దొడ్లు వడ్లకు రూ..500 బోనస్ లేదనడం దారుణం: హరీష్
రైతుబంధు డబ్బులను జూన్ నెలలోనే వేయాలి తడిసిన ధాన్యాన్ని మొలకలు రాకముందే కొనుగోలు చేసి తరలించాలి సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం సన్న వడ్లకు మాత్రమే ఇవ్వడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ ప్రకటించిన ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు రైతుబంధు డబ్బులను జూన్ నెలలోనే వేయాలని పేర్కొన్నారు. బకాయి పడిన రూ.2500, వానకాలం పంటల విడత కింద 7500 కలిపి జూన్ లోపల రూ.10 వేలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో యాసంగిలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని, ఆ ధాన్యానికి రూ.500 బోనస్ లేదనటం దారుణమని మండిపడ్డారు. సన్నవడ్లకు బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వాల్సిన పరిస్థితే రాదని తెలిపారు.
తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో లారీల నుంచి ధాన్యం దించే పరిస్థితి లేదని తెలిపారు. లారీ డ్రైవర్లు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జీలుగు, జనుము విత్తనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని మొలకలు రాకముందే కొనుగోలు చేసి తరలించాలని విజ్ఞప్తి చేశారు. రైసు మిల్లర్ల నుంచి కొనుగోలు చేసైనా సన్నబియ్యం ఇవ్వాలని పేర్కొన్నారు. రైతులు దళారులకు వడ్లు అమ్ముకుంటున్నారని, ధాన్యం తడుస్తున్నా కొనుగోళ్లు చేయలేదని అన్నారు. రైతులు చెప్పులు క్యూలైన్లలో పెట్టాల్సిన పరిస్థితులు మళ్లీ వచ్చాయని ఎద్దేవా చేశారు.
వడ్లు కొనడంలో ప్రభుత్వం విఫలం
వడ్లు కొనడంలో ప్రభుత్వం విఫలం చెందిందని,ప్రభుత్వ కొనుగోలు విధానం సరిగ్గా లేదని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వం వడ్లు కొనకపోవడంతో రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీకి అనుగుణంగా అన్ని పంటలను కనీస మద్దతు ధర ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే నిరుద్యోగ భృతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందని విమర్శించారు.
రాబోయే రోజుల్లో పోరాటాన్ని ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. జూన్ నెలలోనే రైతుభరోసా చెల్లింపులు చేయాలని, బకాయిలతో కలిపి ఎకరాకు పదివేల చొప్పున డబ్బులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతుందని.. అన్నింటికి బోనస్ ఇవ్వాలంటే రూ.6 వేల కోట్ల భారం పడుతుందని.. అందుకోసమే సన్న వడ్లను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. సన్నం వడ్లతో రూ.400 కోట్లు మాత్రమే ఖర్చవుతుందన్నారు. యాసంగిలో రైతులు సన్న వడ్లు పండించరని.. పండించని వడ్లకు బోనస్ ఎలా ఇస్తారని నిలదీశారు. బోనస్ ఇవ్వకుండా ఉండేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రకు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు భరోసా కింద ఎకరాకు ప్రభుత్వం రూ.2500 ఇవ్వాల్సి ఉందని.. వానాకాలానికి సంబంధించి ఎకరానికి రూ.15 వేల రైతుబంధు యాసంగి బకాయిలు సైతం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దొడ్డు వడ్లు కొనుగోలు చేస్తారా..? లేదా..? అని ప్రశ్నించారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. వడ్ల బోనస్‌పై కేబినెట్ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని కోరారు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని, ఏ పంటలకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారో ఆ పంటలకు వానకాలం నుంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుబంధుకు కోతలు పెట్టకుండా తక్షణమే రూ.7500 ఇవ్వాలని, వడగళ్ల వాన, అకాల వర్షాల్లో నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలని కోరారు. వానలు పడుతున్నాయి కాబట్టి తడిచిన ధాన్యాన్ని యుద్దప్రాతిపదికన కొనాలని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.