తిరుమలగిరి బస్ డిపో ఏర్పాటు చేయాలి కటుకూరి ఉపేందర్
తిరుమలగిరి 01 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్l- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు కోసం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎవరెస్టు యూత్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి కటుకూరి ఉపేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం కోసం కృషి చేయుటకు అఖిలపక్ష పార్టీలన్నీ ఏకమై సమావేశం నిర్వహించుకోవడం హర్షనీయమని అలాగే తిరుమలగిరి మండలంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు అంతా ఏకమై డిపో నిర్మించే వరకు కృషి చేయాలని తెలిపారు.
తిరుమలగిరి మున్సిపాలిటీలో బస్ డిపో వస్తే మొట్టమొదటగా వ్యాపారస్తులకే లాభం చేకూరుతుందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుందని, తిరుమలగిరిలో 200 నుంచి 300 కుటుంబాలు అదనంగా వచ్చి చేరుతాయని ఉద్యోగస్తులు కార్మికులు తిరుమలగిరిలో స్థిరపడతారని దానివల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. తిరుమలగిరి చుట్టుపక్కల ఉన్న తుంగతుర్తి, నాగారం, అర్వపల్లి, కొడకండ్ల, అడ్డగూడూర్, మోత్కూర్ మండలాల ప్రజలకు, మరియు తుంగతుర్తి నియోజకవర్గంలోని 100 % ప్రజలకు అనుకూలంగా ఉంటుందని, అంతే కాకుండా ఇక్కడ బస్ డిపో నిర్మాణం చేస్తే చుట్టుపక్కల మండలాల ప్రజలంతా ఇక్కడి నుండి ప్రయాణం కొనసాగిస్తారని ప్రతి ఒక్కరికి అనుకూలంగా బస్సులు ఉంటాయని తెలిపారు.
తిరుమలగిరి నుండి ప్రతి 10 నుండి 15 నిమిషాల లో 15 నుంచి 20 మంది ప్రయాణికులు తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరానికి ప్రయాణిస్తున్నారని కాబట్టి డిపో తిరుమలగిరిలోనే వేస్తే బాగుంటుందని ఆర్టీసీ లాభాల్లో నడుస్తుందని అన్నారు. ముఖ్యంగా ఆర్టిసి యాజమాన్యానికి లాభాలు రావాలంటే తిరుమలగిరిలో బస్ డిపో వేస్తేనే లాభాలు వస్తాయి. కానీ కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్టీసీ అధికారులను పక్కదోవ పట్టించి, ఇతర ప్రదేశాల్లో బస్ డిపో వేయాలని చూస్తున్నారని, ఇప్పుడు గనక ఆర్టీసీ అధికారులు లాభాలు రానిచోట బస్ డిపో నిర్మిస్తే ఒక సంవత్సరంలోనే మళ్లీ ఆ డిపో ఎత్తివేయాల్సి ఉంటుందని అది ప్రజలకు ఆర్టీసీ యాజమాన్యానికి లాభం ఉండదని కాబట్టి తిరుమలగిరి లో డిపో వేస్తే ఆర్టీసీకి మరియు ప్రజలకు అందరికీ అనుకూలంగా ఉంటుందని డిపో లాభాల్లో నడుస్తుందని తెలిపారు. గతంలో తిరుమలగిరి లో వేయాల్సిన బస్ డిపోను కొన్ని అనివార్య కారణాల మూలంగా తొర్రూర్ లో వేశారని, ఇప్పుడైనా ప్రభుత్వం, మరియు రాజకీయ నాయకులు, అధికారులు, ఆలోచించి తిరుమలగిరిలో బస్ డిపో నిర్మించాలని అందుకు అవసరమైనటువంటి ల్యాండ్ ను ఆర్టీసీకి చూపించడంలో తిరుమలగిరి ప్రజలు కృషి చేస్తారని అన్నారు.
ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు తిరుమలగిరి అభివృద్ధి కోసం బస్ డిపో ఏర్పాటు చేసేంతవరకు అవిశ్రాంతంగా కృషి చేయాలని కోరారు. ఇందులో భాగంగా ఎవరెస్ట్ యూత్ ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా బస్ డిపో ఏర్పాటు కోసం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.