వెంకటాపురం వాజేడు ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం.
పల్లపు ప్రాంతాలు జలమయం.
ములుగు జిల్లా బ్యూరో
సెప్టెంబర్ 26 ( తెలంగాణ వార్త):
వెంకటాపురం,వాజేడు మండలాల్లో శనివారం సాయంత్రం ప్రచండ వేగంతో వీచిన గాలులతో పాటు, దిక్కులు పిక్క టిల్లే విధంగా, ప్రళయ గర్జనలతో భారీ వర్షంతో, పిడుగులు పడ్డాయి. కుంభ వర్షం కారణంగా పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మారుమూల అటవీ గ్రామాలలో , అటవీ ప్రాంతాల్లో పిడుగులు పడ్డట్లు సమాచారం. గత రెండు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా, వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. దీంతో ఖరీఫ్ వరి పొలాలు కు కురుస్తున్న వర్షాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ప్రధాన వాణిజ్య మిర్చి పంట వేసేందుకు రైతులు గోదావరి లంక భూములలో దుక్కులు చేసి మిర్చి మొక్కలను నాటే ప్రయత్నంలో ఉండగా, భారీ వర్షం కారణంగా దుక్కులు వర్షపు నీటిని తాగి భూములలో తేమ శాతం పెంచేందుకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు తెలిపారు. మబ్బులు కమ్మిన ఆకాశం వర్ష సూచనలతో ఈ ప్రాంతంలో తుఫాను వాతావరణం నెలకొంది .భారీ వర్షాలు కారణంగా విద్యుత్ సరఫరాకు తరుచూ అంతరాయం ఏర్ఫడుతున్నది.