జానపదాలు పాడుతూ అందరినీ అలరించే తన పాటలు వెండితెరకెక్కి ఇంతటి ఘనత తెచ్చి పెడుతుంది
పుష్ప-2 మూవీలో ఆ పాట పాడింది ఆదిలాబాద్ వాసియే
జానపదాలు పాడుతూ అందరినీ అలరించే తన పాటలు వెండితెరకెక్కి ఇంతటి ఘనత తెచ్చి పెడుతుంది అని కలలో కూడా ఊహించలేదు ఆ మహిళా. నైపుణ్యం ఉంటే అవకాశాలు దానంతట అవే తలుపు తట్టి దరి చేరుస్తాయనేది నిజం.
సినిమా ఇండస్ట్రీలో పుష్ప-2 మూవీ రికార్డు బద్దలు కొడుతున్న విషయం విదితమే. అయితే మూవీలోని ఆరింటికోసారి.. నువ్వు పక్కనుంటే.. ప్రతి ఒక్క సారి వచ్చిందాయి.. ఫీలింగ్.. అనే పాట పాడింది ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన మహిళా కావడం విశేషం.
అంచెలంచెలుగా ఎదుగుతూ...
ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లా ముధోల్ మండలం గన్నోర మారుమూల గ్రామం దాస లక్ష్మణ్, జయశీల దంపతులకు రెండో కుమార్తెగా జన్మించిన లక్ష్మియే ప్రస్తుత సింగర్ లక్ష్మిదాస్. తన చిన్నప్పటి నుండి తల్లి జయశీల పాడే మరాఠి కీర్తనలు, మరాఠి పాటలు అనుకరిస్తూ తెలుగులో ఫోక్ సాంగ్స్ పాడుతుండేది. ప్రతి కార్యక్రమంలో తన వంతుగా పాటలు పాడుతూ అందరిని అలరించేది, యూట్యూబ్లో సాంగ్స్ పాడుతూ కొన్ని మెలకువలు నేర్చుకున్నారు. సాధారణ పేద కుటుంబానికి చెందిన లక్ష్మి హై స్కూల్, ఇంటర్ వరకు ముధోల్ మండలంలోనే చదువుకున్నారు. నిజామాబాద్ లో డిగ్రీ చేశారు . పీజీ పొలిటికల్ సైన్స్ హైదరాబాదులో చదువుకున్నారు.
సింగర్ గా అనేక పాటలు
తల్లి జైశీలను అనుకరిస్తూ పాడిన ఫోక్ సాంగ్స్ అనేక రికార్డులు బద్దలు కొట్టారు , సింగర్ గా గుర్తింపు రావడానికి అనేక మంది సలహాలు సూచనలు తీసుకొన్నారు. పలు స్టేజీలపై డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ అనేక అవార్డులను పొందారు. అనేక కార్యక్రమాలలో ఫోక్ సాంగ్స్ పాడుతూ ప్రత్యేక ప్రశంసలు పొందారు.
క్రేజ్ తెచ్చి పెట్టిన... కొన్ని ఫోక్ సాంగ్స్...
ఓ బావో సైదులు, ఆనాడేమన్నంటిన తిరుపతి... తిన్నా తీరం పడతలే... అందాల నా మొగుడు, ముద్దుల రాయమల్లు, చలో చలో కమలమ్మ... అనే పాటలు ప్రతి చోటా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇదే బ్యాచ్ సినిమాలో తొలిసారిగా పాట పాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత 'దసరా' మూవీలో రెండోసారి వెండితెరకు అవకాశం దక్కింది. లక్ష్మి దాస్ సింగర్ వాయిస్ ను మెచ్చుకొని మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె అవకాశం ఇవ్వడంతోనే పుష్ప 2.. సినిమాలో ఆరింటికోసారి అనే పాట పాడే అవకాశం లభించింది. ఇప్పుడు ఆ పాట అందరి నోట పాపులర్ కావడంతో సింగర్ లక్ష్మి దాస్ ఆనందంతో ఉన్నారు. తమ ప్రాంతానికి చెందిన సింగర్ కు ఇలాంటి అవకాశాలు దక్కడం పైన స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు...