జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట
పాఠశాలల్లో పిల్లల నమోదు కోసం నిర్వహించే బడిబాట కార్యక్రమం తేదీల్లో మార్పులు చేశారు. కొద్ది రోజుల క్రితం జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు బడిబాట జరుగుతుందని విద్యాశాఖ పేర్కొంది. తాజాగా ఆ కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు జరపాలని నిర్ణయిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 2వ తేదీన ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని 3వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. కాగా ఈ నెల 31న మండలస్థాయి, జూన్ 1న గ్రామ/పాఠశాల స్థాయిలో సన్నద్ధత సమావేశాలు నిర్వహించుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. నీ పాఠశాలల్లో ముఖ్యమైన పనులను జూన్ 10వ తేదీ నాటికి పూర్తిచేయాలి. పుస్తకాలు, ఏకరూప దుస్తులను సిద్ధంగా ఉంచాలి. 11వ తేదీ నాటికి తరగతి గదులను శుభ్రం చేసి.. నీటి సరఫరాను పరిశీలించుకోవాలి. 12వ తేదీన పాఠశాలల పునఃప్రారంభం నాడు తల్లిదండ్రులతో సమావేశాలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని హెచ్‌ఎంలను ఆదేశించారు. పూర్వ విద్యార్థులను అంబాసిడర్లుగా నియమించుకోవాలి. 13వ తేదీన పిల్లలందరూ బడికి రావాలని కోరుతూ రూపొందించిన ఎఫ్‌ఎల్‌ఎన్ పాట (తొలిమెట్టు)ను వినిపించాలి. 14వ తేదీన సామూహిక విద్యాభ్యాసం నిర్వహించాలి.