రాష్ట్రంలో భారీగా పెరిగిన డెంగీ కేసులు.. రెండున్నర లక్షల మందికి జ్వరాలు

Aug 26, 2024 - 20:17
 0  1
రాష్ట్రంలో భారీగా పెరిగిన డెంగీ కేసులు.. రెండున్నర లక్షల మందికి జ్వరాలు

తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో డెంగీ కేసులు దడ పుట్టిస్తున్నాయి. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా పది జిల్లాల్లో డెంగీ హైరిస్క్‌గా గుర్తించారు.

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 21 వరకు 66,589 శాంపిళ్లను టెస్టులు చేయగా.. 4,648 కేసులు నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. పాజిటివిటీ 7 శాతం చొప్పున నమోదైంది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 1,697 కేసులు తేలగా, సూర్యపేటలో 416, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 405, ఖమ్మంలో 346, నల్లగొండలో 322, నిజామాబాద్‌లో 243, రంగారెడ్డిలో 222, జగిత్యాలలో 147, సంగారెడ్డిలో 115, వరంగల్‌లో 102 కేసులు చొప్పున నిర్ధారణ అయినట్లు పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ పేర్కొన్నది. ఈ జిల్లాల్లోనే డెంగీ అత్యధిక స్పీడ్ తో స్ప్రెడ్ అవుతున్నట్లు వివరించింది. 

లెక్కల్లో తేడాలు.. 

గతేడాదితో పోల్చితే ఈ సీజన్‌లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్ వివరాలు ప్రకారం.. రాష్ట్రంలో గత ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 వరకు 3,861 డెంగీ కేసులు నమోదవగా, ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 వరకు 5,246 కేసులు నిర్ధారణ అయ్యాయి. గతేడాది కంటే 34 శాతం కేసుల్లో పెరుగుదల ఉన్నట్లు ఈ పోర్టల్‌లో ఎంట్రీ చేశారు. కానీ.. వైద్యారోగ్యశాఖ తాజాగా ప్రకటించిన లెక్కల్లో 4,648 కేసులే ఉన్నట్టు చూపించారు. ఇక కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో డెంగీ కేసులు, డెత్‌లను వైద్యారోగ్యశాఖ గుర్తించలేకపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అనధికారికంగా రెట్టింపు స్థాయిలో డెంగీ కేసులు ఉంటాయని స్వయంగా వైద్యాధికారులే ఆఫ్ది రికార్డులో చెప్పడం గమనార్హం. సీజనల్ సమయంలో ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడంలో వైద్యాధికారులు విఫలమయ్యారని, ఎలాంటి యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయలేదని, అందుకే డెంగీ అవుట్ బ్రేక్‌కు దారితీసే పరిస్థితులు వచ్చాయని పబ్లిక్ హెల్త్ విభాగంలోని ఓ అధికారి ఆఫ్ది రికార్డులో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 

మూడు జిల్లాలకు చికున్ గున్యా రిస్క్ 

మరోవైపు హైదరాబాద్, వనపర్తి, మహబూబ్‌నగర్‌లో చికున్ గున్యా రిస్క్ జిల్లాలుగా గుర్తించారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 44 కేసులు తేలగా, వనపర్తిలో 17, మహబూబ్‌నగర్‌లో 14 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,036 శాంపిళ్లను పరీక్షించగా, 106 చికున్ గున్యా పాజిటివ్ కేసులు తేలాయని వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతున్నది. ఇప్పటివరకు 1,27,49,028 ఇళ్లలో జ్వర సర్వే నిర్వహించగా, 2,45,111 బాధితులను గుర్తించామని వైద్యశాఖ చెబుతున్నది. ఇందులో కేవలం 188 మాత్రమే మలేరియా కేసులు ఉన్నట్లు డిపార్ట్‌మెంట్ తన రికార్డుల్లో ఎంట్రీ చేసుకున్నది. కానీ.. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మాత్రం ప్రతి పది ఇళ్లలో నాలుగు ఇళ్ల చొప్పున జ్వర బాధితులు తేలుతున్నారు. ఏజెన్సీ ఏరియాలో ఇంటికొకరు మంచనా పడ్డారు. 

రాష్ట్రంలో మంకీ పాక్స్ నిల్ 

రాష్ట్రంలో మంకీ పాక్స్ కేసులు ఇప్పటివరకు నమోదు కాలేదని డీహెచ్ డాక్టర్ రవీంద్ర నాయక్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్తగా గాంధీ ఆసుపత్రిని మంకీ పాక్స్ నోడల్ సెంటర్‌గా సిద్ధం చేశామని తెలిపారు. ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయన్నారు. కేసులు పెరిగిన ప్రాంతాల్లో కలెక్టర్లు విజిట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333