రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో యువజన కమీషన్ ను ఏర్పాటు చేసి వేయి కోట్ల గ్రాంట్ ను మంజూరు చేయాలి ఏఐవైఎఫ్
అడ్డగూడూరు 10 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని,రాష్ట్ర ప్రభుత్వం యువజన కమీషన్ ను ఏర్పాటు చేసి,1000కోట్ల గ్రాంట్ ను మంజూరు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లంకి మహేష్, పేరబొయిన మహేందర్ అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య అడ్డగూడూర్ మండల విసృత స్థాయి సమావేశం బెల్లి శ్రీకాంత్ అద్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లంకి మహేష్,పేరబొయిన మహేందర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రచారార్భాటాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఉద్యోగాల భర్తీపై లేదన్న విమర్శలు వస్తున్నాయన్నారు. పేరుకు మాత్రమే జాబ్ క్యాలెండరు ప్రకటించిందని వారు విమర్శించారు.యూత్ డిక్లరేషన్లో జాబ్ క్యాలెండర్తోపాటు నిరుద్యోగ భృతి రూ4వేలు ఇస్తామని ప్రకటించిందని, విద్య,ఉపాధి కల్పనకు యూత్ కమిషన్ను ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు.యూత్ కమిషను వెంటనే ఏర్పాటు చేయాలని, ఆ కమీషన్ కు1000కోట్ల గ్రాంట్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రాయితీలతో నెలకొల్సిన పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేయాలన్నారు.కోర్టు వివాదాలు, న్యాయ వివాదాలు లేకుండా ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. హామీలను అమలు చేయాలని ప్రశ్నించే నిరుద్యోగులపై బీఆర్ఎస్ తరహాలోనే నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని మానుకోవాలి లేదంటే యువత ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని అన్నారు.సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చేడె చంద్రయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందన్నారు. ఏడాదిలో 55,143 ఉద్యోగాలను మాత్రమే రేవంత్ ప్రభుత్వం భర్తీ చేసిందని, రాష్ట్రంలో 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ 40వేల ఉద్యోగాల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు విడుదలయ్యాయన్నారు. అటు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. హమీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులున్నా నియామకాలను మాత్రం చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. పాలకులు అనుసరిస్తున్న తీరుపై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.అనంతరం భగత్ సింగ్ 94వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోష్టరావిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎండీ నహీమ్ ,జిల్లా కోశాధికారి మొగుళ్ల శేఖర్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి రేపాక శ్రీనివాస్,సుంకరబొయిన విజయ్,చేడె నగేష్,చేడె శ్రావణ్,చేడె కిశోర్,చల్ల శివ కుమార్,జటింగ్ గణేష్,కుంభం సంతోష్, బాషబొయిన మల్లేష్ వడ్డెపల్లి రవి, చిప్పలపల్లి మొగులయ్య,దొండ శివ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.