నో ఐడీ.. నో ఐడెంటిటీ
తెలంగాణ : రాష్ట్రంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమై ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గ్రామాలకు చెందిన వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) నమోదు చేసుకోని రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి నమోదు చేసే పరిస్థితి నెలకొంది.
ఫార్మర్ ఐడీ లేకుంటే యూరియా కొనుగోలు, పంటల కొనుగోలు వంటి కీలక వ్యవహారాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫార్మర్ ఐడీ ప్రక్రియ ప్రారంభమై సంవత్సరం గడిచినా ఇప్పటివరకు కేవలం 71 శాతం మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఏఈవోలతో పాటు మీ సేవా కేంద్రాల ద్వారా కూడా నమోదు అవకాశాలు కల్పించినప్పటికీ కొంతమంది రైతులు ముందుకు రావడం లేదు. పీఎం కిసాన్ వంటి కేంద్ర పథకాలు అందకపోతేనే రైతులు వ్యవసాయ శాఖ అధికారులను ఆశ్రయిస్తూ, తమకు పథకాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఫార్మర్ ఐడీ లేకుండా పథకాలు అందవని తెలుసుకున్న వెంటనే నమోదు చేసుకుంటున్నారు.
గతేడాది ఖరీఫ్ సీజన్‌లో మూడు నెలల పాటు ఈ ప్రక్రియ వేగంగా సాగినా తరువాత ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ఏఈవోలను సంప్రదించేందుకు సమయం లేకపోతే సమీప మీ సేవా కేంద్రాల్లో నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చినా రైతుల స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్రంలో 77.56 లక్షల పట్టాదారు పాస్‌బుక్‌లు ఉండగా ఇప్పటివరకు 55.36 లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇది 71.38 శాతానికి సమానం. వీరిలో 42.26 లక్షల మంది ఏఈవోల ద్వారా, 13.10 లక్షల మంది మీ సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకున్నారు. జిల్లాల వారీగా చూస్తే పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 88.94 శాతం నమోదు కాగా, హన్మకొండలో 83.42 శాతం, ఖమ్మంలో 80.77 శాతం, నిజామాబాద్‌లో 81.56 శాతం, నిర్మల్‌లో 79.55 శాతం, రాజన్న సిరిసిల్లలో 78.43 శాతం, కరీంనగర్‌లో 78.33 శాతం, జనగాంలో 77 శాతం నమోదయ్యాయి. మరోవైపు నారాయణపేట జిల్లాలో 68 శాతం, మెదక్‌లో 65 శాతం, నల్లగొండలో 65.49 శాతం, వికారాబాద్‌లో 60.41 శాతం, మేడ్చల్-మల్కాజిగిరిలో 54.41 శాతం, రంగారెడ్డి జిల్లాలో 54.04 శాతం మాత్రమే నమోదైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
ఆధార్, పాస్‌బుక్ వివరాల్లో తేడాలు
ఆధార్, పాస్‌బుక్ వివరాల తేడాలు ఈ ప్రక్రియలో ప్రధాన అడ్డంకిగా మారాయి. ఆధార్‌లోని పేరు, ఇంటిపేరు, చిరునామా వివరాలు పట్టాదారు పాస్‌బుక్‌లో ఉన్న వాటితో సరిపోకపోవడం వల్ల నమోదు ఆలస్యమవుతోంది. ఒకే ఖాతాలో కుటుంబ సభ్యుల పేర్లు ఉండటం, వారసత్వంగా వచ్చిన భూముల వివరాలు సమయానికి అప్‌డేట్ కాకపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. రైతుల ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ లేకపోవడం, కొంతమంది వద్ద మొబైల్ ఫోన్లు లేకపోవడం, ఓటీపీ సమస్యలు, సర్వర్ లోడ్ సమస్యలు, ఆధార్‌లో బయోమెట్రిక్స్ అప్‌డేట్ కాకపోవడం వంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత సంవత్సరం దరఖాస్తు చేసిన కొంతమంది రైతులకు ఇప్పటికీ ఐడీ కార్డులు అందకపోవడం కూడా అసంతృప్తిని పెంచుతోంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా తక్షణ ప్రభావం కనిపించకపోవడం వల్ల రైతులకు దీని ప్రాముఖ్యత పూర్తిగా అర్థం కావడం లేదు. మీసేవా కేంద్రాల నిర్వాహకులు కూడా బిజీ సమయంలో తక్కువ ఆదాయం వచ్చే ఈ సేవపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పైగా ఓటీపీ, సర్వర్ సమస్యలతో పాటు అన్ని లాగిన్‌లలో ఫార్మర్ రిజిస్ట్రీ ఆప్షన్ కనిపించకపోవడం వంటి కారణాలతో తెలంగాణలో ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.