజారిటీ ప్రజలు ప్రమాదంలో ఉన్నారంటూ వారి దృష్టిలో ఓ “కల్పిత శత్రువు”ను సృష్టించాలి... నన్ను గెలిపించి నాయకుడిగా ఎన్నుకుంటే తప్ప మైనారిటీ ప్రజల నుండి దేశాన్ని ఎవరూ రక్షించలేరని ఓ కల్పిత భయాన్ని సృష్టించి మెజారిటీ ప్రజలను బ్రేయిన్ వాష్ చేస్తూ ఉండాలి... మెజారిటీ వర్గ ప్రజల దృష్టి దిగజారిపోతున్న ఆర్ధిక వ్యవస్థ మీద, నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వగైరా సమస్యల మీద మరలకుండా ఎంతసేపు మైనారిటీలపై ప్రతీకారాలను రెచ్చగొడుతూ వారిలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టి పరెయ్యాలి... మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే సినిమాల ద్వారా, మీడియా మాధ్యమాల ద్వారా మైనారిటీల పట్ల ద్వేషాన్ని నింపుతూ మెజారిటీ ప్రజల మెదళ్లను ట్యూన్ చేసుకుంటూ రావాలి... చివరకు మా బతుకులు రోడ్డున పడిపోయినా పర్లేదు మా నాయకుడు అధికారంలో ఉంటే మాకంతేచాలన్నంతగా ప్రజల మెదళ్లను బ్రెయిన్ వాష్ చేసి పరెయ్యాలి... ఇదే ఒకప్పుడు “హిట్లర్” సక్సస్ ఫుల్ గా అమలు చేసిన పోలిటికల్ స్ట్రాటజీ! *** జర్మనీ పూర్తిగా నాశనం అయ్యేవరకు పాపం జర్మన్ ప్రజలు “హిట్లర్ ను దేశం కోసం ధర్మం కోసం పని చేసే గొప్ప సుప్రీం లీడర్” అనే భ్రమలోనే ఉండేవారు! కాదు, ఆ విధంగా బ్రేయిన్ వాష్ చెయ్యబడేవారని చెప్పాలి. ‘నాగుపాము రక్షణ కోసం పుట్టను కట్టేది చీమలే’ అన్నట్టు హిట్లర్ చేసే తప్పుల్ని, నష్టాల్ని కప్పిపుచ్చటానికి, హిట్లర్ చెప్పే అబద్ధాలను నిజాలన్నట్లు ప్రచారం చెయ్యటానికి వాడికంటూ స్వతహాగా గుడ్డిగా అభిమానించే ‘అంధభక్తుల టీం’ కూడా ఉండేది. దేశపు మీడియాను కూడా తన కంట్రోల్లో పెట్టుకునేవాడు. చెప్పేది ఎంత పెద్ద అబద్ధమైనా దానిని పదే పదే ప్రచారం చేస్తూ ఉంటే అదే చివరకు నిజమైపోతుందన్నది హిట్లర్ వాడిన ప్రధాన స్ట్రాటజీ. హిట్లర్ నిత్యం “మీరు దేశాన్ని ప్రేమించేవారైతే నాకు ఓటెయ్యండి, నాకు ఓటు వెయ్యనివాడు దేశద్రోహి” లాంటి ఎమోషనల్ డైలాగ్స్ తో ప్రజల భావోద్రేగాలను రెచ్చగొట్టేవాడు. తాను ఓ డిక్టేటర్ గా మారి ప్రజలను తన చెప్పుచేతల్లో పెట్టుకోటానికి ప్రజల లాజికల్ మైండ్ ను పూర్తిగా నాశనం చేసి పరేశాడు. ప్రజలు చరిత్ర వల్ల, గొప్ప చరిత్రకారుల వల్ల ఎక్కడ తెలివైనవారిగా మారిపోతారో అన్న భయంతో నాజీ పార్టీ అఫిషియల్స్ ద్వారా 10 మే 1933 న అక్షరాల 25 వేల పుస్తకాలను కాల్పించేశాడు. కాల్చివెయ్యబడ్డ ఆ పుస్తకాలన్నీ మార్క్సిజం, లిబరిజం, ప్రజాస్వామ్యం, సైకాలజీ, వివిధ కళలపై రాయబడ్డవే. ఆ పుస్తకాలన్నిటినీ కాల్చేయటానికి కారణం హిట్లర్ ఆ పుస్తకాలన్నిటినీ “యాంటీ-నేషనల్” పుస్తకాలుగా గుర్తించటమేనట! యూనివర్శిటీ పాఠాల ద్వారా ప్రజలు మరీ తెలివైనవారిగా మారిపోకుండా పనికొచ్చే పాఠ్యాంశాలను తొలగించేసి తమ భావజాలానికి తగ్గ సబ్జెక్టులనే నాజీ పార్టీ అఫిషియల్స్ యూనివర్శిటీ పాఠ్యాంశాలలో చేర్చేవారు. తమ భావజాలాన్ని నేర్పే అధ్యాపకులను బోధకులుగా నియమించటం జరిగేది. పైగా హిట్లర్ స్వంతంగా తనకు తోచిన సైన్స్ చెప్పుకొచ్చేవాడు. విశ్వం మొత్తం ఐసుతో తయారైందని చెబుతూ “వరల్డ్ ఐస్ థియరీ” అని పేరు పెట్టి ప్రచారం చేసేవాడు. పైగా ఈ దిక్కుమాలిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు ‘హన్స్ హోర్బిగర్’ అనే మూర్ఖుడికి నాజీ ప్రభుత్వం డాక్టరేట్ సైతం ప్రదానం చెయ్యటం జరిగింది! చివరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగి జర్మనీ నష్టపోవటానికి, ఆర్థిక స్థితి దిగజారిపోవటానికి జర్మనీలో మైనారిటీలుగా బతుకుతున్న యూదులే కారణం అని హిట్లర్ అంధభక్తుల సమూహం ప్రచారాలు చేసేది. నిజానికి ఆ ప్రచారం ఎంత అబద్ధం అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్లతో కలిసిపోరాడిన వారిలో యూదులు లక్షకు పైగా ఉన్నారు. పైగా 12 వేల మంది యూదులు ప్రాణాలు సైతం అర్పించేశారు కూడా! కానీ, హిట్లర్ అంధభక్తుల టీం చేసిన అబద్ధ ప్రచారాల వల్ల అచ్చం భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ప్రాణాలు అర్పించేసిన ముస్లిముల్ని మర్చిపోయినట్టే నాటి జర్మన్లు యూదుల త్యాగాలను మర్చిపోయి వారిని దేశద్రోహులుగా ముద్రవేయటం జరిగింది. హిట్లర్ మైనారిటీలైన యూదుల వల్ల జర్మన్లు ప్రమాదంలో ఉన్నారని, వారిని తమ దేశం నుండి తరిమెయ్యాలని, వారు దేశానికి ప్రమాదకారులని, చూస్తూ ఉరుకుంటే వారు కొన్నాళ్లకు జర్మనీని యూద దేశంగా మార్చేస్తారని ఫాల్స్ ప్రోపగాండా చేయిస్తూ ఉండేవాడు. మీడియా సైతం అదే చూపుతూ ఉండేది. హిట్లర్ సృష్టించిన ఈ అబద్ధాలను మీడియా ద్వారా మాటిమాటికి ప్రచారం చెయ్యటం వల్ల, ఆ ఆబద్ధాలనే పత్రికల్లో రాయటంతో వల్ల సామాన్య ప్రజలు కూడా నిజమని నమ్మేసేవారు. పైగా మైనారిటీలైన యూదులు దేశానికి ప్రమాదకారులు, జర్మన్ వ్యతిరేకులు అన్నట్టు హిట్లర్ అంధభక్తుల టీం ద్వారా మీడియాలో అనేక కార్టూన్లు చిత్రిస్తూ ఫాల్స్ ప్రోపగాండా చేస్తూ ఉండేది. చివరకు మైనారిటీలను హింసించటం, చంపటంలో తప్పే లేదన్నంతగా తన అంధ భక్తుల మెదళ్లలో హిట్లర్ ఎంతో చాకచక్యంగా విషాన్ని నింపుకుంటూ వచ్చాడు. జర్మన్లను కాపాడగలిగే ఏకైక ‘సుప్రీం లీడర్’ ఒక్క హిట్లరే అని అతని అంధభక్తులు నిత్యం ప్రచారం చేస్తూ ఉండేవారు. ప్రజల సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోటానికి హిట్లర్ తన ఆటోబయోగ్రఫీలో ‘తాను చిన్నతనంలో ల్యాబర్ పని చేసుకుని బ్రతికేవాడినని, అత్యంత బీదరికంలో పెరిగాన’ని రాసుకొచ్చాడు. తరువాత కాలంలో అదంతా అబద్ధమని అతను చిన్నతనంలో అసలు ల్యాబర్ పనే చెయ్యలేదని తేలిపోయింది! హిట్లర్ తన ప్రభూత్వాన్ని నడపటానికి, మీడియాను తన చెప్పు చేతల్లో ఉంచుకోటానికి కార్పొరేట్ సంస్థలను తన కంట్రోల్లో పెట్టుకుని వారి ద్వారా పార్టీ ఫండ్ వసూలు చేసేవాడు. వోక్స్ వేగన్, కొడాక్, ఐ.బి.యం, సీమెన్స్, ఫాంట, ఫోర్డ్ లాంటి ఎన్నో కార్పొరేట్ కంపెనీలు హిట్లర్ కోసం పార్టీ ఫండ్ ఇస్తూ ఉండేవి. ఆయా కార్పొరేట్ కంపెనీల యజమానులతో హిట్లర్ గట్టి స్నేహాన్ని నడుపుతూ ఉండేవాడు. నాజీ పార్టీ యొక్క ఉన్మాద భావజాలాన్ని ప్రజల్లో సర్వసామాన్యం చెయ్యటానికి హిట్లర్ వాడిన ప్రధానమైన సాధనాలు మీడియా మొదటిదైతే, రెండవది సినిమా రంగం. దాని కోసం తనకు కుడి భుజంగా ఉన్న ‘జోసెఫ్ గోబెల్స్’ ఆధ్వర్యంలో ఒక మంత్రిత్వ శాఖను సైతం రూపొందించాడు. దేశంలో మెజారిటీ ప్రజలను తన గుడ్డి భక్తులుగా మార్చుకుని, రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోటానికీ, మైనార్టీ ప్రజలను దేశద్రోహులుగా, దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ వారి వల్ల మెజారిటీ ప్రజలు ప్రమాదంలో ఉన్నారని ప్రజల్లో మైనారిటీల పట్ల విద్వేషాన్ని రెచ్చగొడుతూ “ప్రోపగాండా సినిమాలు” తీసే ఆచారాన్ని చరిత్రలో మొట్టమొదట ప్రారంభించింది ఎవరో కాదు- హిట్లరే! మెజారిటీ ప్రజలైన జర్మన్లలో, మైనారిటీలైన యూదుల పట్ల విద్వేషాన్ని రెచ్చగొడుతూ, జర్మన్లను బ్రేయిన్ వాష్ చెయ్యటం కోసం కల్పిత కథలను రాయించి యూదులను క్రూరులుగా, దౌర్జన్యపరుగా చిత్రీకరిస్తూ “ద ఎటర్నల్ జ్యూ”, “జ్యూడ్ సుస్” వగైరా ప్రోపగాండా సినిమాలను హిట్లర్ తీయించేవాడు. ఈ సినిమాల ద్వారా యూదులను కనీసం మనుషులన్నట్టు చూపకుండా వారి పట్ల జర్మన్ ప్రజల మెదళ్లలో విపరీతమైన విద్వేషాన్ని నింపేసేవాడు. జర్మనీలో వేలాది యూదులను సామూహికంగా జెనోసైడ్ చెయ్యటానికి ముందు వరకు కూడా ఈ సినిమాలను ప్రదర్శింపజేస్తూ జర్మన్ ప్రజలలో విపరీతమైన ద్వేషాన్ని రగిలించటానికి సాధనాలుగా వాడుకున్నాడు. బ్రతికినన్నాళ్లూ అబద్ధాలతో మెజారిటీ ప్రజలను “బ్రేయిన్ వాష్” చేస్తూ వచ్చి తన రాజకీయ అధికారాన్ని కాపాడుకుని హిట్లర్ చివరికి *రష్యా ఎర్ర సైన్యం చేతిలో ఓడిపోయి పిరికి వాడిలా ఆత్మ హత్య చేసుకుని చనిపోయినప్పటికీ*.. ఆ స్ట్రాటజీ మటుకు ఇంకా అంతరించిపోలేదనే చెప్పాలి. తమ రాజకీయ అధికారాన్ని కాపాడుకోవాలనుకునే స్వార్థపరులైన రాజకీయ నాయకులు దానిని వాడుకుంటూనే ఉన్నారు. ఈ రకమైన పొలిటికల్ స్ట్రాటజీతో ప్రస్తుతం ఎవరు తన అధికారాన్ని కాపాడుకుంటూ వస్తున్నారో, తిరిగి పొందాలనుకుంటున్నారో ఆలోచనా పరులకు ఆ పేరును వేరేగా చెప్పనవసరం లేదు. *బహుజన... బంధువు. ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్*